![No Medicines And Pensions For Aids Patients - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/7/aids.jpg.webp?itok=gDgiTi6m)
సాక్షి, సిటీబ్యూరో: చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న హెచ్‌ఐవీ(ఎయిడ్స్) బాధితులకు ఆదరణ కరువైంది. ఓ వైపు సకాలంలో మందులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, మరో వైపు చికిత్స వెళ్లిన సమయంలో వైద్య సిబ్బంది తీరుతో మానసికంగా మరింత కుంగిపోతున్నారు. బాధితులను ఆప్యాయంగా పలకరించి, వారికి మనోధైర్యం కల్పించాల్సిన ఏఆర్‌టీ(యాంటి రెట్రల్ వైరల్ సెంటర్) వైద్య సిబ్బంది సూటిపోటి మాటలతో మానసికంగా హింసిస్తున్నారు. ఆస్పత్రికి వెళ్లి సిబ్బంది సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురయ్యే కంటే..మందులు వేసుకోకుండా జబ్బుతో చావడమే మేలనే నిర్ణయానికి వస్తున్నారు.
కొత్తగా మరో 12 వేల కేసులు...
తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 1,97,126 మంది హెచ్‌ఐవీ బాధితులు ఉండగా, వీరిలో 76,746 మంది మాత్రమే ఏఆర్‌టీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. 2017–18లో 63,1574 మందికి హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించగా, వీరిలో 11,820 మందికి హెచ్‌ఐవీ పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 692 మంది గర్భిణులు ఉండగా, 750 మంది చిన్నారులు ఉన్నారు. 60 శాతానికి పైగా బాధితులు గ్రేటర్ పరిధిలో ఉండగా, వీరికి గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఎర్రగడ్డలోని ఛాతి ఆస్పత్రి, కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రులో ఏఆర్‌టీ సెంటర్‌లలో చికిత్సలు అందిస్తున్నారు. ఇక్కడ వీరికి సకాలంలో వైద్యసేవలు అందకపోవడంతో బాధితుల్లో చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఏఆర్‌టీ సెంటర్లలో మందులు మాత్రమే ఇస్తూ వారికి అవసరమైన న్యూట్రిషన్‌ను అందించక పోవడం కూడా బాధితుల చావుకు కారణమవుతోంది.
అటు నుంచి ఇటు...ఇటు నుంచి అటు..
జిల్లా కేంద్రాల్లోని ఏఆర్‌టీ సెంటర్లలో చికిత్సలకు వెళితే..బంధువులెవరైనా గుర్తించే ప్రమాదం ఉందని భావించి, బాధితుల్లో చాలా మంది నగరంలోని ఏఆర్‌టీ సెంటర్లకు చేరుకుంటున్నారు. వీరిలో సీడీ 4 కౌంట్ 350 కన్న తక్కువ ఉన్న వారికి ప్రతి నెలా సీడీ 4 కౌంట్ పరీక్ష చేసి, మందులు పంపిణీ చేస్తారు. ఆయా ఏఆర్‌టీ కేంద్రాల్లో పని చేస్తున్న వైద్య సిబ్బంది వైఖరితో వీరు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఒక నెలలో ఒక సెంటర్‌లో మందులు తీసుకున్న వారు మరో నెలలో మరో సెంటర్‌కు బదిలీ చేయించుకోవడం రోగుల పట్ల సిబ్బంది వైఖరికి అద్దం పడుతోంది.
ఉస్మానియాలోనూ తప్పని తిప్పలు..
ఇదిలా ఉండగా ఉస్మానియా ఆస్పత్రి ఏఆర్‌టీ సెంటర్ అవుట్ పేషంట్ విభాగానికి ప్రతి రోజూ 250–300 మంది రోగులు వస్తుండగా, వీరికి చికిత్స చేయడానికి సరిపడ వైద్యులు లేకపోవడంతో వైద్య సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. చికిత్స కోసం వచ్చిన కొందరు రోగులకు టీబీ కూడా ఉండటంతో వారు దగ్గినప్పుడు గాలి ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. ఉస్మానియా సహా గాంధీలో సరిపడా మందులు ఇవ్వక పోవడంతో తరచూ రోగులు ఆందోళనకు దిగాల్సి వస్తోంది. ఇక నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రిలోని ఏఆర్‌టీ సెంటర్‌లోని కనీస వైద్యసేవలు అందడం లేదు. వైద్యులు వేళకు రాకపోవడం, ఒక వేళ వచ్చినా మధ్యాహ్నం రెండు గంటలకే తిరుగు ప్రయాణం కడుతుంటంతో సరిహద్దు జిల్లాల నుంచి వచ్చే రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment