ఖమ్మం: తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని వెంకటాపురం గ్రామంలో బుధవారం నాటుబాంబు పేలింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లే వెంకటాపురం మండలం విజయపురి కాలనీ సమీపంలో రహదారి పక్కన బాంబుపేలింది. ఈ పేలుడులో ఓ బాటసారి గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రుడిని 108 వాహనంలో మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నాటు బాంబు పేలిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఇది నాటుబాంబా లేక కూంబింగ్‌కు వెళ్లే పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన బాంబా అనే విషయం తేలాల్సి ఉందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.