
టీడీపీది అక్కడో మాట.. ఇక్కడో మాట
తమది జాతీయ పార్టీ అని చెప్పుకునే టీడీపీ.. జీఎస్టీ, నియోజకవర్గాల పునర్విభజన, రాష్ట్రపతి ఎన్నికలు తదితర అంశాలపై ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని..
మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తమది జాతీయ పార్టీ అని చెప్పుకునే టీడీపీ.. జీఎస్టీ, నియోజకవర్గాల పునర్విభజన, రాష్ట్రపతి ఎన్నికలు తదితర అంశాలపై ద్వంద్వ ప్రమాణాలు పాటి స్తోందని.. ఏపీలో ఒక మాట, తెలంగాణలో మరో మాట మాట్లాడుతోందని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయలో ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌రావుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. డీలిమిటేషన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ఏమి కోరారో, సీఎం కేసీఆర్ కూడా అలాగే కోరారని, కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేసీఆర్‌పై బురదచల్లడమే పనిగా పెట్టుకున్న టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు.
ఒకే దేశం, ఒకే పన్ను విధానంలో భాగంగా కేంద్రం తీసుకువచ్చిన జీఎస్టీ అంశంలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉండదని, రాష్ట్రాలు అవునన్నా, కాదన్నా అమలు ఆగదని అన్నారు. జీఎస్టీ వల్ల వచ్చే ప్రయోజనాలను స్వాగతిస్తూనే, ప్రజలపై అధిక భారం పడే అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి వాటిని తగ్గించేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నం చేసిందన్నారు.