శాంతినగర్ : పాతకక్షలు భగ్గుమనడంతో ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే... వడ్డేపల్లి మండలం రాజోలికి చెందిన కుర్వ నీలికొట్టం అయ్యన్నకు నలుగురు కుమారులు. వీరికి గ్రామంలోని తెలిగి రవి కుటుంబంతో పాతకక్షలున్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి అతని పెద్ద కుమారుడు నీలికొట్టం నారాయణ (38) సైకిల్‌పై తమ్ముడు లక్ష్మీపతి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో మాట్లాడి తమ ఇంటికి బయల్దేరాడు. అయితే పది గంటల వరకు తిరిగి రాకపోవడంతో భార్య జయమ్మ ఫోన్ చేయగా అతను ఎత్తకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు వెతకసాగారు. చివరకు పోలీస్‌స్టేషన్ సమీపంలోనే రక్తపు మడుగులో పడిఉన్న నారాయణ మృతదేహాన్ని చూసి బోరుమన్నారు.
ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ లక్ష్మీనర్సింహ పరిశీలించారు. పథకం ప్రకారమే రవి హత్యచేసి ఉంటాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కోదండాపురం స్టేషన్‌కు తరలించారు. ఆదివారం ఉదయం గద్వాల డీఎస్పీ బాలకోటి, అలంపూర్ సీఐ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకుని క్లూస్‌టీంతో విచారణ చేపట్టారు. ఈ ఘాతుకానికి ముగ్గురు లేదా నలుగురు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ సంఘటనతో రాజోలి ప్రజలు ఉలిక్కిపడ్డారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, నీలికొట్టం నారాయణకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.