- సమ్మెను పట్టించుకోకపోవడం దౌర్భాగ్యం
- విచ్ఛిన్నానికి కుట్రలు చేయడం సిగ్గుచేటు
- అఖిలపక్ష నాయకులు
- ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ధర్నా, ర్యాలీ
హన్మకొండ : ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు చొరవ చూపాలని అఖిల పక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులు సమ్మె చేస్తుంటే సీఎం ఢిల్లీకి వెళ్లడం, కుమారుడైన మంత్రి కేటీఆర్ విదేశీయానం చేస్తుండగా, అల్లుడైన మంత్రి హరీష్‌రావు కమీషన్లకై మిషన్ కాకతీయ అంటూ తిరుగుతున్నారని అఖిలపక్ష పార్టీల నాయకులు ధ్వజమెత్తారు. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా అఖిలపక్ష పార్టీల నాయకుల ఆధ్వర్యంలో శనివారం హన్మకొండలోని ఏకశిల పార్కులో ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీ తీసి, అనంతరం అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.
అఖిలపక్ష నాయకులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అంతకు ముందు ఏక శిల పార్కులో జరిగిన ధర్నాలో అఖిలపక్షాల నాయకులు మాట్లాడారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని స్వయంగా ప్రకటించారన్నారు. ఆర్టీసీ కార్మికులు ఉద్యమంలో పాల్గొనడంతోనే తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు జరిగిందన్నారు. ఆర్టీసీకి విధిస్తున్న పన్నులను ఎత్తివేసి 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం ద్వారా వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు.
డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాన్ని మరిచారని విమర్శించారు. కార్మికుల పోరాటాన్ని విచ్ఛిన్నం చేయడం కాదు..చేతకాకపోతే అధికారంలో నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ కార్మిక ద్రోహులపట్ల ఆర్టీసీ కార్మికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్మికులకు ఫిట్‌మెంట్ పెంచితే ఛార్జీలు పెంచాల్సి వస్తుందని రవాణ శాఖ మంత్రి పేర్కొనడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. టీడీపీ నగర అధ్యక్షుడు అనిశెట్టి మురళీమనోహర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఎవరు రోడ్డెక్కాల్సిన అవసరం రాదని ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యూక రాష్ట్రంలో అందోళనలు పెరిగాయన్నారు. న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు నున్నా అప్పారావు మాట్లాడుతూ తెలంగాణ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా మంత్రి హరీష్‌రావు ఉన్నప్పటికీ ఎందుకు సమస్యను పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ యువత జిల్లా అధ్యక్షుడు మునిగాల కళ్యాణ్‌రాజు మాట్లాడుతూ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటోందని మండిపడ్డారు. ధర్నా, ర్యాలీలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు సీహెచ్.రాంచందర్, ఈదురు వెంకన్న, సీహెచ్ యాక స్వామి, ఈఎస్ బాబు. జి.సారంగపాణి, సదాశివరావు, ఆయా పార్టీల నాయకులు ప్రభాకర్‌రెడ్డి, ఎం.చుక్కయ్య, పనాస ప్రసాద్, సిరబోయిన కర్ణాకర్, సాంబయ్య నాయక్, శివ, మేకల రవి, ఆర్టీసీ కార్మికులు, ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సమ్మెపై సీఎం చొరవ చూపాలి
Published Sun, May 10 2015 1:43 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
Advertisement
Advertisement