ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో ఉన్న కొందరు వ్యక్తులు మంగళవారం వైద్యులపై దాడికి దిగారు. పాజిటివ్ వచ్చిన వారితో కలిపి తమను వార్డులో ఉంచడం ఏమిటంటూ అనుమానిత లక్షణాలతో ఉన్న ఓ వ్యక్తి బంధువులు తోపులాటకు, వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ జరుగుతుండగానే.. అనుమానితుడిని అతని కుమారుడు చెప్పాపెట్టకుండా పాతబస్తీలోని ఇంటికి తీసుకెళ్లిపోయాడు. తీరా అనంతరం వచ్చిన రిపోర్టులో అతని తండ్రికి పాజిటివ్ రావడం మరింత కలకలం సృష్టించింది.
వాగ్వాదం.. తోపులాట
ఉస్మానియా ఆస్పత్రి ఏఎంసీ వార్డులో ఏర్పాటుచేసిన ఐసోలేషన్ వార్డులో 12 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరికి మంగళవారం పాజిటివ్ వచ్చింది. వీరిద్దరిని గాంధీ ఆస్పత్రికి తరలించే ప్రక్రియను వైద్యులు మొదలుపెట్టారు. అంతలో వార్డులో ఉన్న మిగిలిన వారు.. వైరస్ ఒకరి నుంచి మరొకరికి విస్తరించే ప్రమాదం ఉండటంతో ఈ వార్డులో ఉండలేమని, డిశ్చార్జ్ చేస్తే ఇంటికి వెళ్లిపోతామంటూ అనుమానిత లక్షణాలున్న ఓ వ్యక్తి తాలూకు బంధువులు ఆందోళనకు దిగారు. టెస్ట్ రిపోర్టులు రావాలని, అందులో నెగెటివ్ వస్తే డిశ్చార్జ్ చేస్తామని, అప్పటివరకు సంయమనం పాటించాలని విధుల్లో ఉన్న జూనియర్ వైద్యులు చెప్పారు. అయినా వారు వినిపించుకోకుండా బయటికి వెళ్లేందుకు యత్నిస్తూ, అడ్డుకున్న వైద్యులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఓ జూనియర్ వైద్యుడు కిందపడిపోయారు. గొడవ జరుగుతుండగానే, పాజిటివ్‌గా తేలిన ఇద్దరినీ వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్న వైద్యులపై దాడి చేయడం హేయమన్నారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, వైద్యులకు రక్షణ కల్పిస్తామని హామీనిచ్చారు. సమస్యను పరిష్కరించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్‌లోనే ఆదేశాలు జారీ చేశారు.
రక్షణ కల్పించాలంటూ ‘జూడా’ల ఆందోళన
విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేసిన బాధితుడి తరపు బంధువులను కఠినంగా శిక్షించాలని, వైద్యులకు రక్షణ కల్పించాలంటూ పలువురు జూనియర్ డాక్టర్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఐసోలేషన్ వార్డుల్లో పనిచేస్తున్న జూడాలకు కనీస రక్షణ లేదని, ఇటు వైరస్‌తో, అటు రోగులతో ఇబ్బంది పడుతున్నామని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తండ్రిని తీసుకుని ఇంటికి..రిపోర్ట్‌లో పాజిటివ్
జూనియర్ వైద్యులతో ఒకపక్క వాగ్వాదం, తోపులాట జరుగుతుండగానే, ఐసోలేషన్ వార్డులో ఉన్న తన తండ్రిని తీసుకుని అతని కుమారుడు వైద్యుల కళ్లుగప్పి ఇంటికి వెళ్లిపోయాడు. అనంతరం కొద్దిసేపటికే రిపోర్ట్‌లు రావడం, అందులో అతని తండ్రికి పాజిటివ్‌గా తేలడంతో వైద్యులు ఉలిక్కిపడ్డారు. పాతబస్తీకి చెందిన అతనిని గాలించి.. తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చారు. అతనితో పాటు ఐసోలేషన్ వార్డులో ఉన్న అందరినీ వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించాలని డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉస్మానియాలోని ఐసోలేషన్ వార్డు దాదాపు ఖాళీ అయ్యింది. కాగా, పాజిటివ్ వచ్చిన వారితో కలిపి తమను ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచడంపై కరోనా అనుమానిత లక్షణాలున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైద్యులపై దాడులు జరుగుతున్నాయి. కాగా, మంగళవారం నాటి ఘటనకు సంబంధించి.. పాజిటివ్ వచ్చిన వారి పక్కనుంటే తమకూ వైరస్ సోకుతుందనే భయంతోనే అలా ప్రవర్తించామని, వైద్యుల మనసు నొప్పించినందుకు తమను క్షమించాలని, వైద్యులపై తమకెలాంటి ద్వేషం లేదని దాడికి పాల్పడిన వ్యక్తులు క్షమాపణ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment