సాక్షి, హైదరాబాద్: జైలులో ఖైదీ మృతిచెందితే బాధిత కుటుంబానికి రూ.లక్ష పరిహారం అందనుంది. ఖైదీలకు బీమా సదుపాయం కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అలాగే జైలులోని క్యాంటీన్ ద్వారా ఖైదీలకు విక్రయించే ఆహార పదార్థాలపై చార్జీలను 10 నుంచి 5 శాతానికి తగ్గించాలని జైళ్ల శాఖ నిర్ణయించింది. అనారోగ్యంతో మృత్యువుతో పోరాడే ఖైదీలు చివరి రోజుల్లో కుటుంబ సభ్యులతో గడిపేలా వారికి బెయిల్ ఇప్పించడంలో సహకరించనుంది. ఒకవేళ ఖైదీలు జైలులో మృతిచెందితే వారి కుటుంబాలకు రూ.లక్ష బీమా సదుపాయం కల్పించనుంది. అయితే, సహజ మరణాలకే ఈ బీమా వర్తిస్తుంది.