ఉస్మానియాను ‘ఆన్‌లైన్‌’ చేశా | OU Professor Ramachandran With Sakshi Interview | Sakshi
Sakshi News home page

ఉస్మానియాను ‘ఆన్‌లైన్‌’ చేశా

Published Thu, Jul 25 2019 12:42 PM | Last Updated on Sat, Jul 27 2019 12:53 PM

OU Professor Ramachandran With Sakshi Interview

ప్రొఫెసర్‌ రామచంద్రంను సత్కరిస్తున్న వర్సిటీ ఉద్యోగులు

ఉస్మానియాయూనివర్సిటీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తొలి వీసీగా పనిచేయడం తన అదృష్టమని, వందేళ్ల ఓయూకు శతాబ్ది ఉత్సవాలు తన చేతుల మీదుగా నిర్వహించడం పూర్వజన్మ సుకృతమని ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ రామచంద్రం ఆనందం వ్యక్తం చేశారు. అన్ని విభాగాల్లోనూ ఆన్‌లైన్‌ విధానం ప్రవేశపెట్టి అక్రమాలకు చోటు లేకుండా ఓయూను తీర్చిదిద్దానన్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ విభాగం సీనియర్‌ ప్రొఫెసర్‌ రామచంద్రం 2017 జూలై 24న ఓయూ వీసీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. బుధవారంతో ఆయన పదవీ కాలం పూర్తయింది. ఈ సందర్భంగా వీసీగా తన మూడేళ్ల పాలనా అనుభవాలను బుధవారం ‘సాక్షి’తో పంచుకున్నారు. 

సమయ పాలనతో తొలి అడుగు
వర్సిటీ అభివృద్ధిలో వీసీ ప్రొఫెసర్‌ రామచంద్రం సమయ పాలన పాటించారు. అది తన నుంచే మొదలు పెట్టారు. తన నివాసాన్ని ఆర్టీసీ క్రాస్‌రోడ్డు అశోక్‌నగర్‌ నుంచి ఓయూ క్యాంపస్‌కు మార్చారు. వీసీగా బాధ్యతలు నిర్వహిస్తునే ఇంజినీరింగ్‌ కాలేజీలో విద్యార్థులకు క్రమం తప్పకుండా తరగతులను తీసుకున్నారు. భార్య ఇందిర బ్యాంక్‌ మేనేజర్, ఒకే కొడుగు అమెరికాలో స్థిరపడ్డారు. తనకు కుటుంబ బాధ్యతలు పెద్దగా లేకపోవడంతో నిత్యం వర్సిటీ కోసమే పనిచేసిన్నట్లు వివరించారు. రామచంద్రం కంటే ముందు ఓయూకు రెండేళ్ల పాటు శాస్వత వీసీ లేనందున తను పదవీ బాధ్యతలు చేపట్టేనాటికి అనేక సమస్యలతో ఉద్యోగుల ఆందోళనలు నిత్యం  జరుగుతుండేవని, వీటితో పాటు నిధుల కొరతతో ఓయూ కొట్టుమిట్టాడుతుండేది. ఆరు నెలల్లోనే ఆందోళనలకు తావులేకుండా అభివృద్ధిపై దృష్టి సారించానన్నారు. అందరి సహకారంతో మూడేళ్లలో శతాబ్ది ఉత్సవాల నిర్వహణ, ఏడేళ్లకు ‘న్యాక్‌ ఎ ప్లస్‌’ గ్రేడ్‌ గుర్తింపు, రూసా పథకం ద్వారా రూ.100 కోట్లు, ఏడు పరిశోధన కేంద్రాల స్థాపన, ఆరేళ్ల స్నాతకోత్సవాన్ని ఒకేసారి నిర్వహించానన్నారు. 

ఓయూలో ఎన్నో అభివృద్ధి పనులు
ఓయూలో చదివే విద్యార్థుల సౌకర్యార్థం అనేక అభివృద్ధి పనులు చేపట్టిన్నట్లు వీసీ రామచంద్రం వివరించారు. హాస్టల్‌ భవనాల నిర్మాణంతో పాటు కార్యాలయాలు, ఇతర భవనాలను నిర్మించిన్నట్లు చెప్పారు. క్యాంపస్‌లో రోడ్ల నిర్మాణం, తాగునీటి వసతి, ఉచిత వైఫై, వికలాంగ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, పరీక్ష ఫీజు మొదలు హాస్టల్‌ మెస్‌ బిల్లుల వరకు ఆన్‌లైన్‌లో చెల్లిపును ప్రవేశ పెట్టామన్నారు. అన్ని ప్రవేశ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించి జవాబు పత్రాల మూల్యాంకనం సైతం ఆన్‌లైన్‌లో చేస్తున్నట్టు చెప్పారు. పరీక్షల విభాగంలో వివిధ డిగ్రీ కోర్సుల సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఇంటికి పంపే ఏర్పాట్లు చేశామన్నారు. పీజీ ప్రవేశాలు, హాస్టల్స్‌ ప్రవేశాలను ఆన్‌లైన్‌ చేసినట్టు వివరించారు. 

ఓయూ పూర్వ విద్యార్థుల సమాఖ్య
మాజీ వీసీ ప్రొఫెసర్‌ తిరుపతిరావు హయాంలో అంకురించిన ఓయూ పూర్వ విద్యార్థుల సమాఖ్యను ప్రొఫెసర్‌ రామచంద్రం బలోపేతం చేశారు. పూర్వ విద్యార్థుల ఆహ్వానం మేరకు అమెరికాలో పర్యటించి ఓయూ అభివృద్ధికి సహకరించాలని కోరారు. దాంతో అక్కడి వారు రూ.20 కోట్ల నిధులతో ఓయూలో భవన నిర్మాణాలు చేపట్టారు. మరిన్ని  నిధుల కోసం ఎండోమెంట్‌ ఫండ్‌ను ఏర్పాటు చేశారు.  

ఉద్యోగులకు పదోన్నతులు    
తన హాయంలో అధ్యాపకులకు కెరీర్‌ అడ్వాన్స్‌ స్కీమ్‌ (సీఏఎస్‌) కింద రెండుసార్లు పదోన్నతులు కల్పించిన్నట్లు వీసీ వివరించారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను, అసోషియేట్‌గా, అసోషియేట్‌ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించిన్నట్లు తెలిపారు. వందలాది మంది బోధనేతర ఉద్యోగులకు కూడా పదోన్నతులిచ్చి వారి మెప్పు పొందారు. 60 మందిని కారుణ్య నియామకాల ద్వారా కొలువులిచ్చినట్టు చెప్పారు.  

వీసీ పదవీ కోసం మళ్లీ దరఖాస్తు  
ఓయూ క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీకి ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ రామచంద్రం వీసీ పదవీ కోసం మరోసారి దరఖాస్తు చేశారు. తొలిసారి తను దరఖాస్తు చేసినప్పుడు తనను ఓయూకు వీసీగా నియస్తారని అనుకోలేదని కానీ తన బయోడాటా చూసిన సీఎం కేసీఆర్‌.. వందేళ్ల వర్సిటీకి వీసీగా నియమించారన్నారు. తన మూడేళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా ముగించుకున్న ఆయన్ను బుధవారం పాలన భవనం ఉద్యోగులు, అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు.  

ఏటా అధ్యాపకులు ఉద్యోగ విరమణ చేయడంతో 1260 శాస్వత అధ్యాపక ఉద్యోగాలకు ఇప్పుడు 465 మంది మాత్రమే ఉన్నారు. నా హయాంలో 415 అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం అనుమతిచ్చి్చంది. వాటి భర్తీకి కొన్ని అడ్డంకులు ఉన్నందున ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఉద్యోగాలను భర్తీ చేయక పోవడం నా పాలనలో వెలితిగాకనిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement