తల వెనక ఒకటే దెబ్బ.. నరేష్ మృతి! | Srinivasa reddy hit on the backside of naresh head and he died, says police commissioner | Sakshi
Sakshi News home page

తల వెనక ఒకటే దెబ్బ.. నరేష్ మృతి!

Published Sat, May 27 2017 5:44 PM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM

తల వెనక ఒకటే దెబ్బ.. నరేష్ మృతి!

తల వెనక ఒకటే దెబ్బ.. నరేష్ మృతి!

తన భార్య కోసం వచ్చి.. మామ చేతిలో హత్యకు గురైన నరేష్ కేసు పలు మలుపులు తిరిగింది. పుట్టింట్లో ఉన్న తన భార్యను కలుసుకోడానికి వచ్చిన నరేష్.. అనుకోకుండా మామ శ్రీనివాసరెడ్డి కంట్లో పడి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ వివరాలను రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ మీడియాకు వెల్లడించారు. తమ ఇంటి దగ్గర తచ్చాడుతున్న నరేష్‌ను చూసిన శ్రీనివాసరెడ్డి.. అతడిని తమ పొలానికి తీసుకెళ్లి తల వెనుక భాగంలో ఇనుప రాడ్‌తో ఒక్కటే దెబ్బ కొట్టాడని, దాంతో నరేష్‌ అక్కడికక్కడే మరణించాడని ఆయన తెలిపారు. ముందు ఎలాగోలా శవాన్ని తగలబెట్టేద్దామని అనుకున్నా తర్వాత పెట్రోలు తీసుకొచ్చి శవానికి పైన, కింద కూడా టైర్లు పెట్టి పూర్తిగా కాలిపోయేలా చూశారన్నారు. ఆయన చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి...

నరేష్ అదృశ్యంపై అతడి తండ్రి వెంకటయ్య కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాకలు చేయడంతో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు విచారణ ప్రారంభించామని, ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావును దర్యాప్తు అధికారిగా నియమించామని సీపీ మహేష్ భగవత్ చెప్పారు. జాయింట్ సీపీ తరుణ్ జోషి నేతృత్వంలో వేర్వేరు బృందాలను రూపొందించి ముంబై, షోలాపూర్ తదితర ప్రాంతాలకు పంపినట్లు చెప్పారు. నరేష్ సొంత ఊరు పల్లెర్ల, శ్రీనివాసరెడ్డి ఊరు లింగరాజపల్లి తదితర ప్రాంతాల్లో విచారణ జరిపినట్లు తెలిపారు. ముందు నుంచి శ్రీనివాసరెడ్డి మీద అనుమానం ఉండటంతో ఆయనను పిలిపించి, డీసీపీ ఆధ్వర్యంలో ఎస్ఓటీ బృందం విచారించిందన్నారు. చివరకు శ్రీనివాసరెడ్డి నుంచి నిజాన్ని రాబట్టామని తెలిపారు. మే రెండో తేదీన శ్రీనివాసరెడ్డి, స్వాతి పిన్నికొడుకు సత్తిరెడ్డి కలిసి తమ వద్ద ఉన్న వ్యాగన్ ఆర్ కారులో స్వాతిని లింగరాజపల్లికి తీసుకెళ్లారని, అదే రోజు రాత్రి 10.30 గంటల సమయంలో తమ ఇంటి దగ్గర ఒక మోటార్ సైకిల్ తచ్చాడుతుండటంతో అది చూసి శ్రీనివాసరెడ్డి బయటకు వచ్చారని సీపీ చెప్పారు. తమ వద్ద ఉన్న హోండా బైకును శ్రీనివాసరెడ్డి డ్రైవ్ చేస్తుండగా, సత్తిరెడ్డి వెనకాల కూర్చుని వెళ్లారని, అర కిలోమీటరు దూరంలో వాళ్లకు నరేష్ కనిపించడంతో అతడిని మధ్యలో కూర్చోబెట్టుకుని తమ పొలానికి తీసుకెళ్లారని వివరించారు. అక్కడ నరేష్‌తో సత్తిరెడ్డి మాట్లాడుతూ ఉండగా శ్రీనివాసరెడ్డి వెనక నుంచి రాడ్‌తో తల వెనక భాగంలో ఒకే దెబ్బ కొట్టాడని, దాంతో నరేష్ అక్కడికక్కడే మరణించాడని చెప్పారు. అక్కడే శవాన్ని తగలబెట్టడానికి ప్రయత్నించగా, అది పూర్తిగా కాలలేదని, దాంతో ఆత్మకూరు వెళ్లి అక్కడ 5 లీటర్ల పెట్రోలును క్యానులో కొనుక్కుని తీసుకొచ్చి శవానికి పైన, కింద కొన్ని టైర్లు పెట్టి, పెట్రోలు పోసి శవాన్ని తగలబెట్టారని ఆయన తెలిపారు.

ఆ తర్వాత హైదరాబాద్ బోడుప్పల్ బాలాజీ హిల్స్ ప్రాంతంలో ఉన్న తన ఇంటికి నరేష్ వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసుకుని సత్తిరెడ్డి వచ్చాడన్నారు. మర్నాడు.. అంటే మూడోతేదీ ఉదయం శ్రీనివాసరెడ్డి వచ్చి అస్థికలను ఒక గోనెసంచిలో సేకరించి, మూసీ నదిలో కలిపేశారని చెప్పారు. మొత్తం హత్య, దానికి సంబంధించిన ఆధారాలను మాయం చేయడం అన్నీ మే 2, 3 తేదీలలో జరిగాయన్నారు. శ్రీనివాసరెడ్డి, సత్తిరెడ్డి ఇద్దరినీ వేర్వేరుగా ప్రశ్నించగా ఇద్దరూ ఇవే విషయాలు చెప్పారని అన్నారు.

ఆ తర్వాత కొన్నాళ్లకు అంటే.. ఈనెల 16వ తేదీన స్వాతి ఆత్మహత్య చేసుకుందని, అయితే ఆమె తీసుకుందని చెబుతున్న సెల్ఫీ వీడియోపై అనుమానాలు ఉండటంతో దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని సీపీ చెప్పారు. భువనగిరి నుంచి ఒక విలేకరి తమ ఇంటికి వచ్చి ఆమెను అసభ్యంగా ప్రశ్నించడంతో మనస్తాపం చెంది ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారని, బాత్రూంలో ఉరి వేసుకుని చనిపోయిందని అంటున్నారని తెలిపారు. అయితే అసలు ఈ కేసులో విషయాలన్నీ చాలా నాటకీయంగా ఉన్నాయని, దర్యాప్తులో కూడా తమకు చాలా సవాళ్లు ఎదురయ్యాయని అన్నారు. పెళ్లయిన తర్వాత ముంబైలోని వర్లి పోలీసు స్టేషన్‌లో స్వాతి, నరేష్ ఇద్దరూ కలిసి వెళ్లి తమకు స్వాతి తండ్రి నుంచి ముప్పు ఉందని స్టేట్‌మెంట్ ఇచ్చారన్నారు. అయితే.. కొన్నాళ్ల తర్వాత స్వాతి మళ్లీ తన తండ్రికి ఫోన్ చేసి తన పరిస్థితి ఏమీ బాగోలేదని, తన సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ వేయించాలని అడిగిందని డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పారు. తాను రెండుమూడు సార్లు అలా బ్యాలెన్స్ వేయించినట్లు శ్రీనివాసరెడ్డి చెప్పారన్నారు. నరేష్ సోదరి షోలాపూర్‌లో ఉంటారని, ఆమెతో కూడా శ్రీనివాసరెడ్డి టచ్‌లో ఉన్నారని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement