పాలమూరుకు రెండో విడతే గిరిజనులకు దక్కని అవకాశం ఖమ్మంకు లేనట్టే!
హైదరాబాద్: ముఖ్యమంత్రితో కలిపి 12 మందితో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గంలో మహిళలకు చోటు దక్కలేదు. మహబూబ్‌నగర్ జిల్లాకు కూడా ఈ కేబినెట్‌లో ప్రాతినిధ్యం లభించలేదు. అలాగే ఖమ్మం జిల్లాకు ప్రస్తుతానికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు లేవు. టీఆర్‌ఎస్‌కు ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలున్నారు. వీరిలో కనీసం ఇద్దరికి మంత్రి పదవులు వస్తాయని భావించారు. అయితే తొలి కేబినెట్‌లో మహిళలెవరికీ చోటు దక్కలేదు. దీంతో పదవులు ఆశించిన మహిళానేతలు నిరాశకు గురయ్యారు.
పాలమూరు ఎక్కడ?
మహబూబ్‌నగర్ జిల్లాకు తొలి కేబినెట్‌లో అవకాశం రాలేదు. ఈ జిల్లా నుంచి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, పార్టీకి జిల్లా అధ్యక్షునిగా పనిచేసి, ఉద్యమం సందర్భంగా మొదట రాజీనామా చేసిన చెరుకు లక్ష్మారెడ్డిలో ఒకరికి అవకాశం వస్తుందని భావించారు. అయితే మంత్రివర్గంలో ఇప్పటికే కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ ముగ్గురూ ఒకే సామాజికవర్గం(వెలమ) నుంచి ఉండటం వల్ల అదే సామాజికవర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావుకు దీనిలో అవకాశం రాలేదు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మారెడ్డి ఉద్యమంకోసం అందరికంటే ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పార్టీకి జిల్లా అధ్యక్షునిగా, పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఉన్నారు. ఈయనకు మొదటి విడతలోనే పదవి వస్తుందని అనుకున్నా సామాజికవర్గ సమతూకం కోసం రెండో విడతకు వాయిదా పడినట్టు టీఆర్‌ఎస్‌లోని ముఖ్యులు చెబుతున్నారు. అయితే వి.శ్రీనివాస్‌గౌడ్ కూడా మంత్రివర్గంలో చోటును ఆశిస్తున్నారు. అయితే స్వామిగౌడ్‌ను మంత్రిని చేస్తానని కేసీఆర్ గతంలో బహిరంగంగానే హామీ ఇచ్చారు. ఇప్పటికే పద్మారావు అదే సామాజికవర్గం నుంచి మంత్రివర్గంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో స్వామిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్‌లో ఒకరికి మాత్రమే అవకాశం రావచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఖమ్మంకు నో చాన్స్!
ఖమ్మం జిల్లాకు తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాల్లేవు. ఈ జిల్లా నుంచి టీఆర్‌ఎస్‌కు ఒకే ఎమ్మెల్యే సీటు ఉంది. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జలగం వెంకట్రావు కూడా వెలమ సామాజికవర్గానికే చెందినవారు కావడం వల్ల ఈ జిల్లాకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకూడదని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. విప్ వంటి పదవులకు కూడా పోటీ ఎక్కువగా ఉండటం వల్ల ఆ అవకాశం కూడా దక్కకపోవచ్చని తెలుస్తోంది. అలాగే కేబినెట్‌లో ఎస్టీలకు కూడా ప్రాతినిధ్యం దక్కలేదు. ఈ సామాజికవర్గంలో సీనియరుగా ఉన్న అజ్మీరా చందూలాల్‌కు అవకాశం వస్తుందని భావించారు. అయితే అనూహ్యంగా మంత్రివర్గంలో ఆయన పేరు కనిపించలేదు.
విస్తరణలో అవకాశం: కవిత
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మహిళలకు అవకాశం లభిస్తుందని ఎంపీ కవిత చెప్పారు. సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్‌రావు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ మొదటి కేబినెట్‌లో మహిళలు లేకపోవడంపై ఏమంటున్నారని విలేకరులు అడగ్గా.. మొదటిరోజే ప్రశ్నలతోనే ఇబ్బంది పెడితే ఎలా అని నవ్వుతూ అంటూనే విస్తరణలో అవకాశం ఉంటుందని భావిస్తున్నానన్నారు. కేబినెట్‌లో మొత్తం 18 మంది వరకు తీసుకునే అవకాశం ఉంది కదా అని పేర్కొన్నారు. ఇంతకుముందు ముట్టడి కోసం సచివాలయానికి వచ్చిన టీఆర్‌ఎస్‌కు ఇప్పుడు రెడ్ కార్పెట్ స్వాగతం దక్కడం తమ అదృష్టమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పేర్కొన్నారు.
టీ కేబినెట్‌లో మహిళలకేదీ ప్రాతినిధ్యం?
Published Tue, Jun 3 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 8:13 AM
Advertisement
Advertisement