చేర్యాల మండలం కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి ఆలయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి.
జనగామ : చేర్యాల మండలం కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి ఆలయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ భూములను కబ్జా చేసి విక్రరుుస్తున్నారు. మల్లన్న పేరిట ఉన్న భూముల్లో ఇప్పటికే సుమారు ఎనిమిది ఎకరాలు ఆక్రమణకు గురయ్యూయి. తెలంగాణకే తలమానికంగా ఉన్న ఈ ఆలయానికి 51.11 ఎకరాల భూములున్నాయి.
ఇందులో నాలుగు ఎకరాల భూమి కబ్జాకు గరైంది. ఆలయూనికి ఆనుకున్న చెరువు శిఖం భూమి రెవెన్యూ రికార్డు ప్రకారం 21.16 ఎకరాలు ఉండగా.. ఇందులోనూ రెండెకరాల పైచిలుకు భూమి ఆక్రమణకు గురైందని, అదేవిధంగా దాసారం గుట్ట సమీపంలోని రెండెకరాల భూమి కబ్జాదారుల ఆధీనంలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
మల్లన్న భూముల ఇవీ..
కొమురెల్లి మల్లన్న ఆలయానికి 51.11 ఎకరాల భూమి ఉంది. సర్వే నెంబర్ 218/ఏ లో 3.22 ఎకరాలు, 219/ఏ లో 2.20 ఎకరాలు, 228/ఏలో 6.01 ఎకరాలు, 230/ఏలో 1.26 ఎకరాలు, 221/ఏలో 1.14 ఎకరాలు, 229 సర్వే నంబర్‌లో ఒక ఎకరం, 231 సర్వేనెంబర్‌లో 1.28 ఎకరాలు, 232లో 1.34 ఎకరాలు, అదేవిధంగా రాజీవ్ రహదారి పక్కన 438 సర్వే నెంబర్‌లో ఐదు ఎకరాలు, 199 సర్వే నెంబర్‌లో 25.26 (మల్లన్నగుట్ట భూమి), 561 సర్వేనెంబర్‌లో ఎకరం భూమి ఉంది.
దీంట్లో మల్లన్న గుట్ట చుట్టూ, చదను ప్రాంతాల్లో కలిపి నాలుగెకరాల భూమి ఆక్రమణకు గురైంది. దీంతో పాటు సర్వే నెంబర్ 198లో 21.16 ఎకరాలు మల్లన్న చెరువు శిఖం భూమి ఉంది. ఈ శిఖం భూముల్లో, దాసారం గుట్ట సమీపంలోని పొరంబోకు భూముల్లో కలిపి మొత్తం నాలుగు ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించారు. ఇక్కడ ఎకరం రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతోంది. ఈ లెక్కన వీటి విలువ సుమారు రూ.4.5కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఇంత జరుగుతున్నా అధికారుల చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు.
ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు హడావుడిగా వెళ్లి ఏదో నామమాత్రంగా ప్రహరీలను కూల్చుతున్నారు తప్పితే భూముల పరిక్షణకు శాశ్వత చర్యలు తీసుకోవడం లేదు. అధికారులు ఇప్పటికైనా మల్లన్న భూములను సర్వే చేయించి రక్షణ చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.