సాక్షి,సిటీ బ్యూరో: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. గత ఐదేళ్లుగా ఏటా రెండు విడుతలుగా బాల కార్మికులకు విముక్తి కల్పించేందుకు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. అందులో భాగంగా నగరంలో ఈ నెల 1 నుంచి ఆపరేషన్ ముస్కాన్–5 పేరుతో అధికార యంత్రాంగం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. బాలకార్మికులు, మిస్సింగ్, వీధి బాలలు, డ్రాప్ అవుట్స్, బిక్షాటన చేసే చిన్నారులను గుర్తించి వారికి పునరావాసం కల్పించనున్నారు. ఇందుకోసం మహిళా శిశు సంక్షేమ, పోలీసు, రెవెన్యూ, కార్మిక శాఖ, న్యాయ సేవా సంస్థ, చైల్డ్‌లైన్ ఎన్జీవోల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. జూలై ఒకటి నుంచి 31 వరకు చేపట్టే ఈ కార్యక్రమంలో మొదటి వారం తప్పిపోయిన చిన్నారుల గుర్తింపు, రెండో వారంలో వీ«ధి బాలల గుర్తింపు, మూడో బాలకార్మికుల గుర్తింపు, నాల్గో వారం బిక్షాటన చేసే బాలలను గుర్తించనున్నారు. ఇందు కోసం ఆయా శాఖల అధికారులతో 17 బృందాలను ఏర్పాటు చేసింది. ఆయా బృందాలు పరిశ్రమలు, కర్మాగారాలు, హోటళ్లపై అకస్మిక దాడులు నిర్వహించి అందులో పనిచేస్తున్న బాలకార్మికులను విముక్తి కల్పించనున్నారు. వీధి బాలలు, బిక్షాటన చేసేవారిని గుర్తించి స్వస్థలాలకు పంపడంతోపాటు పునరావాస చర్యలు చేపడుతున్నారు.
నగరంలో 50 వేలకు పైగాబాలకార్మికులు
నగరంలో సుమారు 50 వేలకు పైగా బాలకార్మికుల ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కింద రెండు వేల మందిని గుర్తించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అందులో సగానికి పైగా బాల, బాలికలకు పునరావాసం కల్పించారు. గత ఐదేళ్లుగా ఏటా స్పెషల్ డ్రైవ్‌లో గుర్తించిన స్థానికులకు పునరావాస కల్పన, ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని స్వస్థలాలకు పంపిస్తున్నారు. మరికొందరిని స్కూళ్లలో చేర్పించారు. మిగితా వారిని స్టేట్ హోంకు అప్పగించారు. పూర్తి స్థాయి బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు కసరత్తు చేసుస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
బాలకార్మికులందరికీ విముక్తి
వివిధ సంస్థలు, షాపుల్లో చట్టవ్యతిరేకంగా పని చేస్తున్న బాలకార్మికులను గుర్తించి వారికి పునరావాసం కల్పించడం ముఖ్య ఉద్దేశం. ఆపరేషన్ ముస్కాన్ రెస్క్యూలో ప్రత్యేక బృందాలు పాల్గొంటాయి. పట్టుబడిన చిన్నారులకు చదువుపై ఆసక్తి ఉంటే పాఠశాల్లో చేర్పిస్తాం. పద్నాలుగు సంవత్సరాల లోపు చిన్నారులతో పని చేయించడం చట్టరిత్యా నేరం. మహ్మద్ ఇంతియాజ్ , జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి. హైదరాబాద్.
Comments
Please login to add a commentAdd a comment