పరిహారం పరిహాసమేనా..?
కరీంనగర్ అగ్రికల్చర్:
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని మాదిరిగా తయారైంది రైతుల దుస్థితి. పంటలు నష్టపోయి పరిహారం కోసం ఎదురు చూస్తున్న రైతులకు 45 రోజుల కిందట నిధులు విడుదలైనా అవి ఇంకా వారికి చేరలేదు. అనర్హులను ఏరివేసేందుకు అధికారులు విచారణ దశలోనే ఉండడంతో పండుగకు పరిహారం దక్కకుండా పోతుంది. ఇప్పటికే విచారణ పూర్తి చేసి రైతుల ఖాతాల్లోకి పరిహారం జమ చేయాలన్న కలెక్టర్ ఆదేశాలను సైతంఅధికారులు బేఖాతరు చేస్తున్నారు.
2009 మార్చి నుంచి 2014 వరకు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు రూ.105.95 కోట్లు విడుదల చేస్తూ ఆగస్టు 12న రెండు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు జిల్లా ట్రెజరీకి చేరాయి. జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలతో విచారణ ప్రారంభించారు. 1బీ రిజిస్టర్, పహాణీలో ఉన్న రైతుల పేర్లు , జాబితాలోని రైతుల పేర్లను సరిచూసి అర్హుల జాబితాలు తయారు చేయాలని విచారణ మొదలుపెట్టారు. సెప్టెంబర్ 23 వరకు 1 బీ రిజిస్టర్ ఆధారంగా అర్హులను తేల్చి 30లోగా ఇన్‌పుట్ సబ్సిడీని పంపిణీ చేయాలని ఆదేశించారు. విచారణ జరుగుతున్న మండలాల్లో సొంత భూములుండి 1బీ రిజిస్టర్‌లో పేరు లేని రైతులు నుంచి ఆందోళన వ్యక్తమైంది.
అంతా పూర్తయ్యాకే పరిహారం..
2013 అక్టోబరులో కురిసిన అధిక వర్షాలు, 2014లో ఏప్రిల్, మేలో అకాల వర్షాలతో 50 శాతానికి పైగా పంట ఊడ్చుకుపోయింది. రూ.87.09 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేసింది ప్రభుత్వం. అదేవిధంగా 2009 నుంచి 2013 వరకు ప్రకృతి విపత్తులు, వడగళ్లతో నష్టపోయిన 76,365 రైతులకు రూ.18.86 కోట్ల పరిహారాన్ని సైతం విడుదల చేసింది. అయితే వడగళ్లతో నష్టపోయిన రైతులకు మాత్రం పరిహారం వారి ఖాతాల్లో చేరింది. కాగా అధిక వర్షాలతో 86 వేల హెక్టార్లలో నష్టపోయిన 1.80 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.87.09 కోట్ల పరిహారం రైతులకు చేరలేదు. ఇప్పటివరకు కేవలం 28 మండలాల్లోనే విచారణ పూర్తైట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో విచారణ పేరిట జరుగుతున్న జాప్యంతోనే పరిహారం అందడం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. విచారణ పూర్తయిన మండలాలకు సంబంధించి రైతుల ఖాతాలకు పరిహారాన్ని జమచేయడం లేదు. అన్ని మండలాల్లో విచారణ పూర్తయి పూర్తిస్థాయిలో నివేదిక అందిన తర్వాతే రైతుల ఖాతాల వివరాలు, ఇన్‌పుట్ సబ్సిడీ నిధులు బ్యాంకులకు చేర్చనున్నట్లు తెలిసింది. పంట రుణం మాదిరిగా ఇన్‌పుట్ సబ్సిడీపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి పంట నష్టపరిహారం అందించాలని రైతులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.