- పనులు చేయకుండానే నిధుల విడుదల
- విచారణ చేపట్టాలని కలెక్టర్‌కు టీఆర్‌ఎస్ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ సకినాల శోభన్ ఫిర్యాదు
- దుమారం రేపుతున్న చెరువుల మరమ్మతు పనులు
ములుగు : అధికార పార్టీ అండదండలతో కొందరు కాంట్రాక్టర్లు అందినకాడికి దోచుకున్నారు. చెరువుల మరమ్మతు పనులు చేపట్టకుండానే అక్రమాలకు పాల్పడి పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులను కాజేశారు. కాగా, నాసిరకంగా చేపట్టిన పనులపై ఇటీవల టీఆర్‌ఎస్ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ సకినాల శోభన్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. 2012-13లో కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గంలోని చెరువుల తూములు, కట్టలు కొట్టుకపోయాయని ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మరమ్మతు పనులకు నిధులు మంజూరు చేసింది. నిబంధనల ప్రకారం చెరువు పనులు ఆయకట్టు రైతులకు మాత్రమే దక్కాల్సి ఉంది. కానీ.. కొంత మంది కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం అందించి టెండర్లు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. కాగా, 2012-13లో చేపట్టిన చెరువుల మరమ్మతు పనుల్లో కాంట్రాక్టర్లు పనులు చేయకుండానే లక్షలాది రూపాయల నిధులు కాజేశారని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులు పక్కదారి పట్టేందుకు అప్పటి ఐబీ ఏఈలు, డీఈ, ఈఈలు కూడా కాంట్రాక్టర్లకు సహకరించారనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా, చెరువుల మరమ్మతు పనుల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, అవినీతి సొమ్మును ఆర్‌ఆర్‌యాక్టు ద్వారా వెంటనే ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యే విధంగా చూడాలని.. ప్రస్తుత టీఆర్‌ఎస్ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ సకినాల శోభన్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం చర్చంశనీయంగా మారింది. కాగా, దీనిపై ‘సాక్షి’ వివరాలు సేకరించగా.. పలు గ్రామాల ప్రజలు చెరువు కట్టల పనుల్లో అవినీతి జరిగిందని, కొన్ని చోట్ల తూతూ మంత్రంగా పనులు చేసి పూర్తి నిధులు కాజేశారని బహిరంగంగా తెలిపారు.
విడుదలైన నిధులు ఇవే...
గోవిందరావుపేట మండలంలోని రంగాపురం చెరువుకు రూ.2.78 లక్షలు, చల్వాయి కోటకు రూ.1.50 లక్షలు, నర్సింహులు చెరువుకు రూ.2లక్షలు, తాడ్వాయి మండలంలోని మేడా రం శివరాంకుంటకు రూ.4.38 లక్షలు, కొత్తగూడ మండలంలోని వేలుబెల్లి మేడికుంటకు రూ.4.69 లక్షలు, ములుగు మండలంలోని లోకం చెరువుకు రూ.4.47 లక్షలు, పత్తిపల్లి ఎదుళ్ల చెరువుకు రూ.57, 474లు, ఊరచెరువుకు రూ.75,350, ఇంచర్ల పెద్దదామెర చెరువుకు రూ.18,594, ఏటూరునాగారం మండలంలోని హన్మంతుకుంటకు రూ.1.26 లక్షలు, ఇప్పకుంటకు రూ.93,560, ఇంచర్ల చిన్నదామెర చెరువుకు రూ.37,081, ఏటూరునాగారం మాటు కుంటకు రూ.98,800, పెద్దచెరువుకుంటకు రూ.1.41లక్షలు, తీగలకుంటకు రూ.1.17లక్షలు, సారలమ్మ కుంటకు రూ.1.13లక్షలు, సాకలికుంటకు రూ.1.03 లక్షలు, పాలకుంటకు రూ.93,560, చిన్నబోయినపల్లిలోని అలుగుబెల్లిచెరువుకు రూ. 1.31 లక్షలు, రాధమ్మకుంటకు రూ. 1.22 లక్షలు, ఈదులకుంటకు రూ.93,726, పగిడిచెరువుకు రూ.1.22లక్షలు, నర్సయ్యకుంటకు రూ.1.22 లక్షలు, లింగాలగండి చెరువుకు రూ.1.31లక్షలు, ఊరకుంటకు రూ.1.59లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది.
కాగా, ఈ నిధులు మార్చి నెలాఖరులో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల ఖాతాలో జమ అయ్యాయి. విషయం తెలుసుకున్న ప్రజలు ఆందోళన చేయడంతో మరమ్మతు పనుల విషయం బయటికి వచ్చింది. ఇదిలా ఉండగా, ఈ విషయమై గత నెలలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించేందుకు వచ్చిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌కు ములుగు మండలంలోని బండారుపల్లి గ్రామ రైతులు ఫిర్యాదు చేశారు. కాగా, కలెక్టర్ ప్రత్యేక చొరవచూపి చెరువు కట్టల మరమ్మతు పనుల్లో చోటుచేసుకున్న అవినీతిపై విచారణ జరపాలని రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, లక్షలాది రూపాయలతో మరమ్మతులు చేపట్టిన చెరువులనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం తిరిగి మిషన్ కాకతీయ పథకం కింద ఎంపిక చేసి మళ్లీ నిధులు మంజూరు చేయడం పలు విమర్శలకు తావిస్తుంది.
మరమ్మతు పనుల్లో మాయాజాలం
Published Sun, May 10 2015 1:55 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement
Advertisement