
స్వాతిది ఆత్మహత్యా.. హత్యా?
ప్రేమజంట స్వాతి- నరేష్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి రావడంతో సరికొత్త అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఈనెల ఒకటో తేదీ నుంచే నరేష్ కనిపించడం లేదు. ఆ తర్వాత.. దాదాపు పది రోజుల క్రితం స్వాతి ఆత్మహత్య చేసుకున్నట్లు కథనాలు వచ్చాయి. నరేష్ గురించి కూడా చాలా కాలం పాటు అసలు ఏం జరిగిందో ఏంటో ఎవరికీ తెలియలేదు. ఎట్టకేలకు అతడిని హతమార్చినట్లు తెలియడంతో ఒక్కసారిగా అంతా నివ్వెరపోయారు. దాంతోపాటే అసలు స్వాతి కూడా ఆత్మహత్య చేసుకుందా.. లేక ఆమెను సైతం హతమార్చారా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అంబోజు నరేష్ అదృశ్యం అయిన సుమారు 15 రోజుల తర్వాత స్వాతి మరణించింది. ఇద్దరికీ పెళ్లి చేస్తామని పిలిపించడంతో ఆమె నమ్మకంగా ఇంటికి వచ్చింది. తర్వాత ఏమైందో తెలియదు గానీ ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. ఇప్పుడు నరేష్ హత్యకు గురైనట్లు తేలడంతో.. స్వాతి మరణం కూడా సహజమా, అసహజమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నరేష్ మరణించిన విషయం స్వాతికి తెలిసి ఉంటుందని, దానిపై ఆమె గొడవ చేయడంతో విషయం ఎక్కడ బయటకు వస్తుందోనని ఆమెను కూడా చంపేసి ఉండొచ్చని స్థానికులు గట్టిగా అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయం మీద కూడా మరింత లోతుగా దర్యాప్తు జరగాల్సి ఉంది. గతంలో ఈ ప్రాంతంలో జరిగిన హత్యలతో పాటు ఇప్పుడు సంభవించిన ఈ రెండు మరణాల మీద కూడా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేయాలని స్థానికులు కోరుతున్నారు.