ఎలా..?
కార్పొరేషన్ ఎన్నికలపై పార్టీల మల్లగుల్లాలు
- ఓటర్ల జాబితా వెల్లడితో అభ్యర్థుల వేట
- అంగ, అర్థబలం ఉన్నవారి కోసం కసరత్తు
- జంప్ జిలానీలపై అధికారపార్టీ అంచనాలు
- క్షేత్రస్థాయి బలం లేక గు‘లాబీ’లో గుబులు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాజకీయ పార్టీల్లో ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల వేడి రాజుకుంది. డివిజన్లు, ఓటర్ల జాబితాను ప్రకటించడంతో పార్టీల నేతలు అభ్యర్థుల వేటలో పడ్డారు. ఖమ్మం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థారుుకి విస్తరించడంతో ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారుు. ఎవరిని తమ పార్టీ వైపు లాగాలి.. ఎవరికి అంగబలం, అర్థబలం ఉందని ఆరా తీస్తున్నారు. బరిలో నిలిస్తే ప్రత్యర్థిగా ఎవరు ఉంటారు..? డివిజన్లలో ఎన్ని ఓట్లు తమకు వస్తాయనే అంచనాల్లో మునిగారు.
హోరాహోరీ పోరు తప్పకపోవచ్చు..
కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉన్నారుు. మెజార్టీ డివిజన్లు దక్కించుకున్న వారినే మేయర్ పదవి వరిస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం కార్పొరేషన్ పరిధిలో 2, 84, 268 జనాభా ఉంది. గత సంవత్సరం సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 3,50,000 మంది జనాభా, లక్ష కుటుంబాలు ఉన్నట్లు తేలింది. విలీన గ్రామాలతో కలిపి కార్పొరేషన్‌లో జులై చివరి నాటికి 2,45,600 ఓటర్లు ఉన్నట్లు లెక్కతేలింది. పోలింగ్‌స్టేషన్ల ఏర్పాట్లు కూడా కొలిక్కి వచ్చాయి. ఓటర్ల జాబితా సవరణలు, పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లు అంతా ఈ నెలతో ముగియనుంది. డిసెంబర్‌లో ఎన్నికల నగారా మోగనుందన్న ఉద్దేశంతో పార్టీల నేతలు ముందస్తు కసరత్తు మొదలు పెట్టారు.
అంగ, అర్థబలం ఉన్న అభ్యర్థుల కోసం..
కార్పొరేటర్‌గా గెలుపొందాలంటే అంగ, అర్థబలం కచ్చితం. ఏ డివిజన్‌లో ఏ కులం బాగా ఉంది..? వారిలో రాజకీయంగా పరిణతి చెందినవారు ఎవరు? గతంలో పోటీ చేసి విజయం సాధించింది..? ఓడిపోరుుంది ఎవ రు..? తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. అధికారపార్టీ ప్రలోభాలకు లొగకుండా ఉండే బలమైన అభ్యర్థులు ఎవరో ప్రతిపక్షాలు ఆరా తీస్తున్నారుు. ఇంకా ఎన్నికల నోటిఫికేషనే రాలేదు.. పార్టీలు అభ్యర్థులను నిర్ణయించకున్నా.. అన్ని పార్టీల్లో ఆశావహుల సంఖ్య మాత్రం భారీగానే ఉంది. ఎవరికి వా రు తమ అనుంగు నేతలు, ప్రజా ప్రతినిధులు వద్దకు వెళ్లి కార్పొరేషన్ బరిలో నిలబెట్టాలని వేడుకుంటున్నారు. నాలుగైదు డివిజన్లలో 6 వేలకు పైగా, మిగతా వాటిలో 3 వేలకు పైగా ఓట్లు ఉన్నారుు. ఇకపోతే పరపతి ఉండి పైస లు లేనివారు ఒకింత హైరానా పడుతున్నారు.
గులాబీలో గుబులు
నగరంలో టీఆర్‌ఎస్‌కు ఆశించినస్థారుులో బలం లేకపోవడం ఆ పార్టీ నేతలకు గుబులు పుట్టిస్తోంది. జిల్లాపరిషత్ ఎన్నికలతో పోలిస్తే కార్పొరేషన్ ఎన్నికలు ఆ పార్టీ ప్రతిష్టకు సవాల్‌గా మారాయి. ఇప్పటికే కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి మాజీ కౌన్సిలర్లను నయానో..భయానో తమ వైపునకు తిప్పుకున్న పార్టీ నేతలు ఎన్నికల నాటికి జంప్ జిలానీలపైనే దృష్టి పెట్టారు. ఎలాగైనా కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేస్తేనే ముఖ్యమంత్రి వద్ద తమ పరువు నిలబడుతుందని అంటున్నారు. ఆదిలోనే హంసపాదు అనే రీతిలో ఆ పార్టీ నేతల మధ్య వర్గవిభేదాలు కూడా మొదలవడం పార్టీ పెద్దలకు ఒకింత ఆందోళన కలిగిస్తోంది. ఉద్యమానికి అండగా ఉన్న నేతలను విస్మరిస్తే ఎలా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. జిల్లా పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు కూడా ఎన్నికల ముందు పార్టీ తీర్థం పుచ్చుకున్న వారికి ఇవ్వడంతో పాత నేతలంతా రగిలిపోతున్నారు. ఉద్యమ జెండా మోసిన వారికి టికెట్లు ఇవ్వకుంటే అధికారపార్టీకి రెబల్ అభ్యర్థుల బెడద తప్పదనే చర్చ నడుస్తోంది.