ఎయిర్‌పోర్టులో కార్డన్ సెర్చ్‌లో క్యాబ్ డ్రైవర్లతో మాట్లాడుతున్న పోలీసులు (ఫైల్)
సాక్షి, శంషాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమతి లేకుండా కొనసాగుతున్న క్యాబ్‌లకు అడ్డుకట్ట పడడం లేదు. ప్రయాణికులకు భద్రత లేకుండా కొనసాగుతున్న ఈ వ్యాపారాన్ని అడ్డుకోడానికి పోలీసులు తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నా కొందరు క్యాబ్ డ్రైవర్లు ఎలాంటి భయం లేకుండా వారి వ్యాపారాన్ని యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఎయిర్‌పోర్టులోకి బుకింగ్‌ల ఆధారంగానే క్యాబ్‌లకు పర్మిషన్ ఇస్తారు. విమానంలో వచ్చే ప్రయాణికులు ముందస్తుగా బుకింగ్ చేసుకున్న వాహనాలతో పాటు ప్రైవేటు వాహనాలు కూడా సమయానుకూలంగా అరైవల్, డిపార్చుర్ కేంద్రాలకు చేరుకుంటాయి. ఆ సమయంలో బుకింగ్ చేసుకున్న కార్లలో ప్రయాణికులు అక్కడి నుంచి నేరుగా వెళ్లిపోతాయి.
నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఎయిర్‌పోర్టులో ఎలాంటి అనుమతులు లేకుండా కార్లు తిరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం జరిగిన సంఘటన కూడా ఓలా బుకింగ్ స్థానంలో మరో కారు డ్రైవరు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకొని కిడ్నాప్‌కు యత్నించిన సంఘటన కలకలం రేపింది. బుకింగ్ కూడా లేకుండా ఎయిర్‌పోర్టులోకి క్యాబ్‌లు ఎలా ఎంటర్ అవుతున్నాయని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అనుమతులు లేకుండా ఎయిర్‌పోర్టులో తిరుగుతున్న కార్లకు సంబంధించి సుమారు 300కు పైగా టౌటింగ్ కేసులు నమోదు చేశారు. ప్రతిరోజు రెండు నుంచి మూడు ఈ తరహా కేసులు నమోదవుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.
కార్డన్ సెర్చ్‌లో..
శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో గత ఐదు, ఆరు మాసాలుగా ఎయిర్‌పోర్టులో కూడా పలుమార్లు కార్డన్ సెర్చ్‌లో కూడా టౌటింగ్ కేసులే అత్యధికంగా నమోదయ్యాయి. ప్రయాణికులను బలవంతంగా కార్లలో ఎక్కించుకుంటున్న క్యాబ్ డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. టౌటింగ్‌పై పోలీసులు సీరియస్‌గా వ్యవహరిస్తున్నా.. అనుమతి లేకుండా ప్రయాణికులను క్యాబ్‌లలో ఎక్కించుకుంటున్న దందా మాత్రం ఆగడం లేదు. ఎయిర్‌పోర్టులో జరుగుతున్న అక్రమ దందాపై ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. అనుమతి లేకుండా జరుగుతున్న టౌటింగ్ వ్యవహారాన్ని పూర్తిస్థాయిలో అడ్డుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
కేసులు నమోదు చేస్తున్నాం
అనుమతి లేకుండా, బుకింగ్ లేకుండా ప్రయాణికులను తీసుకెళ్తున్న క్యాబ్ డ్రైవర్లపై టౌటింగ్ కేసులు నమోదు చేస్తున్నాం. ప్రయాణికులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. బుకింగ్ లేని కార్లలో ప్రయాణిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ఎయిర్‌పోర్టులో టౌటింగ్ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం
– నారాయణరెడ్డి, ఆర్‌జీఐఏ ట్రాఫిక్ సీఐ
Comments
Please login to add a commentAdd a comment