ఏటా రెండు టెట్‌లు ఏవీ?
ఎన్‌సీటీఈ మార్గదర్శకాలు బేఖాతరు!
► తెలంగాణ ఏర్పాటయ్యాక మూడేళ్లలో నిర్వహించింది ఒకటే టెట్
► ఇప్పటివరకు అర్హత సాధించింది 3 లక్షల మంది
► ఎదురుచూస్తున్న వారు మరో 2.5 లక్షలు
► డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: గురుకుల టీచర్ల నియామక నిబంధనల్లో ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్) అర్హత తప్పనిసరిగా పేర్కొన్న విద్యాశాఖ.. దాని నిర్వహణపై మాత్రం అలసత్వం ప్రదర్శిస్తోంది. లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న టెట్‌ను ఏటా రెండు సార్లు నిర్వహించాలన్న జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) మార్గదర్శకాలనూ బేఖాతరు చేస్తోంది. ప్రస్తుతం గురుకుల టీచర్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండటం, త్వరలో పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కానున్న నేపథ్యంలో టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అయినా టెట్ నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దృష్టి పెట్టడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన వారు 3 లక్షల మంది ఉన్నారని, ఇప్పుడు టెట్ అవసరమే లేదని ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలో అభ్యర్థులు ఆందోళనలో మునిగిపోతున్నారు. ఇక మరోవైపు టీచర్ నియామకాల్లో టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఉంది. దీంతో ఇప్పటికే టెట్‌లో అర్హత పొందినవారు కూడా స్కోర్ పెంచుకునేందుకు టెట్ నిర్వహించాలని కోరుతున్నారు.
ప్రైవేటులో బోధనకూ టెట్ కావాల్సిందే
ఎన్‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ స్కూళ్లేకాదు ప్రైవేటు స్కూళ్లలోనూ టెట్ అర్హులు మాత్రమే ఉపాధ్యాయులుగా పనిచేయాలి. రాష్ట్రంలోని 29 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలల్లో టెట్‌లో అర్హత సాధించిన వారినే ఉపాధ్యాయులుగా నియమిస్తున్న నేపథ్యంలో.. 11 వేలకుపైగా ఉన్న ప్రైవేటు స్కూళ్లలోనూ కచ్చితంగా అమలు చేయాలని గతంలో విద్యాశాఖ భావించింది. కానీ ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల్లోని ఉపాధ్యాయుల్లో 64 శాతం మంది టెట్‌లో అర్హత సాధించనివారు, ఎలాంటి ఉపాధ్యాయ శిక్షణ పొందని వారే కావడం గమనార్హం. ఇంజనీరింగ్ చేసిన వారు ఉన్నత పాఠశాల్లో సైన్స్, గణితం వంటి సబ్జెక్టులను బోధిస్తున్నారు. వారిలో ఉపాధ్యాయ శిక్షణ పొందని వారు ఇంగ్లిషు బోధిస్తున్నారు. ఇలాంటి వారికి బోధనకు సంబంధించిన పదజాలంపై పట్టులేదు. పాఠ్య పుస్తకాల నేపథ్యం, తాత్వికత, అభ్యాసాలు, విద్యా ప్రమాణాల గురించి అవగాహన ఉండదు. కేవలం పాఠం వివరించి, జ్ఞాపకం చేయించడం, వారాంతంలో పరీక్షలు నిర్వహించడం వంటివే చేస్తున్నారు. అయినా ఉపాధ్యాయ శిక్షణ, టెట్ నిర్వహణ వంటి అంశాలను విద్యాశాఖ పట్టించుకోవడం లేదు.
ఆరేళ్లలో ఐదు టెట్‌లే!
ఎన్‌సీటీఈ 2011లో టెట్ నిర్వహణకు మార్గదర్శకాలు జారీ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఐదు సార్లు టెట్ నిర్వహించారు. నిబంధనల ప్రకారమైతే ఏటా రెండుసార్లు చొప్పున ఆరేళ్లలో 12 సార్లు టెట్ నిర్వహించాల్సి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మూడుసార్లు టెట్ నిర్వహించగా.. తెలంగాణ ఏర్పాటయ్యాక రెండుసార్లే నిర్వహించారు. అందులోనూ ఒకటి ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన నోటిఫికేషనే. తెలంగాణ ఏర్పాటయ్యాక ఈ మూడేళ్లలో నిర్వహించింది ఒకే ఒక్క టెట్. మొత్తంగా ఐదుసార్లు నిర్వహించిన టెట్‌లలో తెలంగాణకు చెందిన వారు దాదాపు 3 లక్షల మంది అర్హత సాధించినట్లు విద్యాశాఖ అంచనా వేసింది. మరో 2.5 లక్షల మంది టెట్ కోసం ఎదురుచూస్తున్నారు.