నాన్చుడే.. తేల్చేదెన్నడో? | no response to cases | Sakshi
Sakshi News home page

నాన్చుడే.. తేల్చేదెన్నడో?

Published Mon, Nov 17 2014 11:56 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM

no response to cases

మెదక్: పోలీస్ స్టేషన్‌కు వస్తున్న ఫిర్యాదులపై వెంటనే స్పందించడం లేదని బాధితులు ఆరోపించారు. దరఖాస్తు ఇచ్చిన తరువాత కేసు నమోదులో తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం పీఎస్‌ల విజిట్ నిర్వహించిన ‘సాక్షి’కి ఇసుక దందా చేసే పలువురు దళారులు స్టేషన్లో ఉండటం కనిపించింది. మెదక్ రూరల్ పీఎస్‌లో హవేళిఘనపూర్ తండాకు చెందిన బూలిని భర్త బంధువులు తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. ఔరంగాబాద్‌తండాకు చెందిన పోచమణి భర్త పుండరీకం తనను వేధిస్తున్నాడని బాబును ఎత్తుకెళ్లాడని ఫిర్యాదు చే సింది.

చిన్నశంకరంపేటలో శాలిపేటకు చెందిన మల్లవ్వ తన భర్త రాజయ్య వేధింపులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ నగేష్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. పాపన్నపేట పోమ్లాతండాకు చెందిన మెగావత్ తనను అత్త సాలి, మరిది రాజు, వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేసింది. భర్త మరణించడంతో తన ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపింది. ఎల్లాపూర్‌లో పొలాలకు వేస్తున్న రోడ్డును కొంతమంది రైతులు మూసేశారని బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. రామాయంపేటలో లక్ష్మాపూర్‌కు చెందిన వెంకటమ్మ తనపై బంధువులు దాడిచేశారని ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ సందీప్‌రెడ్డి ఇరువర్గాలను పిలిపించి విచారించారు.

 న్యాయం కోసం ప్రదక్షిణలు
 గజ్వేల్: పలు కేసుల్లోని నిందితులను అరెస్టు చేయడంలో జాప్యం జరుగుతోందని, దీంతో పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని పలువురు బాధితులు పోలీసులకు విన్నవించారు. నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, గౌరారం, ములుగు, జగదేవ్‌పూర్, కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్లలో ‘సాక్షి’ ఏక కాలంలో చేపట్టిన విజిట్‌లో పలు అంశాలు వెలుగుచూశాయి.

గజ్వేల్ పీఎస్‌లో ఉదయం 11గంటలకు రూల్ కాల్ నడుస్తోంది. ఎస్‌ఐ జార్జి కానిస్టేబుళ్లకు విధులు కేటాయిస్తున్నాడు.. ఇదే సమయంలో పిడిచెడ్ గామానికి చెందిన బాబు తన భార్య, కూతురు, కూతురు పిల్లలతో కలిసి వచ్చాడు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆయనను పలకరించగా.. తన కూతురు భర్త రెండో వివాహం చేసుకున్నాడని, ఈ విషయంలో మూడేళ్ల కిందట కోర్టులో కేసు వేసినా అతను మాత్రం పేషీలకు హాజరు కావడం లేదన్నాడు. దీంతో వారెంట్లు కూడా జారీ అయ్యాయని చెప్పారు.

వారెంట్ వచ్చినా అతన్ని అరెస్టు చేయడం లేదని తెలిపారు. రూల్ కాల్ ముగియగానే బాధితుడు ఎస్‌ఐని కలిసి తమకు న్యాయం చేయాలని కోరాడు. వెంటనే స్పందించిన ఎస్‌ఐ సదరు వ్యక్తిని అరెస్టు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. మిగతా పీఎస్‌లలోనూ బాధితులు న్యాయం కోసం ప్రదక్షిణలు చేస్తున్న దృశ్యాలే కనిపించాయి.

 పీఎస్‌లలో ఫిర్యాదుల సేకరణ
 సిద్దిపేట అర్బన్: పట్టణంలో నూతన పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రావడంతో సిబ్బంది ఉదయం 10 గంటల నుంచి ఫర్నిచర్, స్టేషనరీని తరలించే పనిలో కనిపించారు. వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐ సత్యనారాయణ ఓ మహిళ హత్య కేసుకు సంబంధించిన నిందితులను పట్టుకోవడానికి నంగునూరు మండలం రాజ్‌గోపాల్‌పేట పీఎస్ పరిధిలోకి వెళ్లారు. అందుబాటులో ఉన్న సిబ్బంది ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.

 ఈ సందర్భంగా ఓ మహిళ తనను అకారణంగా దూషిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. తన ఇంటి గోడను పక్కింటి వారు కూల్చివేశారని మరో మహిళ దరఖాస్తు అందజేసింది. ఎలుకల మందుతో కోళ్లను చంపేస్తోందని ప్రశాంత్‌నగర్‌కు చెందిన లక్ష్మి మరో మహిళపై ఫిర్యాదు చేయగా ఇరువురిని పిలిపించి కౌన్సిలింగ్ చేసి పంపించారు. బంజేరుపల్లికి చెందిన బాధితులు భూ వ్యవహారంపై రూరల్ ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు.

నంగునూరు, ముండ్రాయికి చెందిన బాధితులు రాజగోపాల్‌పేట పీఎస్‌కు వచ్చి ఎస్‌ఐ గోపాల్‌రావుతో భార్యాభర్తలకు సంబంధించిన విషయంపై మాట్లాడారు. చిన్నకోడూరు పీఎస్‌లో మల్యాల, అల్లీపూర్‌కు చెందిన భార్య భర్తలకు సంబంధించిన వారు స్టేషన్‌కు వచ్చారు. ఎస్‌ఐ ఆనంద్‌గౌడ్ వారికి సంబంధించిన వారిని స్టేషన్‌కు పిలిపించి విచారణ జరుపుతున్నారు.

 దుబ్బాకలో ప్రెండ్లీ పోలీస్
 దుబ్బాక: దుబ్బాక నియోజకవర్గంలో రెండు సర్కిల్ పోలీసు స్టేషన్లు, ఆరు పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఇందులో దుబ్బాక, తొగుట సర్కిల్ పోలీసు స్టేషన్ల పరిధిలో దుబ్బాకతో పాటు మిరుదొడ్డి, భూంపల్లి, తొగుట, దౌల్తాబాద్, చేగుంట పీఎస్‌లు ఉన్నాయి. సోమవారం వీటిని సందర్శించిన ‘సాక్షి’ పలు సమస్యలను సేకరించింది. దుబ్బాక పోలీసు స్టేషన్‌కు సమస్యల పరిష్కారం కోసం వచ్చే ఫిర్యాదు దారులతో పోలీసులు ఫ్రెండ్లీ పోలీసుగా వ్యవహరించారు. చిన్న చిన్న విషయాల్లో పోలీసులు ఇరు వర్గాలతో మాట్లాడి రాజీ మార్గాన్ని సూచిస్తున్నారు. ఫిర్యాదు దారులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించకుండా ఇరువవర్గాలకు అర్థమయ్యే విధంగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

  పోలీసులు బిజీబిజీ
 పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గంలోని మూడు పీఎస్‌లను ‘సాక్షి’ సందర్శించింది. పటాన్‌చెరు పీఎస్‌లో సీఐ శంకర్‌రెడ్డి తన సీటులో కూర్చుని పాత ఫైళ్లకు సంబంధించిన రికార్డులు చూస్తూ బిజీగా ఉన్నారు. గౌతంనగర్‌లోని తన ఇంట్లో మూడేళ్ల క్రితం చోరీ జరిగిందని ఇప్పటికీ తనకు న్యాయం జరగలేదని పట్టణానికి చెందిన లక్ష్మవ్వ వాపోయింది. కిడ్నీ దానం చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ డాలి అనే మహిళ సీఐని కలిసింది. ఇంతలోనే తప్పిపోయిన ఓ పదేళ్ల కుర్రాడిని పోలీసులు పట్టుకువచ్చారు. తీసుకవచ్చారు. సీఐ శంకర్‌రెడ్డి ఆ బాలుడితో మాట్లాడుతూ.. వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. తమది లింగపల్లి అని, తండ్రి పేరు అబ్దుల్ ఖాదర్ అని చెప్పాడు. తాము మొత్తం పది మంది పిల్లలమని చెప్పాడు.  

 రామచంద్రాపురం పోలీస్టేషన్‌లో సీఐ నరేందర్, ఎస్‌ఐ రవీందర్‌రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. పూర్వ కేసులను ఫిర్యాదు దారులతో వారు వివరాలను సేకరించారు. విద్యుత్‌నగర్‌కు చెందిన కిష్టయ్య తన కొడుకు కిరన్‌తో ప్రాణభయం ఉందని ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు. దాంతో ఎస్‌ఐ రవీందర్ కిరణ్‌ను పిలిపించి కౌన్సిలింగ్ చేశారు. బండ్లగూడకు చెందిన అన్నదమ్ములు కుమార్, గోపాల్ ఇంటి ప్రహరీ విషయంలో గొడవపడి పీఎస్‌కు వచ్చారు. కానుకుంటకు చెందిన గోపీకృష్ణారెడ్డి అనే యువకుడు తన స్నేహితుడిపై దాడి చేస్తున్నారని వారిని విడిపించే ప్రయత్నం చేయగా గోపీని కొంత మంది యువకులు కత్తితో పొడిచారు. రక్తం నిండిన చొక్కాతోనే అతను పీఎస్‌కు రాగా ఎస్‌ఐ రవీందర్‌రెడ్డి వెంటనే 108 సిబ్బందితో చికిత్స చేయించారు. అనంతరం కొల్లూరులోని తమ ప్లాట్లను కొందరు ఆక్రమించారంటూ అల్వాల్‌కు చెందిన శ్రీనివాస్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement