
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో ఒమన్ షేక్‌ల అరాచకాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దళారులు, కొందరు ఖాజీల సహకారంతో పేదరికంలో ఉన్న మైనర్లు, యువతుల్ని పెళ్లాడుతున్న వీరు వివాహ సమయంలోనే విడాకుల పత్రాలపైనా సంతకాలు చేయించుకుంటున్నారని బయటపడింది. ఫలితంగా పెళ్లయిన కొన్ని రోజులపాటు ఇక్కడే జల్సాలు చేస్తున్న వృద్ధ షేక్‌లు.. ఆపై వారిని విడిచిపెట్టి పోతున్నారు. ఈ తరహా వ్యవహారాలకు సహకరిస్తున్నాడనే ఆరోపణలపై గ్రేటర్ హైదరాబాద్ చీఫ్ ఖాజీ అలీ అబ్దుల్లా రిఫాయ్ అలియాస్ ఓల్టా ఖాజీని దక్షిణ మండల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఇతడి సహాయకుడిని, ముగ్గురు ఒమన్ జాతీయుల్ని పట్టుకున్నట్లు డీసీపీ వి.సత్యనారాయణ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
40 వివాహాల్లో 22 మంది మైనర్లే..
ఓల్టా ఖాజీపై గతంలోనూ మైనర్ బాలికలతో ఒమన్ షేక్‌లకు వివాహాలు జరిపిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఇతడికి గల్ఫ్ దేశాల్లో మంచి నెట్‌వర్క్ ఉంది. ఎవరైనా ఒమన్ షేక్ వివాహం చేసుకోవడానికి మైనర్ కావాలంటూ అక్కడి ఏజెంట్ల నుంచి సమాచారం అందిన వెంటనే ఇక్కడున్న తన దళారులతో పాటు సహాయకుడు ఇబ్రహీం షరీఫ్ ద్వారా ఏర్పాట్లు చేస్తుంటాడు. గత నాలుగేళ్లలో దాదాపు 40 మంది గల్ఫ్ షేక్‌లకు సిటీలో వివాహాలు జరిపించాడు. ఇతడు వివాహాలు జరిపించిన 40 మందిలో 35 మంది బాధితుల్ని పోలీసులు గుర్తించారు. వీరిలో 22 మంది మైనర్లే. మిగిలిన వాళ్లు 22 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్కులు. ఫలక్‌నుమ బాలిక రుక్సా వివాహం చేయించిందీ ఇతగాడే.
మాటమార్చినా ఆధారాలు చిక్కడంతో..
దక్షిణ మండల పోలీసులు గత వారం అరెస్టు చేసిన 20 మంది నిందితుల్లో ఐదుగురు ఒమన్ షేక్‌లు ఉన్నారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ఓల్టా ఖాజీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి గల్ఫ్ పారిపోయే ప్రయత్నాలు చేశాడు. ఇతడి నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు పరిశీలించిన నేపథ్యంలో మరికొందరు షేక్‌ల వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. ఒమన్‌కు చెందిన 70 ఏళ్ల అల్ షియాదీ సులేమాన్ బిన్ ఖామిస్ బిన్ సాలమ్ మైనర్‌ను వివాహం చేసుకోవడానికి వచ్చాడు. ఓల్టా ఖాజీకి రూ.20 వేల అడ్వాన్స్ ఇచ్చాడు. కొందరు మైనర్లను ఇతడికి చూపించినా నచ్చలేదని చెప్పాడు. ఐదుగురు ఒమన్ షేక్‌ల వ్యవహారం తెలియడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో తాను వైద్యం కోసం వచ్చానంటూ చెప్పుకొచ్చాడు. ఓల్టా ఖాజీ ద్వారా ఆధారాలు దొరకడంతో పోలీసులు సాలమ్‌ను అరెస్టు చేశారు.
అంధుడైన షేక్‌ను తీసుకొచ్చిన ఏజెంట్..
ఒమన్‌కు చెందిన దళారి అల్ షియాది మహ్మద్ ఖాల్ఫన్ మహ్మద్‌ను సైతం దక్షిణ మండల పోలీసులు పట్టుకున్నారు. ఓల్టా ఖాజీతో వాట్సాప్, ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపిన ఇతడు అల్ షియాదీ సులేమాన్ ఖమిస్ సలామ్ అనే షేక్‌కు మైనర్ యువతిని వెతికిపెట్టాల్సిందిగా కోరాడు. గత వారం సలామ్‌ను పట్టుకున్న పోలీసులు అతడి కాల్ రికార్డుల ఆధారంగా ఖాల్ఫన్ వ్యవహారం గుర్తించి మంగళవారం అరెస్టు చేశారు. మరో ఒమన్ జాతీయుడైన అల్ అవ్ధీ యాసీర్ అబ్దుల్లా హమ్‌దాన్.. కొన్నాళ్ల క్రితం ఒమన్‌కే చెందిన అంధుడు అబ్దుల్లా ముబారక్‌కు మైనర్‌తో వివాహం చేయిస్తానంటూ ఒప్పందం కుదుర్చుకుని తీసుకొచ్చాడు. రుక్సా కేసులో దళారిగానూ వ్యవహరించిన ఇతడినీ సౌత్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు మరో ఇద్దరు ఒమన్ షేక్‌లను వారి దేశానికి డిపోర్టేషన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గత వారం అరెస్టు చేసిన ముంబై చీఫ్ ఖాజీ సహా 10 మంది నిందితుల్ని తదుపరి విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నారు.
పెళ్లి.. విడాకులు ఒకేసారి..
ఓల్టా ఖాజీ వివాహం చేసే సమయంలో ఆ ఒప్పంద పత్రం (నిఖానామా)తో పాటే విడాకుల పత్రం (తలాఖ్‌నామా) సైతం రాసేస్తాడు. పెళ్లి జరుగుతున్నప్పుడే దీనిపైనా సంతకాలు చేయిస్తాడు. దీంతో వివాహానంతరం గరిష్టంగా రెండు నెలల పాటు సిటీలోనే ఉంటున్న ఒమన్ షేక్‌లు అమాయక బాలికలతో జల్సాలు చేసి ఆపై అర్ధంతరంగా వదిలి తమ దేశాలకు వెళ్లిపోతున్నారు. నాలుగేళ్లలో ఇలా మోడుల్లా మిగిలిపోయిన బాధితుల సంఖ్య 25 మంది అని దక్షిణ మండల పోలీసులు గుర్తించారు. రుక్సా వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాల దర్యాప్తులో ఇతడి వ్యవహారంతో పాటు సహాయకుడు షరీఫ్ ఆగడాలూ బయటపడ్డాయి. దీంతో వీరిద్దరినీ అరెస్టు చేసి పలు పత్రాలు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.