విత్తు పోయే.. నూనె వచ్చె!  | oil industry through facebook | Sakshi
Sakshi News home page

విత్తు పోయే.. నూనె వచ్చె! 

Published Thu, Dec 7 2017 7:13 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

oil industry through facebook - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: దేశంలో లభించే విత్తనాలకు తక్కువ ధరకు ఖరీదు చేసి విదేశాల్లో ఎక్కువ ధరకు విక్రయించే అవకాశం పేరుతో టోకరా వేసిన కేసులను ఇప్పటి వరకు చూశాం. తాజాగా సైబర్‌ నేరగాళ్లు విత్తుల్ని వదిలి నూనెపై పడ్డారు. ఇందుకు సంబంధించిన కేసు బుధవారం నగర సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో నమోదైంది. సైబర్‌ నేరగాళ్ల ముఠాలో సభ్యుడైన ఓ నైజీరియన్‌ నేరుగా వచ్చి బాధితుడిని కలవడం ఈ కేసులో కొసమెరుపు.  ఫేస్‌బుక్‌ ద్వారా మహిళగా పరిచయమైన సైబర్‌ నేరగాళ్ళు రామ్‌కోఠి ప్రాంతానికి చెందిన వ్యాపారి ఆదినారాయణ నుంచి రూ.17 లక్షలు కాజేశారు. ఈయనకు ఫేస్‌బుక్‌ ద్వారా రెండు నెలల క్రితం ఎల్జిబెత్‌ జోన్స్‌ రేయి పేరుతో మహిళగా చెప్పుకున్న సైబర్‌ నేరగాడు పరిచయమయ్యాడు. కొన్నాళ్ళ పాటు చాటింగ్‌ చేయడంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది.

ఈ నేపథ్యంలోనే లాభసాటిగా ఉండే ఓ వ్యాపారం చెప్తానంటూ ఎల్జిబెత్‌ ఎర వేసింది. తాను యూకేలోని ఓ ఫార్మాస్యూటికల్‌ కంపెనీలో పని చేస్తున్నానని తమ కంపెనీకి ‘ఇచికు వా రిజరŠడ్వ్‌’ పేరు గల నూనె భారీగా అవసరమంటూ చెప్పింది. దీనిని భారత్‌తో లీటర్‌ 2300 డాలర్లకు ఖరీదు చేయించి... కంపెనీకి 4300 డాలర్లకు విక్రయిస్తుంటానని నమ్మించింది. ఇటీవల తనను వేరే విభాగానికి బదిలీ చేశారని, ఇప్పటి వరకు తాను చేయించిన నూనె వ్యాపారం విషయం తమ యజమాన్యానికి తెలిస్తే తనకు ఇబ్బందంటూ కథ అల్లింది. అలా కాకుండా ఉండాలంటే మీరే ఆ వ్యాపారం చేపట్టి నూనెను ఖరీదు చేసి తమకు పంపాలని చెప్పింది. ఆ నూనె సరఫరా కాంట్రాక్టు ఇప్పించే బాధ్యత తనదేనంటూ నమ్మించింది. ఇందుకు ఆదినారాయణ అంగీకరించడంతో వ్యాపారంలో వచ్చే లాభంలో తనకు 40 శాతం వాటా ఇవ్వాలంటూ చెప్పడంతో బాధితుడు పూర్తిగా వల్లోపడ్డాడు. ఈ మేరకు సదరు ఆయిల్‌ను లీటర్‌ 4700 డాలర్లకు సరఫరా చేస్తానంటూ ఓ కొటేషన్‌ పంపమంటూ ఆమె కోరడంతో ఆదినారాయణ ఈ–మెయిల్‌ చేశాడు.

దీంతో కంపెనీతో ఒప్పందం ఖరారైందంటూ ఎల్జిబెత్‌ సందేశం ఇచ్చింది. అయితే తాను చెప్పిన ఆయిల్‌ ఖరీదు చేసిన తర్వాత నమూనాలు పరీక్షించడానికి తమ కంపెనీకి చెందిన వారు వస్తారంటూ చెప్పింది. ఈ మేరకు సదరు కంపెనీ పేరుతో ఈ–మెయిల్‌ కూడా వచ్చింది. ఆపై చాటింగ్‌ ద్వారా ఆదినారాయణతో సంప్రదించిన ఎల్జిబెత్‌ భారత్‌లో సదరు ఆయిల్‌ సరఫరా చేసే వ్యక్తంటూ ఓ ఫోన్‌ నెంబర్‌ ఇచ్చింది. బాధితుడు ఆ నెంబర్‌కు కాంటాక్ట్‌ చేయగా మాట్లాడిన మహిళతో తనకు తొలుత రెండు లీటర్ల ఇచికు వా అయిల్‌ కావాలని కోరగా,  లీటర్‌ 2300 డాలర్ల చొప్పున మొత్తం రూ.3 లక్షలు ముందుగా బ్యాంకులో డిపాజిట్‌ చేయాలంటూ ఆమె సమాధానమిచ్చింది. దీంతో ఆదినారాయణ రూ.3 లక్షలు బ్యాంకులో డిపాజిట్‌ చేయడంతో కొరియర్‌ ద్వారా రెండు లీటర్ల నూనె ఆయనకు డెలివరీ చేశారు. ఇది అందిన వెంటనే తనిఖీ చేసుకునేందుకు ఉద్యోగులను పంపాలంటూ ఆదినారాయణ కంపెనీకి ఈ–మెయిల్‌ పెట్టారు. దీనికి సమాధానంగా ఫలానా రోజున తమ ఉద్యోగి హైదరాబాద్‌ వస్తున్నట్లు మరో ఈ–మెయిల్‌ వచ్చింది. నిర్ణీత తేదీన శంషాబాద్‌కు వచ్చిన ఓ నైజీరియన్‌ను ఆదినారాయణను అక్కడికి రప్పించుకుని, రెండు లీటర్ల నూనె నుంచి కొంత శాంపిల్‌గా తీసుకుని వెళ్ళిపోయాడు.  

వెళ్తూ... ఈ నమూనాలను ఢిల్లీలోని అధీకృత ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాత ఆర్డర్‌ విషయం చెప్తామన్నాడు. మరుసటి రోజు ఫోన్‌ చేసిన ఆ వ్యక్తి నమూనాలు పరీక్షించామని, క్వాలిటీ చాలా బాగుందంటూ కంపెనీకి సమాచారం ఇచ్చామంటూ చెప్పాడు. ఆపై కంపెనీ నుంచి అంటూ కాల్‌ చేసిన మరో వ్యక్తి తమకు తొలి విడతలో 179 లీటర్ల నూనెను పంపించాలంటూ ఆర్డర్‌ ఇచ్చాడు. అయితే తాను అంత ఒకేసారి పంపించలేనని, తొలుత 10 లీటర్లు పంపిస్తానంటూ ఆదినారాయణ చెప్పడంతో నేరగాళ్ళు అంగీకరించారు. దీంతో 10 లీటర్ల నూనె కావాలంటూ గతంలో రెండు లీటర్లు పంపిన వారిని సంప్రదించగా, రూ.14 లక్షలు డిపాజిట్‌ చేయని కోరడంతో ఆదినారాయణ ఆ మొత్తం డిపాజిట్‌ చేశాడు. ఈ డబ్బు డిపాజిట్‌ అయిన తర్వాత అప్పటి వరకు మాట్లాడిన అన్ని ఫోన్‌ నెంబర్లు స్విచ్ఛాఫ్‌ అయ్యాయి. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ కేవీఎం ప్రసాద్‌ దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా సాంకేతిక ఆధారాలను బట్టి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైంది, కంపెనీ ఉద్యోగులుగా చెప్పుకుంది, ఆయిల్‌ సరఫరా చేస్తామన్నది ఒకే ముఠాకు చెందిన వారుగా గుర్తించారు. వీరిని పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement