న్యూ ఫిలిం ఇండస్ట్రీ @క్రియేటివిటీ
సినిమా ఇండస్ట్రీ అనగానే ఫిలిం సిటీలు.. స్టూడియోలు.. ల్యాబ్‌లు.. పెద్దపెద్ద సెట్టింగులు.. భారీ బడ్జెట్.. కొంతమంది బడా బాబులదే గుత్తాధిపత్యం.. సామాన్యునికి చోటులేని సినిమా ఇండస్ట్రీ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేవి ఇవే. కానీ సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ మాత్రం సినిమా ఇండస్ట్రీకి సరికొత్త భాష్యం చెప్పారు.
కేవలం రెండు సాధారణ కెమెరాలు.. సెల్‌ఫోన్.. ఒకే ఒక్క కంప్యూటర్‌ను ఉపయోగించి రూ.2.5 లక్షలతోనే సినిమా నిర్మించి తన సత్తా ఏమిటో చూపారు. ఇదే బడ్జెట్‌తో ఇటీవల తాను రూపొందించిన ఐస్‌క్రీం-2 చిత్రాన్ని ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కరీంనగర్‌లో న్యూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ-సాధ్యాసాధ్యాలు’ చర్చాగోష్టిలో సినీ ఔత్సాహికుల ఎదుట 15 నిమిషాల పాటు ప్రదర్శించి బడ్జెట్ కంటే క్రియేటివిటీయే గొప్పదని నిరూపించారు.
టవర్‌సర్కిల్: సినిమా తీయాలంటే ప్రత్యేకమైన ఇండస్ట్రీ ఏమీ లేదని.. మనిషి మేధస్సే న్యూ ఫిలిం ఇండస్ట్రీ రాంగోపాల్‌వర్మ అన్నారు. ‘సాక్షి’ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ శివారులోని చల్మెడ ఆనందరావు వైద్యకళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ‘కరీంనగర్‌లో న్యూ ఫిలిం ఇండస్ట్రీ- సాధ్యాసాధ్యాలు’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు.
ప్రపంచం కుగ్రామంగా మారిందని.. సినిమా అనేది ఒకరి సొత్తు కాదని.. ప్రస్తుతం ఇండస్ట్రీ అనేది ఒక భ్రమ అన్నారు. ఎక్కడైనా సినిమాలు తీయవచ్చని, తాను తీసిన ఐస్‌క్రీమ్-2 సినిమానే నిదర్శనమని నిరూపించారు. తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ క్వాలిటీ ఉన్న సినిమా నిర్మించడం సాధ్యమేనన్నారు. మంచి క్వాలిటీ ఉన్న సినిమాకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందన్నారు. సినిమా చూసే సగటు ప్రేక్షకుడికి సినిమా డెరైక్ట్ చేసేంత అవగాహన వస్తుందని తెలిపారు. తాను కూడా ఆ స్థాయి నుంచే ఎది గానని గుర్తుచేశారు. కరీంనగర్‌లో సినిమా తీసే వారికి తన సహకారం అందిస్తానన్నారు.
కొత్తదనం కోసం వెతకాలి...
హైదరాబాద్‌కు ఫిలిం ఇండస్ట్రీ వచ్చినప్పుడు కేవలం హైదరాబాద్ పరిసరాల్లోనే నిర్మాణం జరిగేదన్నారు. ిసినిమా రంగంలో ఉన్న ఆంధ్రా వాళ్లంతా హైదరాబాద్‌లో ఉండి తమ ప్రాంతంపైనే దృష్టిపెట్టారని, తాను కూడా అదేపని చేశానని అంగీకరించారు. ఈ ప్రాంతం నుంచి ఎదిగిన వారు కూడా కరీంనగర్‌కు కనెక్ట్ కాలేకపోయారని అన్నారు.
ఫిలిం ఇండస్ట్రీగా వెలుగొందుతున్న హైదరాబాద్ నుంచి కొత్తగా సినిమాలు రావడానికి ఏమీ లేదని, కరీంనగర్ నుంచి సినిమా నిర్మిస్తే అంతా కొత్త దనమే అవుతుందన్నారు. కొత్త దనం కోసం వెతుకుతూ ముందుకు వెళ్లాలని, ఆసక్తి ఉన్న వారికి తాను సలహాలు, సూచనలు అందిస్తానని తెలిపారు.
ప్రాంతీయ ప్రేమ ఉండాలి...
నాది.. నా ఊరు అనే ప్రేమ ఉంటే చాలు.. మంచి కథలు, యదార్థ ఘటనలు అన్నీ కథావస్తువులే అవుతాయని వర్మ అన్నారు. మీ ఊల్లోనే సినిమా మొదలు పెట్టాలని, సినిమా తీసిన తర్వాత ఆడకపోతే మళ్లీ మళ్లీ ప్రయత్నించాలని, ఆరోగ్యకరమైన పోటీతత్వంతో ముందుకెళ్లాలని సూచించారు. కరీంనగర్ కేంద్రంగా సినిమాలు తీస్తే అదే ఇండస్ట్రీ అవుతుందని, లోకల్ టాలెంట్స్‌కు అవకాశం దక్కుతుందన్నారు.
సినిమా తీయడమంటే కొంత మందికే సాద్యమన్న విషయాన్ని మరిచిపోవాలన్నారు. యదార్థ ఘటనలను కథలుగా మలిచి పది మంది భాగస్వాములై తక్కువ ఖర్చుతో తెరకెక్కిస్తే.. సంస్కృతీ, సాంప్రదాయాలు, ప్రాంతీయత కళ్ల ముందు కదలాడుతుందన్నారు. హైదరాబాద్ పాతబడిందని, కొత్తదనం ఉంటుందనే ఇక్కడ ఇండస్ట్రీ పెట్టించేందుకు వచ్చానని స్పష్టం చేశారు. ఇండస్ట్రీ నిర్మాణం అనేది ఒకరు చేసేది కాదని, మన కోసం మనమే నెలకొల్పాలని ఉద్ఘాటించారు.
డెరైక్టర్లు.. యాక్టర్లు అంతా మీరే..
కరీంనగర్‌లో ఇండస్ట్రీ నిలబడాలంటే డెరైక్టర్లు, యాక్టర్లు అంతా లోకల్‌వారే ఉండాలని, అప్పుడే ఇండస్ట్రీ నిలబడుతుందన్నారు. సినీ ఇండస్ట్రీ ఫలానా చోటనే ఉండాలనే నిబంధనలేమీ లేవని, టెక్నాలజీ పెరిగాక ఇండస్ట్రీఒక చోటకుపరిమితం కాలేదన్నారు. తీసిన సినిమా ఒకసారి ఆడకపోతే నిరాశచెందకుండా రెండోసారి ప్రయత్నించాలని, అప్పు డే సక్సె స్ అవుతారని అన్నారు. హాజరైన ఔత్సాహికులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వారిలో ఉన్న ఉత్సాహాన్ని గమనించి వారికి ప్రోత్సాహం అందిస్తానని, ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తానని హామీ ఇచ్చారు.