► అల్లర్ల వెనుక అదృశ్య శక్తులు
► పోలీసులపై అనుమానాలు
► వాట్సాప్ వీడియోలో దృశ్యాలు
► మెరీనాలో మళ్లీ ఆందోళనకారులు
► జల్లికట్టు ఎద్దుదాడిలో ఇద్దరు మృతి
జల్లికట్టు ఉద్యమం అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లిందా? అల్లర్లను సృష్టించేందుకు పోలీసులే ప్రత్యేక పాత్ర పోషించారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియా వాట్సాప్ ద్వారా ప్రచారంలోకి రావడం కలకలాన్ని రేపింది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: జల్లికట్టుకు అనుమతి కోరుతూ చెన్నై మెరీనాబీచ్ తీరంలో ఈనెల 17వ తేదీన ఆందోళనలు ప్రారంభమయ్యాయి. 20వ తేదీన జల్లికట్టు ఉద్యమకారులు చేపట్టిన బంద్ అనూహ్యరీతిలో సక్సెస్ అయింది. బంద్‌లో రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. అయినా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. 21వ తేదీన ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన తరువాత ఆందోళన విరమించాల్సిందిగా సీఎం పన్నీర్‌సెల్వం కోరారు. అయితే శాశ్వత చట్టం తెచ్చేవరకు ఆందోళన విరమించబోమని ఉద్యమకారులు స్పష్టం చేశారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఉద్యమకారులతో చర్చలు జరిపారు. అయినా వారు ససేమిరా అనడంతో సోమవారం నాడు బలవంతంగా వారిని పంపివేసే ప్రయత్నం చేశారు.
దీంతో మెరీనాతీరంలో స్వల్పంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే క్రమేణా పరిస్థితి తీవ్రరూపం దాల్చగా చెన్నై ఐస్ హౌస్ పోలీస్‌స్టేషన్ కు నిప్పు, వందలాది వాహనాల దగ్ధం, పోలీసులపై పెట్రో బాంబులు విసరడం వంటి చర్యలతో నగరం రణరంగంగా మారిపోయింది. పోలీసులు గాల్లోకి కాల్పులు, భాష్పవాయువు ప్రయోగాలు చేయాల్సివచ్చింది. కాగా, సుమారు వందమందికి పైగా యువకులు సోమవారం రాత్రి వడపళని పోలీస్‌స్టేషన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపి చెదరగొట్టారు. అలాగే మరికొంత మంది అసాంఘిక శక్తులు ఆరంబాక్కం మెట్రో రైల్వేస్టేషన్ లోకి చొరపడి సీసీ కెమెరా, కిటికీలను పగులగొట్టారు. అలాగే ఆరుంబాక్కంలోని ఒక ప్రముఖ హోటల్‌కు స్వల్పంగా ఆస్తినష్టం కలిగించారు.
రెండు ఏటీఎం సెంటర్లలోకి చొరబడి మెషిన్లను ధ్వంసం చేశారు. ఏటీఎంలలో నగదు లేకపోవడంతో చోరీ చేసే ప్రయత్నం చేయలేదు. అలాగే ఆర్కాడు నుంచి వేలూరుకు వెళుతున్న ప్రభుత్వ బస్సును సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కొందరు విద్యార్థులు పెట్రో బాంబులు విసిరి పారిపోయారు. అయితే బాంబులు పేలక పోవడంతో బస్సులోని 20 మంది ప్రయాణికులు సురక్షితంగా బైటపడ్డారు. అయితే బస్సు కండక్టర్ తలకు బలమైన గాయాలయ్యాయి. ఆందోళనకారులతో పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి చర్చలు ఫలించగా జల్లికట్టు ఉద్యమాన్ని విరమించారు.
తమిళనాడు అసెంబ్లీలో సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించిన జల్లికట్టు ఆర్డినెన్స్ ను గవర్నర్ విద్యాసాగర్‌రావు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. మదురై జిల్లా అలంగానల్లూరు, పాలమేడు, అవనియాపురంలలో వరుసగా వచ్చేనెల 1,2, 5వ తేదీల్లో జల్లికట్టు క్రీడను జరుపుతున్న దృష్ట్యా పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.
పోలీసులే పాత్రధారులా: సోమవారం నాటి అల్లర్లకు పోలీసులే తెరవెనుక పాత్రధారులనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో పార్క్‌చేసి ఉన్న ఆటోలకు ఒక పోలీస్ కానిస్టేబుల్ నిప్పుపెడుతున్న వీడియో రాష్ట్రంలో హల్‌చల్ చేసింది. ప్లాస్టిక్ సంచుల్లో పెట్రోలు తీసుకుని పోలీసులే స్వయంగా ఆటోపై చల్లి నిప్పుపెడుతున్నట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనపడుతోంది. సమీపంలోని ఒక మిద్దెపై నుంచి తన సెల్‌ఫోన్ లో వీడియో చిత్రీకరిస్తున్న వ్యక్తి ‘ పోలీసులే తగులబెడతారా, రాష్ట్రంలో ఏమి జరుగుతోంది’ అంటూ ఆంగ్లంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న మాటలు వినపడుతున్నాయి. ప్రశాంతంగా సాగుతున్న జల్లికట్టు ఉద్యమాన్ని ఉద్రిక్తతల వైపు మళ్లించేందుకు పోలీసులే పథకం వేశారా అనే అనుమానాలు నెలకొన్నాయి. అంతేగాక విద్యార్థుల ముసుగులో కొన్ని అ సాంఘిక శక్తులు విధ్వంసక చర్యల్లో పాల్గొన్నట్లు సందేహిస్తున్నారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పోలీసులే పాల్పడడం దురదృష్టకరమని సదరు వీడియోను ఉద్దేశించి డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ వ్యాఖ్యానించారు. నటుడు కమల్‌హాసన్ సైతం ఆ వీడియోను చూశానని పేర్కొం టూ పోలీస్ చర్యల పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. సోమవారం నాటి అల్లర్లపై సీబీఐ విచారణ జరిపించాల్సింది గా పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యులు అన్బుమణి రాందాస్ డిమాండ్ చేశారు.
మెరీనాలో అదే సీన్ :
చెన్నై మెరీనా బీచ్‌లో వందల సంఖ్యలో జల్లికట్టుపై ఉద్యమకారులు మంగళవారం కూడా ఆందోళనను కొనసాగించారు. సోమవారం నాటి అల్లర్ల నేపథ్యంలో అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడిచిపెట్టాలని, వారిపై పెట్టిన కేసులను వాపసు తీసుకోవాలని డిమాండ్లపై ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం హామీ ఇచ్చేవరకు కదిలేది లేదని వారు చెప్పారు. అంతేగాక ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి ఆమోదముద్ర పడిన తరువాతనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు. ఆందోళకారులను అదుపుచేసేందుకు వందమందికి పైగా పోలీసులను బందోబస్తు పెట్టి చర్చలు జరుపుతున్నారు.
వంద మందికి పైగా అరెస్ట్:
జల్లికట్టు ఉద్యమంలో భాగంగా ఉద్రిక్తతలు సృష్టించారనే ఆరోపణలపై చెన్నై నగరానికి చెందిన వందమందికి పైగా యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎగ్మూరు, అన్నాసమాధి, ఐస్‌హౌస్, అన్నాశాలై, మైలాపూర్, ట్రిప్లికేన్, వడపళని, కీల్‌పాక్, కొట్టూరుపురం తదితర 15 ప్రాంతాలకు చెందిన వారు అరెస్టయిన వారిలో ఉన్నారు. అలాగే పోలీసులపై దాడి చేసిన ఆరోపణలపై మరో 11 మందిని అరెస్ట్ చేశారు. చెన్నైలో సోమవారం నాటి అల్లర్లలో 232 వాహనాలు ధ్వంసంకాగా, 160 చోట్ల రాస్తారోకోలు జరిగాయని, అదనపు కమిషనర్ సహా 96 మంది పోలీసులు గాయపడ్డారు. పోలీస్‌స్టేషన్ కు నిప్పుపెట్టిన 9 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ మైలాపూరు పోలీస్‌స్టేషన్ ను ఆందోళనకారలు మంగళ వారం ముట్టడించారు. అసాంఘిక శక్తుల నుంచి పోలీ సులను రక్షించేందుకు చెన్నై ఎమ్‌కేపీ నగర్‌కు చెందిన ప్రజలు వారికి సాధారణ వస్రా్తలు ఇచ్చి ప్రజల్లో కలిసిపోయేలా చేసి ఆదుకున్న సంగతి వెల్లడైంది.
పోలీస్ సహా ఇద్దరు మృతి:
విరుదునగర్ జిల్లా కాన్సాపురంలో సోమవారం జరిగి న జల్లికట్టు ఒక పోలీసు ప్రాణాలను హరించింది. 50కి పైగా ఎద్దులను వాడివాసల్ గుండా వదిలారు. వందమందికి పైగా జల్లికట్టు వీరులు ఆ ఎద్దులను తమ అదుపులోకి తీసుకునేందుకు వాటి వెంట పరుగులు పెట్టా రు. పుదుపట్టికి చెందిన ఒక ఎద్దు అకస్మాత్తుగా జనంలోకి చొచ్చుకుని వచ్చి తోసేయడం ప్రారంభించింది. అక్కడే బందోబస్తులో ఉన్న అదే గ్రామానికి చెందిన ఏఆర్ పోలీసు జయశంకర్ (26)ను కొమ్ములతో ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలకు గురైన అతడిని ప్రభు త్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం మదురైకి తరలిస్తుండగా సోమవారం రాత్రి మృతి చెందాడు. జయశంకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే పుదుక్కోట్టై జిల్లా రాపూసల్‌లో జల్లికట్టు సమయంలో కరుప్పయ్య (30)ను ఎద్దు పొడవడంతో తిరుచ్చిరాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందు తూ సోమవారం రాత్రి ప్రాణాలు విడిచాడు.