మండలిలోనూ బలమైన ప్రతిపక్షం ఉండాలి
- బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
- పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాంచందర్‌రావు నామినేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలంటే శాసనమండలిలోనూ బలమైన ప్రతిపక్షం అవసరమని, అందువల్ల మేధావులు, పట్టభద్రులు బీజేపీ, టీడీపీ మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి బీజీపీ అభ్యర్థిగా ఎన్.రాంచందర్‌రావు నామినేషన్ సందర్భంగా సోమవారం బర్కత్‌పురలోని పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే నరేంద్రమోదీకి రాష్ట్ర ప్రజలు అండగా నిలబడాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ-టీడీపీ అభ్యర్థుల గెలుపుతో రాజకీయ సమీకరణాలు మారబోనున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగుల వాణిని మండలిలో వినిపించాలంటే రాంచందర్‌రావు సరైన అభ్యర్థి అని కిషన్‌రెడ్డి తెలిపారు. విద్యావంతులు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
‘నల్లగొండ’ నుంచి నలుగురు నామినేషన్లు
నల్లగొండ: వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం స్థానానికి సోమవారం నలుగురు అభ్యర్థులు నల్లగొండలో నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు నాలుగుసెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న (చింతకుంట నవీన్‌కుమార్) నామినేషన్ వేయగా, ఖమ్మం జిల్లాకు చెందిన నరాల సత్యనారాయణ, మైసా పాపయ్యలు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.