‘నిజాం దక్కన్ షుగర్స్’ స్వాధీనంపై సర్కార్ మీనమేషాలు
నిజాం దక్కన్ షుగర్స్ యాజమాన్య పంచాయితీ తగదు తెగడం లేదు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న ఈ పరిశ్రమను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రైతులకు న్యాయం చేయాలంటూ గతంలో టీఆర్‌ఎస్ పోరుబాట పట్టింది. ఈ క్రమంలోనే ఎన్నికలు రావడం టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో చెరుకు రైతులంతా ఆనందపడ్డారు. అయితే టీఆర్‌ఎస్ సర్కార్ పాలన చేపట్టి నెలదాటినా నిజాం దక్కన్ షుగర్స్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు క్రషింగ్ సీజన్ సమీపిస్తుండడంతో రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ పరిశ్రమను స్వాధీనం చేసుకుని బకాయిలు చెల్లించడంతో పాటు యంత్రాల మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
మెదక్: నిజాం దక్కన్ షుగర్స్...జిల్లాలోని చెరుకు రైతుకు ప్రధాన ఆధారం. అందువల్లే ఈ పరిశ్రమను సర్కార్ స్వాధీనం చేసుకోవాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పరిశ్రమను స్వాధీనం చేసుకోవాలో లేదో చెప్పాలంటూ గ్రూప్ అఫ్ మినిస్టర్స్‌తో ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ చెరుకు రైతులతో మాట్లాడడంతో పాటు స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేసుకోవాలని సిఫార్సు చేసినా, అది అమలుకు నోచుకోలేదు. అప్పట్లో ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేయాలంటూ ఉద్యమ బాట పట్టిన టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి 40 రోజులు దాటినా ఫ్యాక్టరీ పంచాయతీ తెగలేదు.
మరోవైపు చెరుకు సీజన్ దగ్గర పడుతున్నా యాజమాన్య హక్కులు తేలక.. మూలన పడ్డ మిషన్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. రైతన్నలు గొంతెత్తి ఘోషించినా..జిల్లా క లెక్టర్ ఆదేశించినా..రూ 7.62 కోట్ల చెరుకు బకాయిలు చెల్లించడం లేదు.
మెదక్ మండలం మంబోజిపల్లిలోని నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేయాలంటూ 2014 జనవరి 7వ తేదీన చెరుకు రైతుల పోరాట సమితి హైకోర్టులో పిటీషన్ వేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ 2014 జనవరి 17న సిఫార్సు చేసింది.
ఈ సిఫార్సును అప్పటి ముఖ్యమంత్రి ఆమోదించినట్లు అప్పట్లో వార్తలు వచ్చినా, అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. అప్పట్లో నిజాం దక్కన్ షుగర్ ప్యాక్టరీని ప్రభుత్వపరం చేయాలంటూ గులాబీదళం పోరుబాట పట్టింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఏర్పాటు కావడం, టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో పాటు అనుకున్నట్లుగానే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వపరం చేస్తూ ఉత్తర్వులు వెలువడుతాయని రైతులంతా ఎదురు చూస్తున్నారు. అయితే అప్పట్లో నిజాం దక్కన్ షుగర్ ప్యాక్టరీ యాజమాన్యానికి రూ. 234 కోట్లు ఇచ్చి ప్యాక్టరీని ప్రభుత్వపరం చేసుకోవాలంటూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఫారసు చేసినట్లు సమాచారం.
తెలంగాణ ప్రభుత్వంలో యత్నాలు
ఎన్డీఎస్‌ఎల్ ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేయాలని కోరుతూ చెరుకు రైతు పోరాట సమితి ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి, రైతు నాయకులు నర్సింహారెడ్డిలు ఇప్పటికే మూడుసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆయన సూచన మేరకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సచివాలయంలోని న్యాయ విభాగం సలహా తీసుకుంటూ డ్రాఫ్టింగ్ తయారు చేయాలని ఆదేశించారు.
ఇదే సమయంలో హైకోర్టులో రైతుసంఘం నాయకులు గత ప్రభుత్వ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఫార్సును అమలు చేయాలంటూ అమెండ్‌మెంట్ ఆఫ్ పిటీషన్ వేశారు. అయితే ఈ పిటీషన్‌కు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ ఆమోదాన్ని తెలుపుతూ పిటీషన్ వేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాగా సకాలంలో హైకోర్టు బెంచ్‌పైకి పిటీషన్ రాకపోవడంతో నిర్ణయం ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.
నవంబర్‌లో క్రషింగ్.. మరమ్మతులు ఎలా?
ఈసారి చెరుకు క్రషింగ్ నవంబర్‌లో ప్రారంభం కావాల్సి ఉంది. అయినప్పటికీ ఫ్యాక్టరీలోని మిషన్లకు ఇప్పటి వరకు మరమ్మతులు ప్రారంభం కాలేదు. మరమ్మతులు చేయడానికి ఎంతలేదన్నా 3 నుంచి 4 నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. ఫ్యాక్టరీ భవిష్యత్‌పై నిర్ణయం వెలువడక పోవడంతో ప్రైవేట్ యాజమాన్యం మిన్నకుండి పోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వపరం కాకపోవడంతో అటువైపు నుంచి కూడా మరమ్మతుల కోసం చర్యలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
ఈసారి సుమారు 2 లక్షల టన్నుల చెరుకు క్రషింగ్ జరిగే అవకాశం ఉంది. గత ఏడాది 1,53,731 టన్నుల చెరుకు క్రషింగ్ జరిగింది. ఈసారి ఎక్కువ మొత్తంలో చెరుకు ఉన్నందున త్వరగా మరమ్మతులు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యంపై ప్రభుత్వ నిర్ణయం ఎంత త్వరగా వెలువడితే అంత త్వరగా మరమ్మతులు ప్రారంభమయ్యే అస్కారం ఉంది.
గుదిబండగా మారిన బకాయిలు
చెరుకు రైతులకు జూలై 7లోగా ఏడు విడుతల్లో మొత్తం బకాయిలు చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ ఎదుట ఎన్డీఎస్‌ఎల్ యాజమాన్యం లిఖితపూర్వకంగా ఒప్పందం చేసుకుంది. కానీ ఇంత వరకు ఏడో విడత ద్వారా రావాల్సిన రూ.3.04 కోట్ల బకాయిలు చెల్లించలేదని చెరుకు రైతు సంఘం నాయకులు నాగిరెడ్డి తెలిపారు. అలాగే బోనస్ కింద రూ.4.58 కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేయగా, ఆయన ఇండస్ట్రీయల్ కామర్స్ విభాగ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసినట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫ్యాక్టరీని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని రైతులకు మేలు చేయాలని నాగిరెడ్డి కోరారు.
తెగని పంచాయితీ
Published Sun, Jul 13 2014 12:14 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement
Advertisement