‘పింఛనుకు మీరు అనర్హులు. ఇప్పటి వరకు తీసుకున్న పింఛన్ సొమ్మును వెంటనే ప్రభుత్వ ఖజానాకు చెల్లించండి..’అంటూ లబ్ధిదారులకు నోటీసులు అందుతున్నాయి.
చేవెళ్ల: ‘పింఛనుకు మీరు అనర్హులు. ఇప్పటి వరకు తీసుకున్న పింఛన్ సొమ్మును వెంటనే ప్రభుత్వ ఖజానాకు చెల్లించండి..’అంటూ లబ్ధిదారులకు నోటీసులు అందుతున్నాయి. ఈ హుకుంతో లబ్దిదారులు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ఆసరా పింఛను మొత్తాన్ని రూ.200 నుంచి వేయి రూపాయలకు పెంచింది. కాగా, అర్హులే పింఛన్లు తీసుకోవాలని, అనర్హులు తీసుకుంటే తిరిగి రాబడతామని అప్పట్లోనే ప్రభుత్వం హెచ్చరించింది.
అయినప్పటికీ, స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడితో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు అధికారులు పింఛన్లు మంజూరు చేశారు. గత నెల 5 వ తేదీన ప్రభుత్వం జీవో నంబర్-17 విడుదల చేసింది. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ, కాంట్రాక్టు, పొరుగుసేవల సిబ్బంది తల్లిదండ్రులు ఎవరైనా పింఛన్ తీసుకుంటే రద్దు చేస్తున్నామని, ఇప్పటివరకు తీసుకున్న పింఛను దారులను అనర్హులుగా గుర్తించామని ప్రభుత్వం వెల్లడించింది.
అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల తల్లిదండ్రులు తీసుకున్నపింఛన్‌ను రెవిన్యూ రికవరీ చట్టం ప్రకారం తిరిగి చెల్లించాలని ఉత్తర్వులు విడుదల చేస్తూ అనర్హులుగా గుర్తించినవారికి రికవరీకోసం ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇలాంటి అనర్హుల్లో రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలంలో 48, మొయినాబాద్ 19, శంకర్‌పల్లి మండలంలో 22 మంది ఉన్నారు. వీరు తీసుకున్న సొమ్మును వెంటనే ప్రభుత్వ ఖజానాకు చెల్లించాలని నోటీసులు జారీ అయ్యాయి. ఈ చర్యతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.