తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి
- మత్తయ్య పిటిషన్ వ్యవహారంలో జస్టిస్ శివశంకరరావుకు అడ్వొకేట్ జనరల్ విజ్ఞప్తి
- న్యాయమూర్తి తీరుపై సందేహముంటే ఇలా తప్పుకోవడం పరిపాటని నివేదన
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసు నిందితుడు మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి తప్పుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావును రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి కోరారు. న్యాయమూర్తి తీరుపై ఆందోళన వ్యక్తమైన సందర్భంలో ఆ కేసు విచారణ నుంచి ఆ న్యాయమూర్తి తప్పుకోవడం పరిపాటని ఆయన నివేదించారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో తనపై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ నిందితుడు మత్తయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
అయితే న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావును ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని అభ్యర్థిస్తూ స్టీఫెన్‌సన్ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిగినప్పుడు... ఈ పిటిషన్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనం దువల్ల ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయ డం లేదని ఏజీ రామకృష్ణారెడ్డి కోర్టుకు తెలి పారు. దాంతో న్యాయమూర్తి ఈ విషయాన్ని రికార్డ్ చేసుకుని తీర్పును సోమవారానికి వాయిదా వేశారు. అయితే శుక్రవారం రేవంత్‌రెడ్డి తదితరుల బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిసిన వెంటనే ఏజీ నేరుగా జస్టిస్ శివశంకరరావు కోర్టుకు వెళ్లారు.
స్టీఫెన్‌సన్ అనుబంధ పిటిషన్ గురించి ప్రస్తావించి, తన అభిప్రాయాన్ని తెలపాలనుకుంటున్నానని చెప్పారు. న్యాయమూర్తి అనుమతినివ్వడంతో... కేసు విచారణ నుంచి తప్పుకోవాలన్న స్టీఫెన్‌సన్ విజ్ఞప్తిని మన్నించాలని కోరారు. కేసు నుంచి తప్పుకోవాలని ఓ పార్టీ కోరడంతో సుప్రీం న్యాయమూర్తి ఒకరు కేసు నుంచి తప్పుకొన్నారని.. ఈ విషయాన్ని సీనియర్ న్యాయవాది ఒకరు తన పుస్తకంలో పేర్కొన్నారంటూ దానిని న్యాయమూర్తికి అందజేశారు. ఈ అభిప్రాయాన్ని సైతం పరిగణనలోకి తీసుకుంటున్నానని, తీర్పులో దీనినీ ప్రస్తావిస్తానని న్యాయమూర్తి పేర్కొన్నారు.