సంగారెడ్డి క్రైం: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రాకను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వామపక్షాలు, పలు ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఆయన భారత పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. శనివారం సంగారెడ్డిలో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఐబీనుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం ఒబామా దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.మల్లేశం మాట్లాడుతూ మనదేశ, ఆర్థిక,సామాజిక వ్యవస్థపై ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ అనేక షరతులు విధిస్తున్నాయన్నారు. ఒబామా నాయకత్వంలోని అమెరికా వివిధ దేశాల అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకుంటోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో అమెరికన్ కంపెనీలకు, దేశీయ బడా పెట్టుబడిదారులకు లబ్ధి చేకూర్చే ఒప్పందాల కోసం మోడీ ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మంద పవన్, సీపీఎం నాయకులు మౌలాలి, కృష్ణ, దత్తు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
ఒబామా రాకను నిరసిస్తూ సంగారెడ్డిలోని ఐబీలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. జిల్లా అధ్యక్షుడు ఎం.సురేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసమే ఇండియాలో ఒబామా పర్యటిస్తున్నారని విమర్శించారు. ఆయన పర్యటనను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు అనిల్, హరీష్‌కుమార్, శ్రీకాంత్, నర్సిములు, శంకర్, మహిపాల్, హరినాథ్ పాల్గొన్నారు.
దిష్టిబొమ్మ దహనం
జహీరాబాద్ టౌన్: ఒబామా భారత పర్యటనను వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో శనివారం స్థానిక తహశీల్ కార్యాలయం వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం డివిజన్ కమిటీ సభ్యుడు మహిపాల్ మాట్లాడుతూ వివిధ దేశాల అంతరంగిక విషయాల్లో అమెరికా జోక్యం చేసుకొని, పెత్తనం చెలాయిస్తోందన్నారు. నిత్యం ప్రపంచంలోని ఏదో ఒక మూల బాంబుల వర్షం కురిపిస్తూ సామాన్య ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటోందన్నారు.
అమెరికా కారణంగానే భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ బ్యాంక్ అనేక షరతులు విధిస్తోందన్నారు. ఒబామా పర్యటనవల్ల గతంలో చేసుకొన్న 63 ఒప్పందాలను రద్దు చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఆయన పర్యటను సీపీఎం వ్యవతిరేకిస్తోందన్నారు. నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు మండల కార్యదర్శి నర్సింలు, కమిటీ సభ్యులు సలీమోద్దీన్, మూజాహిద్దీన్, తుల్జరాం, శ్రీకాంత్, రాములు, కమలబాయి, గోపాల్ పాల్గొన్ననారు.
‘ఒబామా గోబ్యాక్’ పోస్టర్ ఆవిష్కరణ
జోగిపేట: అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటనను తాము వ్యతిరేకిస్తున్నట్లు పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి బుచ్చయ్య అన్నారు. శనివారం జోగిపేటలో ‘ఒబామా గోబ్యాక్’ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సామ్రాజ్య వాద ప్రయోజనాలను నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఒబామా పర్యటిస్తున్నారన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యు నాయకులు పెంటయ్య, శివకుమార్, కృష్ణ, చంద్రశేఖర్, నరేష్, కుమార్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఒబామా రాకపై భగ్గు!
Published Sun, Jan 25 2015 3:08 AM | Last Updated on Tue, Oct 9 2018 3:01 PM
Advertisement
Advertisement