మల్లు స్వరాజ్య, కమలాదేవి , పద్మావతి , గొంగిడి సునీత
అవనిలో సగభాగమైన అతివలకు రాజకీయ రంగంలో ప్రధాన పార్టీలు మొండి చేయి చూపిస్తున్నాయి.మగవారితో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. స్థానిక సంస్థల్లో మాత్రం రిజర్వేషన్ ఉంటుంది కనుక కచ్చితంగా మహిళలకు 50శాతం స్థానాలు కేటాయిస్తారు. తప్పని పరిస్థితుల్లో భర్తలు తమ భార్యలను రంగంలోకి దింపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రధాన పార్టీలు మహిళలను నిర్లక్ష్యం చేశాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో 202మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ఈ నియోజకవర్గాల్లో కేవలం 13 మంది మహిళలు మాత్రమే పోటీలో ఉన్నారు.
సాక్షి, ఆలేరు : ఆలేరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ తరఫున గొంగిడి సునీత, ఇండిపెండెంట్ అభ్యర్థిగా జన్నె సరిత పోటీ చేస్తుండగా కోదాడ నుంచి నల్లమాద పద్మావతి కాంగ్రెస్ తరఫున, నాగార్జునసాగర్‌లో నివేదితారెడ్డి (బీజేపీ), సౌజన్య బీఎల్‌ఎఫ్ తరఫున పోటీల్లో ఉన్నారు. అలాగే నల్లగొండ నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌గా పర్వీన్, సూర్యాపేటలో ప్రజాబంధు పార్టీ తరఫున పాల్వయి వనజ, హుజూర్‌నగర్‌లో ఇండిపెండెంట్‌గా బానోతు పద్మ, నకిరేకల్‌లో ఎన్‌సీపీ అభ్యర్థిగా స్వరూపరాణి, తుంగతుర్తిలో టీపీపీఐ అభ్యర్థిగా ఇందిరా, ఎన్‌జేపీఐ అభ్యర్థిగా పాల్వయి పద్మ, ఇండిపెండెంట్లుగా సృజన, శిల్పలు ఎన్నికల బరిలో నిలిచారు.
ఓటర్లుగా మహిళలే అధికం
ఉమ్మడి జిల్లాలో పురుషుల కంటే మహిళల ఓట్లే అధికంగా ఉన్నాయి. పురుషులు 12,80,959 స్త్రీలు 12,85,194 ఇతరులు 112 మంది ఉన్నారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, మునుగోడు, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో పురుషుల కన్న మహిళలే అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మొ త్తం ఓట్లు 25,66,265 ఓట్లు ఉన్నాయి.
నాటినుంచి ఎనిమిది మంది మహిళలే ..
1952 నుంచి 2014 వరకు ఉమ్మడి జిల్లాలో 8 మంది మహిళలు మాత్రమే శాసన సభకు ఎన్నికయ్యారు. వీరిలో ఆలేరు నుంచి ఆరుట్ల కమలాదేవి, నకిరేకల్ నుంచి మూసాపేట కమలమ్మ, తుంగతుర్తి నుంచి మల్లుస్వరాజ్యం, నల్లగొండ నుంచి గడ్డం రుద్రమాదేవి, భువనగిరి నుంచి ఉమామాధవరెడ్డి, దేవరకొండ నుంచి భారతిరాగ్యానాయక్, ఆలేరు నుంచి గొంగిడి సునీత, కోదాడ నుంచి పద్మావతిలు ఎన్నికయ్యారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదమేదీ..?
ఎలిమినేటి ఉమామాధవరెడ్డి
ప్రశ్న : మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?
ఎలిమినేటి ఉమామాధవరెడ్డి: చంద్రబాబునా యుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేస్తున్న తన భర్త ఎలిమినేటి మాధవరెడ్డి 2000 సంవత్సరంలో మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ వద్ద నక్సల్స్ మందుపాతర పేల్చిన సంఘటనలో మృ తిచెందారు. దీంతో రాజకీయంలోకి ప్రవేశించాల్సి వచ్చింది.
ప్రశ్న : ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఎలా వచ్చింది?
ఎలిమినేటి ఉమామాధవరెడ్డి: 2000 సంవత్సరంలో తన భర్త మాధవరెడ్డి మృతి అనంతరం ప్రజల కోరిక మేరకు భువనగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది.
ప్రశ్న : మీ పదవీ కాలంలో ఏయే కార్యక్రమాలు నిర్వహించారు?
ఎలిమినేటి ఉమామాధవరెడ్డి: తాను మూడుసార్లు భువనగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాను. నా పదవీకాలంలో నియోజకవర్గంలోని చౌటుప్పల్, బీబీనగర్ మండల పరిషత్ కార్యాలయాలను నిర్మించబడింది. మూసీ పరీవాహక ప్రాంతంలోని శివారెడ్డిగూడెం, గోసుకొండ గ్రామాలకు మూసీ నీటి కాల్వను నిర్మించబడింది. బునాదిగాని, పిలాయిపల్లి కాల్వ నిర్మాణానికి సర్వే చేసి ప్రభుత్వ అనుమతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశాం. వేలిమినేడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామంతోపాటు మరి రెండు ప్రాంతాల్లో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశాం. రోడ్లు, పాఠశాల భవనాలను నిర్మించాం.
ప్రశ్న : అప్పటి పరిస్థితుల్లో మహిళలకు ఎలాంటి అవకాశాలు లభించాయి?
ఎలిమినేటి ఉమామాధవరెడ్డి: అప్పటి పరిస్థితుల్లో రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయించారు. మహిళలకు పెద్దపీట వేశారు.
ప్రశ్న : ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా యి, మహిళలకు అవకాశాలు ఉన్నాయా లేవా?
ఎలిమినేటి ఉమామాధవరెడ్డి: ప్రస్తుతం రాజకీయాల్లో అలాగే ఉన్నాయి. మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. కానీ ఇంత వరకు అది జరగడం లేదు. జనాభాలో 50శాతం ఉన్న మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలి. ప్రస్తుతం మాత్రం ఫర్వాలేదు.
ప్రశ్న : అప్పటికి ఇప్పటికీ ప్రచార శైలి తేడా ఎలా ఉంది?
ఎలిమినేటి ఉమామాధవరెడ్డి: అప్పటికి ఇప్పటికీ ప్రచార శైలిలో చాలా తేడా ఉంది. అప్పట్లో కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చేవారు. రాజకీయాల్లో మనస్ఫూర్తిగా పని చేసేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.
మరిన్ని వార్తాలు...
Comments
Please login to add a commentAdd a comment