వేగంగా వెళ్తున్న ఇసుక లారీ మోపెడ్ వాహనాన్ని ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
నకిరేకల్ (నల్లగొండ జిల్లా) : వేగంగా వెళ్తున్న ఇసుక లారీ మోపెడ్ వాహనాన్ని ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన గురువారం నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం కడపర్తి గ్రామ సమీపంలో జరిగింది. వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండలం వల్లారం గ్రామానికి చెందిన భిక్షమయ్య, వాణీ(35) దంపతులు రాఖీలు కొనేందుకు నకిరేకల్ వెళ్తున్నారు. కాగా మార్గ మధ్యంలో వీరు ప్రయాణిస్తున్న మోపెడ్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది.
దీంతో వాణి అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన భిక్షమయ్యను మెరుగైన వైద్యం కోసం నకిరేకల్ తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా చేనేత కార్మికురాలైన వాణికి ఇద్దరు సంతానం ఉన్నట్లు సమాచారం.