
నరేష్-స్వాతిని ఎందుకు రప్పించారు?
హైదరాబాద్ : దారుణ హత్యకు గురైన నరేష్ కేసులో పోలీసులు వైఫల్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తోందని మృతుడి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరేష్-స్వామిలను ముంబై నుంచి పిలిపించడం వెనుక పోలీసుల పాత్ర ఉందని వారు ఆరోపిస్తున్నారు. భువనగిరి పోలీసులే ఈ ఘోరానికి కారకులని, డీసీపీ రామచంద్రయ్య ఈ కేసులో ప్రేక్షక పాత్ర పోషించారని నరేష్ తల్లిదండ్రులు వ్యాఖ్యానించారు. స్వాతి తండ్రే నరేష్‌ను చంపి ఉంటాడని తాము ముందు నుంచీ చెప్తున్నామని, అయితే కేసును పక్కదోవ పట్టించడానికి స్వాతిని కూడా తండ్రే హత్య చేశాడన్నారు. ఇద్దరి ప్రాణాలు తీసిన స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డిని ఉరి తీయాలని వారు డిమాండ్ చేశారు.
కాగా పోలీసులు వ్యవహారశైలిపై ఇప్పటికే నరేష్ తల్లిదండ్రులు హైకోర్టుతో పాటు, మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. మేజర్ల వివాహంలో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకున్నారని, పెళ్లయిన వారానికే నరేష్-స్వాతిలను ఇక్కడకు ఎందుకు రప్పించారని, మళ్లీ రెండోసారి రప్పించడంలో పోలీసుల పాత్ర ఏంటని నరేష్ బంధువులు ప్రశ్నిస్తున్నారు.
తల వెనక ఒకటే దెబ్బ.. నరేష్ మృతి!
భువనగిరి పోలీసుల పాత్రపై విచారణ చేయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ దారుణానికి భువనగిరి పోలీసులు బాధ్యులు కారా? అని ప్రశ్నలు సంధించారు. తన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న నరేష్‌ను పరువు కోసం హతమార్చినట్లు స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి అంగీకరించాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.