ఆటో, క్యాబ్‌ ఎక్కితే ఇక అంతే... అడ్డంగా దోపిడీ | Ola Cabs And Autos Cheating on Service Charges | Sakshi
Sakshi News home page

అడ్డంగా దోపిడీ

Published Wed, Jun 5 2019 7:05 AM | Last Updated on Sat, Jun 8 2019 8:23 AM

Ola Cabs And Autos Cheating on Service Charges - Sakshi

25 కిలో మీటర్లకు రూ.936 బిల్లు

సాక్షి, సిటీబ్యూరో : కొద్ది రోజుల క్రితం నాంపల్లి విజయనగర్‌ కాలనీకి చెందిన ఒక ప్రయాణికుడు తమ ఇంటి నుంచి 25.4 కిలోమీటర్‌ల దూరంలో ఉన్న కొంపల్లి జయభేరీ కాలనీ వరకు ఓలా క్యాబ్‌లో  ప్రయాణం చేశారు. సాధారణంగా ఆ దూరానికి రూ.700 చార్జీ కంటే  ఎక్కువ ఉండదు. కానీ సదరు క్యాబ్‌ సంస్థ రూ.936 చార్జీ విధించింది. దీనిపై అతడు  ఓలా సంస్థకు ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఒక కిలోమీటర్‌కు రూ.36.85 చొప్పున  అధిక చార్జీలు విధించడాన్ని  ప్రశ్నించారు. దీంతో ఓలా సంస్థ వెంటనే దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వసూలు చేసిన డబ్బులోంచి రూ.219 లు తిరిగి ఆయన ఖాతాలో జమ చేసింది. చార్జీలు ఎక్కువగా ఉన్నట్లు  ప్రయాణికుడు గమనించడం వల్ల ట్విట్టర్‌లో ప్రశ్నించగలిగారు. కానీ చాలామంది తమకు తెలియకుండానే క్యాబ్‌ సంస్థల నిలువు దోపిడీకి గురవుతున్నారు.

ఇటీవల లోయర్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి మెహదీపట్నం వరకు బయలుదేరిన ఒక ప్రయాణికుడు ఏకంగా రూ.1200 చార్జీ చెల్లించాల్సి వచ్చింది. సాధారణంగా ఓలా, ఉబెర్‌ క్యాబ్‌ సంస్థల్లో చార్జీలు తరచుగా మారుతూ ఉంటాయి. రద్దీ వేళల్లో  ఎక్కువగా, రద్దీ లేని సమయాల్లో తక్కువగా ఉంటాయి. కానీ అందుకు విరుద్ధంగా రద్దీ ఉన్నా, లేకున్నా  అన్ని వేళల్లోనూ అత్యధిక చార్జీలు నమోదవుతున్నట్లు  ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తాము తక్కువ చార్జీలతో ప్రయాణించిన దూరంలోనూ అత్యధిక చార్జీలు చెల్లించాల్సి వస్తుందని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

క్యాబ్‌ల పరిస్థితి ఇలా ఉంటే వాటికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఆటోవాలాల నిలువు దోపిడీ కొనసాగుతోంది. కేవలం 1.5 కిలోమీటర్‌ల దూరానికి రూ.50 కనీస చార్జీ వసూలు చేస్తున్నారు. ఏ ఒక్క ఆటోలోనూ మీటర్‌ పని చేయడం లేదు. ఒక రకంగా ఆటోడ్రైవర్‌లు గత 3 ఏళ్లుగా మీటర్‌ల వ్యవస్థకు చరమగీతం పాడేశారు. పెద్ద ఎత్తున వసూళ్ల పర్వానికి తెరలేపారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి జూబ్లీబస్‌స్టేషన్‌ వరకు 3 కిలోమీటర్‌ల లోపే ఉంటుంది. రవాణాశాఖ నిర్ణయించిన చార్జీల ప్రకారం రూ.50 లోపే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏ ఆటో ఎక్కినా రూ.200 డిమాండ్‌ చేస్తున్నారు. బేరమాడితే  రూ.150 వరకు దిగొస్తున్నారు. నగరానికి కొత్తగా వచ్చే వాళ్లయితే రూ.200 పైనే సమర్పించుకోవలసి వస్తుంది. ఆ ఒక్క రూట్‌లోనే కాదు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా ఆటోలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రయాణికుడి జేబుకు కన్నం వేస్తున్నాయి. దూరంతో నిమిత్తం లేకుండా అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. అధిక చార్జీల్లో క్యాబ్‌లతో పోటీపడుతున్నాయి.  

క్యాబ్‌లకు కళ్లెంవేసేదెవరు...
గతంలో ట్యాక్సీల చార్జీల నియంత్రణ ఆర్టీఏ పరిధిలో ఉండేది. కానీ ఓలా, ఉబెర్‌ వంటి క్యాబ్‌ సంస్థలు రవాణా రంగంలోకి ప్రవేశించిన తరువాత ఆర్టీఏ పరిధిలోంచి ఎగిరిపోయాయి. ఎంత దూరానికి ఎంత చార్జీ చెల్లించాలనేది క్యాబ్‌ సంస్థల ఖాతాలోకి చేరిపోయింది. మొదట్లో అతి తక్కువ చార్జీలతో ప్రయాణికులను ఆకట్టుకున్న క్యాబ్‌లు క్రమంగా తమ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఆర్టీఏ మోటారు వాహన చట్టం నిబంధనల మేరకు గతంలో కిలోమీటర్‌కు రూ.10 చొప్పున మీటర్‌ రీడింగ్‌పైన చెల్లించే వెసులుబాటు ఉండేది. మీటర్‌ ట్యాంపరింగ్‌ చేసి అధిక చార్జీలు వసూలు చేసే డ్రైవర్‌లపైన రవాణా అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉండేది. ప్రయాణికుల ఫిర్యాదుల ఆధారంగా అధికారులు చర్యలు చేపట్టేవారు. కానీ ఓలా, ఉబెర్‌ల రాకతో ఈ వెసులుబాటు లేకుండా పోయింది. పైగా ఆ సంస్థల కాల్‌సెంటర్‌లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు కూడా ప్రయాణికులకు అందుబాటులో లేవు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 50 వేలకు పైగా క్యాబ్‌లు తిరుగుతున్నాయి. ఒక్క శంషాబాద్‌ విమానాశ్రయ మార్గంలోనే ప్రతి రోజు 10 వేల క్యాబ్‌లు రాకపోకలు సాగిస్తాయి. కనీసం  10 లక్షల మంది ప్రయాణికులు క్యాబ్‌ల సేవలను వినియోగిస్తున్నారు. ఇలాంటి క్యాబ్‌ సర్వీసులు రవాణాశాఖ పరిధిలో లేకపోవడంతో చార్జీలు అడ్డు,అదుపు లేకుండా పెరిగిపోతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  

5 ఏళ్ల నాటి ఆటో మీటర్‌లే ....
గ్రేటర్‌లో సుమారు 1.3 లక్షల ఆటోలు ఉన్నాయి. వీటి చార్జీల నిర్ణయం పూర్తిగా ప్రభుత్వం పరిధిలోనే ఉంది. 5 ఏళ్ల క్రితం మొదటి 1.6 కిలోమీటర్‌ల దూరానికి  రూ.20, ఆ తరువాత ప్రతి కిలోమీటర్‌కు రూ.11 చొప్పున చార్జీలు విధిస్తూ జీవో విడుదల చేశారు. కానీ ఇది ఎంతో కాలం కొనసాగలేదు. ఏడాది తిరగకుండానే  ఆటోడ్రైవర్లు  క్రమంగా మీటర్‌లకు స్వస్తిచెప్పి  అడ్డగోలు వసూళ్లకు దిగారు. కొందరు మీటర్‌లను ట్యాంపర్‌ చేశారు. ఇప్పుడు  మీటర్‌ ప్రస్తావన లేకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆటోమీటర్‌లపైన, చార్జీలపైన  ఆర్టీఏ నియంత్రణ కోల్పోవడం  ఒక కారణమైతే  ఈ ఐదేళ్లలో పెరిగిన డీజిల్, సీఎన్‌జీ ధరలకు అనుగుణంగా మీటర్‌ చార్జీలను సవరించి గట్టి నియంత్రణ వ్యవస్థను  ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. అంతిమంగా సామాన్య ప్రయాణికులే నిలువుదోపిడీ గురవుతున్నారు.

ఎవరూ పట్టించుకోవడం లేదు  
ఆటోచార్జీలపైన ట్రాఫిక్‌ పోలీసులు పట్టించుకోవడం మానేశారు. గతంలో ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేవారు. ఇక ఆర్టీఏ  కూడా ఆటోలపైన నియంత్రణ కోల్పోయింది. ఆటో ఎక్కాలంటేనే భయమేస్తుంది. చాలా దారుణంగా వసూలు చేస్తున్నారు.     – కృష్ణ, సికింద్రాబాద్‌

మీటర్‌ల వ్యవస్థను పునరుద్ధరించాలి  
క్యాబ్‌లలోనూ, ఆటోల్లోనూ మీటర్‌లను పునరుద్ధరించాలి. వీటి నిర్వహణ కోసం రవాణాశాఖలో ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.దీనివల్ల ఇటు డ్రైవర్లకు, అటు ప్రయాణికులకు మేలు జరుగుతుంది. ఉబెర్‌. ఓలా వంటి సంస్థల  వల్ల డ్రైవర్‌లకు పెద్దగా ప్రయోజనం లేదు. ఆ సంస్థలు మాత్రమే దండుకుంటున్నాయి. డ్రైవర్లు  అప్పులు చేసి చివరకు  రోడ్డున పడాల్సి వస్తుంది.  – షేక్‌ సలావుద్దీన్, అధ్యక్షులు,    తెలంగాణ ఫోర్‌ వీలర్‌ డ్రైవర్స్‌ అసోసిసియేషన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement