
తెలంగాణ వేడుకలకు ముస్తాబైన పరేడ్ మైదానం
సికింద్రాబాద్: ఏటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలకు వేదికైన పరేడ్ మైదానం తాజాగా తెలగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ముస్తాబవుతోంది. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుతోపాటు సచివాలయం, శాసనసభ మొదలు డీజీపీ కార్యాలయాల వరకు ఏ రాష్ర్టం కార్యాలయం ఎక్కడ నిర్వహించాలన్న విషయంలో విభజనలు జరిగిపోయాయి. ఈ క్రమంలోనే త్వరలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు కావడం, హైదరాబాద్ నగరం పదేళ్లపాటు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటున్న నేపథ్యంలో పరేడ్ మైదానం వచ్చే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు నిర్వహించుకునేందుకు ఏ ప్రభుత్వానికి వేదిక కానుందనేది సికింద్రాబాద్ ప్రాంతంలో చర్చలు జరుగుతున్నాయి.
పదకొండు ఎకరాలు....
కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఆధీనంలో ఉన్న సికింద్రాబాద్ పరే డ్ మైదానంలో గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలను రాష్ట్రప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పదకొండు ఎకరాల విశాలమైన స్థలంలో ఆవరించి ఉన్న పరేడ్ మైదానాన్ని సైనిక శిక్షణకు వినియోగిస్తున్నారు.
తొలుత క్రైస్తవ ప్రార్థనలు...
17వ శతాబ్దం నుంచి ఈ మైదానాన్ని క్రైస్తవులు ప్రార్థనలకు వినియోగించుకునేవారు. ఆ కాలంలో దీనిని సెయింట్ జోసెఫ్ క్యాథ్రల్ గ్రౌండ్‌గా పిలిచేవారు. కాలక్రమేణా బ్రిటిష్ పాలకులు, నిజాం పాలకుల హయాంలో ఇక్కడే సైనికులకు శిక్షణ శిబిరాలను నిర్వహించేవారు.
స్వాతంత్య్రానంతరం...
దేశానికి స్వాతంత్య్రం లభించిన తరువాత 1948లో ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ అధికారులు దీనికి పరేడ్ మైదానంగా నామకరణం చేశారు. అప్పటి నుంచే ఇక్కడ గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి.
16 మంది ముఖ్యమంత్రులు
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పడిన తరువాత 1957 ఆగస్టు 15 నుంచి, 2012 ఆగస్టు 15 వరకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 55 మార్లు స్వాతంత్య్ర దినోత్సవాలు జరిగాయి. రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన 17 మంది ముఖ్యమంత్రుల్లో 16 మంది ఇక్కడ జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాలకు హాజరైనారు. తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మొదలు, చివరి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు ఇక్కడ జాతీయ పతాకాన్ని ఎగరేశారు.
నెలరోజులపాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన నాదెండ్ల భాస్కర్‌రావుకు మాత్రం ఇక్కడ జాతీయ పతాకాన్ని ఎగరేసే అవకాశం లభించలేదు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు సైతం హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు హయాంలో సైతం ఇక్కడే రాష్ర్టప్రభుత్వం గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలు జరిగాయి.
21 మంది గవర్నర్‌లు
ఇదే సమయంలో రాష్ట్రానికి 22 మంది గవర్నర్‌లుగా పనిచేశా రు. 1954 జనవరి 26 నుంచి 2013 జనవరి 26 వరకు ఇక్కడ 59 మార్లు గణతంత్ర దినోత్సవాలు జరిగాయి. రాష్ట్ర తొలిగవర్నర్‌గా పనిచేసిన సీఎం.త్రివేది నుంచి ప్రస్తుత గవర్నర్ ఈఎల్‌ఎన్.నరసింహన్ వరకు 22 మంది గవర్నర్‌లలో 21 మంది జాతీయ పతాకాలను ఎగురవేశారు. 1997లో గవర్నర్‌గా కొద్దినెలలు మాత్రమే పనిచేసిన రామానుజానికి పరేడ్ మైదానంలో జాతీయపతాకాన్ని ఎగురవేసే అవకాశం లభించలేదు.
ఘన ఏర్పాట్లు
తెలంగాణ రాష్ర్టం ఏర్పాటవుతున్న తరుణంలో జూన్ 1 నుంచే ఆవిర్భావ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మైదానాన్ని సర్వాంగసుందరంగా అధికారులు తీర్చిదిద్దగా, టీఆర్‌ఎస్ నాయకులు గులాబీ జెండాలతో మైదానం పరిసరాలను నింపేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రికి గౌరవవందనం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.