మొయినాబాద్: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనే జరగాలని కలెక్టర్ రఘునందన్‌రావు అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు మహిళా ప్రాంగణం ఆవరణలోని డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో జిల్లా మహిళా సమాఖ్య సమావేశం బుధవారం సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు శకుంతల అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన కలెక్టర్ సమాఖ్య సభ్యులతో ముఖాముఖి చర్చించారు. గ్రామాల్లో చిన్న సంఘాల నిర్వహణ ఎలా ఉందని, సమావేశాలు, పొదుపు, రుణాలు, రికవరీ ఏవిధంగా ఉన్నాయని సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
గ్రామ సంఘాలు, మండల సమాఖ్యల పనితీరుపైనా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లా మహిళా సమాఖ్య ప్రస్తుతం నెలకు ఒకరోజే సమావేశం నిర్వహించి పనిచేస్తుందని, ఇక నుంచి ప్రతి రోజు పనిచేయాలని చెప్పారు. చిన్న సంఘాల మాదిరిగానే జిల్లా మహిళా సమాఖ్యలోనూ ప్రతి నెలా కనీసం రూ.500 చొప్పున పొదుపు చేయాలన్నారు. జిల్లా సమాఖ్య సమావేశానికి వచ్చే సభ్యులు తమ మండలంలోని పూర్తి వివరాలను తీసుకురావాల్సి ఉంటుందన్నారు. ఆ నెలలో జరిగిన లావాదేవీల వివరాలన్నీ క్లుప్తంగా ఇవ్వాలన్నారు.
సంఘాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలన్నీ బ్యాంకుల నుంచి తీసుకుని ఆన్‌లైన్‌లో పొందుపర్చాల్సి ఉన్నా ఈ విషయంలో ఏసీలు, ఏపీఎంల నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఏసీలు, ఏపీఎంలు తమ పనితీరును మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రతి మంగళవారం అన్ని శాఖల అధికారులతో జరిగే సమావేశంలో మరణ ధ్రువీకరణ పత్రాల జారీపై చర్చించి అవసరమైన సర్టిఫికెట్లు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి, ఏపీడీ ఉమారాణి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శకుంతల, కార్యదర్శి సునీత, జేడీఎం హమీద్, డీపీఎం గిరిజ, ఏరియా కోఆర్డినేటర్లు, జిల్లా సమాఖ్య సభ్యులు, ఏపీఎంలు పాల్గొన్నారు.
పనులే పూర్తి కాలేదు.. అప్పుడే పగుళ్లా: ఇంజినీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
పనులే పూర్తికాలేదు అప్పుడే గోడలకు పగుళ్లా... మీ సొంత ఇల్లయితే ఇలాగే కట్టుకుంటారా... ఏం పనిచేస్తున్నారు... పనుల్లో నాణ్యత పాటించరా..? అంటూ కలెక్టర్ రఘునందన్‌రావు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని చిలుకూరు మహిళా ప్రాంగణం ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల్లో పూర్తిగా నాణ్యత లోపించిందని, పనులు పూర్తి కాకముందే పగుళ్లు రావడం ఏమిటని పంచాయతీరాజ్‌శాఖ ఏఈ భాస్కర్‌రెడ్డిని ప్రశ్నించారు. దగ్గరుండి పనులు చూసుకోవాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు.
కోటి రూపాయలతో నిర్మిస్తున్న భవనం ఇలాగేనా నిర్మించేదని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ విధంగా పనులు చేపడితే పది కాలాలపాటు మన్నికగా ఉండాల్సిన భవనం మూణ్నాళ్లకే పోతుందని అన్నారు. ఇప్పటికైనా పనితీరు మార్చుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని ఏఈని హెచ్చరించారు. అనంతరం అదే ప్రాంగణంలో జరుగుతున్న మరో భవన నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షించాలని పంచాయతీ రాజ్ డీఈ జగన్‌మోహన్‌రెడ్డిని ఆదేశించారు.
ఆయన వెంట డీఆర్‌డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి, ఏపీడీ ఉమారాణి, జేడీఎం హమీద్, ఎంపీడీఓ సుభాషిణి తదితరులు ఉన్నారు. కాగా కలెక్టర్ రఘునందన్‌రావు ఆకస్మిక పర్యటనతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు.ఆయన వచ్చీ రావడంతోనే జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులు పరిశీలించి ఇంజినీరింగ్ విభాగం అధికారులపై మండిపడటంతో అక్కడున్న వారందరూ ఖంగుతిన్నారు.
లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లో జరగాలి
Published Wed, Mar 4 2015 11:58 PM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM
Advertisement