తలమడుగు : గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. జిల్లాలో మొదటిసారిగా మన ఊరు-మన ప్రణాళిక* కార్యక్రమాన్ని శనివారం తలమడుగు మండలంలోని రూయ్యాడి గ్రామంలో ఆయన ప్రారంభించారు.
మంత్రిగా మొదటిసారి గ్రామానికి రావడంతో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక హుస్సేన్ హుస్సేన్ ఆలయంలో పూజలు చేసి అనంతరం అక్కడి నుంచి గ్రామంలోని వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. దారిలో పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల కొరత ఉందని, అదనపు తరగతి గదులు నిర్మించాలని, మరుగుదొడ్లు, తాగునీటి కోసం బోరు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు విన్నవించారు. పాఠశాల భవనం పైనుంచి విద్యుత్ వైర్లు వెళ్తున్నాయని తెలుపగా.. విద్యుత్ శాఖ డీఈ, ఏఈలను సమస్య పరిష్కారాని ఆదేశించాలని కలెక్టర్‌కు సూచించారు.
ఈ సందర్భంగా గ్రామ సమీపంలోని ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ పునర్నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు. గ్రామాల్లో ఏ సమస్యలున్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ, విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అందరూ చదువుకోవాలని కోరారు.
వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనతరం స్థానికంగా మొక్కలు నాటారు. ఎంపీ గెడం నగేశ్, బోథ్, ఖానాపూర్, నిర్మల్ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, రేఖానాయక్, ఐకే రెడ్డి, జెడ్పీ చైర్మన్ శోభారాణి, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ మనీషా, డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఈవో అనితాగ్రేస్, డీఎంహెచ్‌వో బసవేశ్వరి, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ రాము, జెడ్పీటీసీ సభ్యులు గంగమ్మ, పద్మ, ఎంపీడీవో సునిత, గ్రామ ప్రత్యేకాధికారి సంజీవ్‌రెడ్డి, గ్రామపెద్దలు, టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, ఎంపీటీసీలు లక్ష్మి, గంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారమే లక్ష్యం
Published Sun, Jul 13 2014 4:14 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
Advertisement
Advertisement