
ప్రేమికుడి నుంచి తనను దూరం చేశారంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బోడ రాజమ్మ అనే యువతి వారం రోజులుగా దీక్ష చేస్తున్న విషయం విదితమే.
సాక్షి, కొత్తగూడెం: ప్రేమికుడి నుంచి తనను దూరం చేశారంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బోడ రాజమ్మ అనే యువతి వారం రోజులుగా దీక్ష చేస్తున్న విషయం విదితమే. అయితే ఈ ఘటన కొత్త మలుపు తిరిగింది. ఆమె డిమాండ్ మేరకు పోలీసులు రెండు రోజుల క్రితం వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. రాజమ్మను వివాహం చేసుకోవాలని పెద్దలు కూడా అతడికి నచ్చజెప్పారు. అయితే, వెంకటేశ్వర్లు వెంట తెచ్చుకున్న ఎలుకల మందు తాగాడు. ఇది తెలుసుకున్న రాజమ్మ కూడా విషం తాగిందని సమాచారం. ఆమెకు మద్దతు తెలుపుతున్న వారు కూడా ఆందోళనకు దిగేందుకు సిద్దమవుతున‍్నట్లు తెలుస్తోంది.
జిల్లాలోని ములకపల్లి మండలం మంచుపోసుగూడెం గ్రామానికి చెందిన బోడ రాజమ్మ(27)కు ఖమ్మంలో డిగ్రీ చదివే సమయంలో ఎల్. వెంకటేశ్వర్లు పరిచయమయ్యాడు. తన క్లాస్‌మేట్ అన్న అయిన అతనితో పరిచయం కాస్తా స్నేహంగా మారి ప్రేమగా పరిణమించింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని వెంకటేశ్వర్లు చెప్పాడు. సుజాతనగర్ మండలం సీతంపేట బంజర గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ప్రస్తుతం నెల్లూరులో ఓ ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే, అతని కుటుంబసభ్యులకు వీరి వ్యవహారం నచ్చలేదని.. దీంతో ఇటీవల నెల్లూరు వెళ్లి వెంకటేశ్వర్లును తమతో పాటు తీసుకెళ్లారని రాజమ్మ ఆరోపణలు చేసింది. అతడిని వెంటనే తనకు చూపాలంటూ రాజమ్మ గత గురువారం నుంచి సీతంపేట బంజర గ్రామంలోని అతడి ఇంటి వద్ద ఆందోళన చేపట్టింది.