ఒకటే ప్రోగ్రెస్ కార్డు
పాఠశాల మారినా అదే కార్డు
- 6 నుంచి 10వ తరగతి వరకు కొనసాగింపు
- విద్యార్థి సమగ్ర వివరాలు అందులోనే..
మంచిర్యాల సిటీ : ప్రతీ విద్యాసంవత్సరానికో ప్రోగ్రెస్(ప్రగతి పత్రం) కార్డు విధానానికి విద్యాశాఖ స్వస్తి పలికింది. ఇకపై ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒకటే ప్రోగ్రెస్ కార్డు జారీ కానుంది. గత విద్యాసంవత్సరం వరకు ప్రతీ విద్యార్థికి తరగతి వారీగా ఏడాదికో ప్రోగ్రెస్ కార్డు ప్రభుత్వ పాఠశాల నుంచి ఇచ్చేవారు. అయితే ఈ విద్యాసంవత్సరం నుంచి ఒకటే కార్డు ఇస్తున్నారు. ఈ కార్డు పేరును విద్యార్థి సంచిత సమగ్ర ప్రగతి నివేదికగా పేర్కొన్నారు. ఈ నివేదిక విద్యార్థి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉపయోగపడుతుంది. పాఠశాల మారితే విద్యార్థి తన వెంట తీసుకెళ్లి చేరిన పాఠశాలలో అప్పగించాలి. అందులో విద్యార్థి వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. ఫొటో తప్పనిసరి. నివేదికలో ప్రతీ తరగతికి ఆరు పేజీలు కేటాయించారు. తరగతి వారీగా ఆరోగ్య సమాచారం, వివరణాత్మక సూచనలు, గ్రేడ్ వివరాలు నమోదు చేసి దానిపై తల్లిదండ్రుల సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్థి వివరాలు
పాఠశాల పేరు, విద్యార్థి గుర్తింపు సంఖ్య, మాధ్యమం, విద్యార్థి పేరు, తల్లి, తండ్రి పేరు, తరగతి, ప్రవేశ సంఖ్య, పుట్టిన తేదీ, సామాజిక వర్గం, చిరునామా, మొబైల్ నంబరు, మెయిల్ ఐడీ, రక్త వర్గం, ఎత్తు, బరువు (తరగతుల వారీగా) ప్రోగ్రెస్ కార్డులో నమోదు చేయాలి. వీటితో పాటు ఆరో తరగతిలో చేరిన సమయంలో తీసిన విద్యార్థి ఫొటో అతికించాలి. ఆ తర్వాత పదో తరగతిలో చేరిన ఫొటో అతికించాలి.
తల్లిదండ్రులు..
ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు నిర్వహించే సమావేశానికి తల్లిదండ్రులు ఈ ప్రోగ్రెస్ కార్డుతో హాజరు కావాలి. వారితో విద్యార్థి ప్రగతిని చర్చించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశంలోనూ విద్యార్థి ప్రగతిపై చర్చించే అవకాశం ఏర్పడుతుంది.
ఉపాధ్యాయులు..
ప్రతీ ఉపాధ్యాయుడు తన సబ్జెక్టులకు సంబంధించిన మార్కులు, గ్రేడులు నమోదు చేయాలి. విద్యార్థి ప్రగతిని గ్రేడుల రూపంలో మాత్రమే నమోదు చేయాలి. నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక మూల్యాంకనాలను నమోదు చేసిన ప్రతీసారి తల్లిదండ్రుల సంతకాలు సేకరించి వారి అభిప్రాయాలను సైతం తీసుకోవాలి. విద్యార్థులు పాఠశాల నుంచి మరో పాఠశాలకు బదిలీ అయినప్పుడు ఇదే నివేదికను వారికి అప్పగించాలి.
పనిభారం
మారిన సిలబస్ ఆధారంగా బోధన, పరీక్ష , మూల్యాంకనం, విద్యార్థులను చదివించే తీరు మారింది. దీనికితోడు నివేదిక (ప్రోగ్రెస్ కార్డు)లో వివరాలు నమోదు చేయడం ద్వారా పని పెరిగింది. ఆరు సబ్జెక్టులకు సంబంధించిన మార్కులతోపాటు విద్యార్థికి సంబంధించిన వ్యక్తిగత విషయాలపై కూడా మార్కులు వేసి గ్రేడులు నమోదు చేయాల్సి ఉండడంతో పనిభారం పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.