సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): అందరికీ మిత్రులమే ఎవరికీ శత్రువులం కాదు అనే నినాదంతో జనరంజక పాలన అందించిన ఒమన్ రాజు ఖబూస్ బిన్ అల్ సయీద్(79) మరణం తమకు తీరనిలోటని ఒమాన్‌లో ఉపాధి పొందుతున్న తెలంగాణవాసులు అభిప్రాయపడ్డారు. ఖబూస్ బిన్ అల్ సయీద్ తమ గుండెల్లో గూడుకట్టుకున్నాడని అతడు మరణించినా జ్ఞాపకాలు మాత్రం తమ మదిలో నిలచిపోతాయని పలువురు తెలంగాణవాసులు చెబుతున్నారు. ఈ నెల 10న ఖబూస్ మరణించగా 11న అధికారిక ప్రకటన వెలువడింది. ఇదేరోజున అతడి అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఖబూస్ మరణించిన నుంచి ఒమన్‌లోని ఎంతో మంది తెలంగాణ వలసదారులు ఖబూస్‌ను కొలుస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిమానం చాటుకుంటున్నారు. ఖబూస్ చిత్రాలు, పలు సందర్భాల్లో తీసిన వీడియోలుమ వారికి మెసెజ్‌రూపంలో పంపిస్తున్నారు. మన కేంద్ర ప్రభుత్వం ఈ నెల 13న సంతాపదినంగా పాటించింది. ఆ రోజు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు మన ప్రభుత్వాలు నిర్వహించలేదు. ముంబై, పుణేలో తన విద్యాభ్యాసం కొనసాగించిన ఖబూస్ బిన్ అల్ సయీద్ 1970లో ఒమన్ పగ్గాలు చేపట్టిన తరువాత భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేశారని వలసదారులు వివరించారు.
గల్ఫ్ దేశాల్లో వలసదారులను కట్టు బానిసలుగా చూసే దుస్థితి కొనసాగుతోంది. ఒమన్‌లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వలసదారులను తమ సొంత మనుషులుగా చూసే గొప్ప సంప్రదాయానికి బాటలు వేసిన దార్శనికుడు ఖబూస్ బిన్ అల్ సయీద్ అని తెలంగాణవాసులు కీర్తిస్తున్నారు. తాము ఉపాధి కోసం ఇంటికి దూరంగా ఉన్నా సొంత ఇంటిలోనే ఉన్నామనే భావన కలిగిందని, ఇందుకు ఖబూస్ మంచితనం, మానవత్వమే కారణమంటున్నారు. ప్రస్తుతం ఒమాన్‌లో వలస కార్మికులు 1.35 లక్షల మంది ఉంటారని అంచనా.వారికి కష్టంకలగకుండా చూసిన ఖబూస్ లేని లోటు తీరనిదని ప్రవాసులు ఆవేదనవ్యక్తం చేశారు.
తట్టుకోలేక పోతున్నాం
నేను 25 ఏళ్ల నుంచి ఒమన్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తు న్నా. ఒమన్‌లో ఎవరికైనా చిన్న కష్టం వచ్చినా ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వారి సమస్య ఇట్టే పరిష్కారం అయ్యేది. ఖబూస్ మరణించిన వార్త విని తిండి కడుపులోకి పోవడం లేదు. ఖబూస్ మరణించిన రెండో రోజు నుంచి జోరు వర్షం కురుస్తోంది. అంటే ఆకాశం అతడి మృతి పట్ల దుఖిఃస్తుందని అనిపిస్తుంది. ఇలాంటి గొప్ప మానవత్వవాది మరణించడం మాకు మింగుడుపడడం లేదు. ఈ బాధ నుంచి ఎలా బయటపడతామో అర్థం కావడం లేదు.
– రిటా, ప్రొఫెసర్, ఒమన్
సొంత మనిషిని కోల్పోయినట్లు ఉంది
ఒమన్ రాజు ఖబూస్ బిన్ అల్ సయీద్ మరణిస్తే అందరికీ సొంత మనిషిని కోల్పోయినట్లు బాధ కలుగుతోంది. ఇలాంటి మానవతావాది, గొప్ప దార్శనికుడిని కోల్పోవడం ప్రధానంగా వలసదారులకు తీరని లోటు. ఒమన్ పాలనను అభివృద్ధి పథంలో నడిపించడమే కాదు ప్రజలను సొంత బిడ్డలుగా చూసుకున్న రాజు మరణించడం తీరని లోటు. ఖబూస్ మరణించినా అతడి జ్ఞాపకాలు మాత్రం అందరి మదిలో నిలిచిపోతాయి
– నరేంద్ర పన్నీరు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, ఒమన్
గొప్ప నాయకుడిని కోల్పోయాం
ఒమన్ రాజు ఖబూస్ బిన్ అల్ సయీద్ మరణం ఒక్క ఒమన్‌కే కాదు ఎన్నో దేశాలకు తీరని లోటు. గొప్ప నాయకుడిని కోల్పోయాం. వలసదారులకు ప్రధానంగా భారతీయులకు ఖబూస్ ఎంతో అభిమాన నాయకుడు. ఒమన్‌లో అభివృద్ధిని పరుగులు పెట్టించిన ఘనత ఖబూస్‌కు దక్కుతుంది. ఖబూస్ మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నాం. ఇలాంటి పాలకుడు మళ్లీ పుడుతాడా అనిపిస్తుంది.
– గణేశ్ గుండేటి, ఒమన్ తెలంగాణ సమితి కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment