హైదరాబాద్: ఓయూ పీహెచ్‌డీ ప్రవేశాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. వాస్తవానికి జూలై 30న పీహెచ్‌డీలో సీట్లు సాధించిన అభ్యర్థుల జాబితా విడుదల కావాల్సి ఉంది. కానీ అధ్యాపకుల కొరత వల్ల పెరిగిన విద్యార్థుల సంఖ్యను బట్టి పర్యవేక్షకులు లేకపోవడంతో ప్రవేశాలు పొందిన విద్యార్థుల జాబితాను నిలిపివేశారు. కొన్ని విభాగాల్లో ఒకటి, రెండు సీట్లు ఉండగా అర్థశాస్త్రం విభాగంలో ఒక్క గైడ్ కూడా లేకపోవడంతో ఆయా విభాగాల అధిపతులు పర్యవేక్షకుల వేటలో పడ్డారు.
రిటైర్డ్ ప్రొఫెసర్లకు గైడ్‌షిప్ ఇవ్వాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో విభాగాల అధిపతులు విశ్రాంత అధ్యాపకులను ఆహ్వానిస్తున్నారు. అయితే చాలా మంది రిటైర్డ్ అధ్యాపకులు ఓయూలో గైడ్‌షిప్‌ను తిరస్కరిస్తున్నారు. అన్ని అర్హతలు గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు కూడా గైడ్‌షిప్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దీంతో విద్యార్థులు, వివిధ విద్యార్థి సంఘాల నేతలు వీసీ, రిజిస్ట్రార్ కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సీట్లు సరిపడా ఉన్న విభాగాల్లో పీహెచ్‌డీ ప్రవేశాల జాబితా విడుదల చేయా లని విద్యార్థులు కోరుతున్నారు. అయితే ఒకేసారి ప్రకటన వెలువడినందున, జాబితాను కూడా ఒకే సారి విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment