ఇంటిపై రుణాలుంటే...పన్ను భారం పెరుగుతుంది!
ఈ సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల్లో... ఇంటి ఆదాయంలో ఏర్పడ్డ నష్టానికి సర్దుబాటు విషయంలో ఆంక్షలు విధించారు. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చిన మార్పుల్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఇంటి మీద నష్టాన్ని పూర్తిగా సర్దుబాటు చేయరు. రూ.2,00,000 దాటినా సరే... రూ.2,00,000 వరకే సర్దుబాటు చేసి మిగిలిన మొత్తాన్ని తర్వాతి సంవత్సరానికి బదిలీ చేస్తారు. ఇలా చేయడం వలన 2017–18 పన్ను భారం పెరుగుతుంది. అదెలాగో ఒక ఉదాహరణ రూపంలో చూద్దాం..
31.3.2018కి సంబంధించిన వివరాలు
జీతం మీద ఆదాయం
రూ.10,00,000
ఇంటి మీద అప్పు
రూ.50,00,000.
ఈ అప్పు మీద 10 శాతం
రూ.5,00,000.
ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం మీ ఆదాయం, పన్ను భారం
జీతం
రూ.10,00,000
సర్దుబాటు/నష్టం
రూ.5,00,000
నికర ఆదాయం
రూ.5,00,000
పన్ను భారం
రూ.20,000
కొత్త ప్రతిపాదనల ప్రకారం వడ్డీ సర్దుబాటుని కేవలం రూ.2,00,000లకే పరిమితం చేస్తారు. దీనివల్ల పన్ను భారం పెరుగుతుంది.
జీతం
రూ.10,00,000
ఇంటి మీద నష్టం
రూ.5,00,000
కానీ పరిమితి వలన
రూ.2,00,000
నికర ఆదాయం
రూ.8,00,000
పన్ను భారం
రూ.80,000
కొత్త ప్రతిపాదనల వల్ల పన్ను భారం పెరిగింది. సర్దుబాటు కాని నష్టం తర్వాత సంవత్సరానికి బదిలీ చేస్తారు. దీన్నే క్యారీ–ఫార్వర్డ్ అంటారు. ఈ ఉదాహరణలో రూ.3,00,000 వచ్చే ఆర్థిక సంవత్సరానికి సర్దుబాటు చేస్తారు. ఆ సర్దుబాటు కూడా కేవలం ఇంటి మీద ఆదాయం ఉంటేనే సర్దుబాటు చేస్తారు. లేదంటే బదిలీ చేస్తారు. ఇలా 8 సంవత్సరాల వరకు వెళతారు. ఇలాంటప్పుడు సెల్ఫ్ ఆక్యుపైడ్ వారికి అసలు ఏ మాత్రం సర్దుబాటు కాదు. అద్దెకిచ్చిన వారికి సర్దుబాటు కావచ్చు. ఇంటి మీద నష్టాన్ని, సర్దుబాటును వాయిదా వేయడం వలన అసెసీకి నష్టం. రెండు లక్షల వడ్డీ లోపు వారికి ఎటువంటి నష్టం లేదు. కానీ పెద్ద పెద్ద రుణాలు తీసుకొని ఇల్లు కొనడం వలన ఇన్కమ్ ట్యాక్స్ ప్రయోజనాలు తగ్గిపోయాయి.
పన్ను భారానికి విద్యా సుంకం కలపాలి.