సంతాప సభలో పాల్గొన్న ప్రెస్‌క్లబ్ సభ్యులు
కొరాపుట్ ఒరిస్సా: జమ్ము-కాశ్మీర్ సీనియర్ జర్నలిస్ట్, రైజింగ్ కశ్మీర్ ఆంగ్ల దినపత్రిక ఎడిటర్ సయ్యద్ షుజాత్ బుఖారిని గురువారం ఉగ్రవాదులు దారుణంగా హత్య చేసిన సంఘటనను ఖండిస్తూ, కొరాపుట్ ప్రెస్‌క్లబ్ కార్యవర్గ సభ్యులు శుక్రవారం సంతాప కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల మౌనం పాటించారు. సమావేశంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు భవానీ శంకర్ మిశ్రా, సీనియర్ జర్నలిస్ట్ కీర్తిచంద్ర సాహులు మాట్లాడుతూ దేశంలో మీడియా ప్రతినిధులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు.
ఎప్పటికప్పడు దేశంలో ఎక్కడో ఒకచోట నిత్యం జర్నలిస్టులు దాడులు, హత్యలకు బలవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన విధంగా స్పందించడం లేదని ఆరోపించారు. సమాజ శ్రేయస్సు కోరి పనిచేస్తున్న జర్నలిస్టుల ప్రాణ రక్షణకు తగిన చట్టం తీసుకు రావలసిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు.
ఇటువంటి దుశ్చర్యలను దేశంలో గల మీడియా ప్రతినిధులంతా ఏకమై ప్రతిఘటించాలని కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతిని ఉద్దేశించిన మెమొరాండాన్ని ప్రెస్‌క్లబ్ తరఫున శనివారం కొరాపుట్ కలెక్టర్‌కు అందచేసేందుకు నిర్ణయించారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ కార్యవర్గ సభ్యులు డి.శంకర రావు, విద్యా చౌదరి, రంజన్ దాస్,ఘనశ్యాం రథ్, జితు మిశ్రా, సత్యనారాయణ పండా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment