Rangopalvarma
-
కుటుంబం నుండి వర్మ ఎందుకు విడిపోయారు?
వర్మయోగి స్వప్నలోకం ఈ మధ్య రాంగోపాల్‌వర్మ అమ్మగారిని కలిశాను. అసలు ఇంత వైపరీత్యాన్ని ప్రకటించి మరీ చాటుకునే తనయుడి తల్లికి ఆ కొడుకు ఎలా కన్పిస్తాడా అని డౌట్ వచ్చింది. ఆ సందేహానికి సమాధానంగా సూర్యవతిగారి సరళమైన మాటల్లో అంతర్లీనమైన జ్ఞానం వినిపించింది. గీత లోపలి పరిమితులు, పద్ధతులకీ , గీతదాటాక వచ్చే స్వేచ్ఛకీ మధ్య ఉండే పొరలపై బలమైన అవగాహన కనిపించింది. ఆమెతో సంభాషణలోని కొన్ని విషయాలు: రాంగోపాల్‌వర్మ తనెప్పుడూ చెడ్డవాడినని చెప్పుకుంటారు. నిజమా? కొడుకని ప్రేమకాదు, కానీ చెడ్డతనమంటే వాడికి అసలు తెలీదు. ఇది చాలా నిజాయితీగా చెప్తున్న మాట. అయితే ఆర్జీవీ అలా ఎందుకు చెప్పుకుంటారు? ఎందుకంటే, మరొకరు మాటలు అనకుండా తనకు తానే అనేస్కుంటాడు! (నవ్వు) సంజాయిషీ చెప్పే పరిస్థితి రాకుండా ఉండడం కోసం. వర్మ మిమ్మల్ని పట్టించుకుంటారా? కుటుంబం నుండి దూరంగా ఉంటారు కదా! అందరూ నన్ను ఏమడుగు తారంటే ‘‘అయ్యో పాపం రామూ మిమ్మల్ని సరిగ్గా చూస్కోరేమో కదా’’ అని! వాడికెంత ప్రేముందో నాకు తెలుసు. మూడో వ్యక్తికి ఇది అర్థం కాకపోవచ్చు. మరి కుటుంబం నుండి ఎందుకు విడిపోయారు? రాము చేసిన ఒకే ఒక తప్పు తన జీవితంలో పెళ్ళి చేస్కోవడం. తను ఒంటరిగా ఉండాలని ఉంటున్నాడే తప్ప ఆ అమ్మాయిలో తప్పులేదు. పెళ్ళి విషయంలో తొందరపడ్డాడనే సంగతి అందరికీ తెలిసిందే కదా! కానీ... కూతురిని, అమ్మని, తమ్ముడిని అందరినీ అన్నివిధాలా బాగా చూస్కుంటాడు. చిన్నప్పటి నుండి సినిమాలేనా? ఇంక దేనిమీదా ఆసక్తి లేదా? సినిమాలు, పుస్తకాలు, సత్యేంద్ర సావాసం కూడా ఇష్టం. అతను ‘‘నా యిష్టం’’లో రాసినట్టు అందరూ దోమలని చంపితే, రాము దోమలని సున్నితంగా తరిమేవాడు! అటువంటి మనసు రాముది! మరి మీ చేతిలో దెబ్బలు తిన్నారా? చాలాసార్లు. కానీ పన్నెండేళ్లప్పుడు ఓసారి నాతో అన్నాడు... ‘‘నాకు తెలుసు అమ్మా - నీకు వేరే వొత్తిడి ఉండటం వల్ల కోపం వస్తోంది కానీ నా మీద కాదు’’ అని. ఆ వయసులోనే వాడికంత అవగాహన ఉండేది. ఇప్పటి రాంగోపాల్ వర్మపై మీ అభిప్రాయం? హిమాలయాల్లో ఉండవలసిన యోగి మన మధ్య వచ్చి చిక్కుకుపోయాడు అనిపిస్తోంది. తప్పిపోయి వచ్చాడో, ఇష్టంగా వచ్చాడో తెలియదు కానీ, వచ్చాడు. అందరినీ, జీవితాన్నీ బాగా అర్థం చేసుకున్నాడు. విడిపోయిన తరువాత కూడా తన కూతురికి కావలసినవి చూస్కున్నాడు. భార్యని ఎప్పుడూ సూటిపోటి మాటలు అనలేదు. ఇప్పుడేమైనా మీ అబ్బాయి మీతో లేనిలోటు ఫీలౌతారా? తను టైంకి తిని నిద్రపోతే చాలు అనుకుంటాను. ఎందుకంటే తను నాతో ఉండేది కొన్ని నిమిషాలే అయినా మనస్ఫూర్తిగా ఉంటాడు కనుక. తనవల్ల చాలా మందికి మేలు జరుగుతోంది కదా! మీ కొడుకు కోసం అమ్మగా మీ ఆశయం? రాముకి మంచి జరగాలి అనడంకంటే, నిర్మాతలకి మేలు జరగాలని కోరుకుంటాను. మీకిష్టమైన వర్మ సినిమా? 26/11. ఆ సన్నివేశాలు, హోటల్ సీన్, స్టేషన్ చూసి ఎంతబాగా తీశాడో అని మురిసిపోతుంటాను. ఏమో అమ్మని కాబట్టి అంత నచ్చిందా? పోనీ నువ్వు చెప్పు... (చిరునవ్వు) అవును... చాలా అద్భుతమైన స్క్రీన్‌ప్లే!! హిమాలయాల్లో ఉండవలసిన యోగి మన మధ్య వచ్చి చిక్కుకు పోయాడు అనిపిస్తోంది. తప్పిపోయి వచ్చాడో, ఇష్టంగా వచ్చాడో తెలియదు కానీ, వచ్చాడు. అందరినీ, జీవితాన్నీ బాగా అర్థం చేసుకున్నాడు. -
రాంగోపాల్‌వర్మపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
హైదారాబాద్: తెలంగాణ ప్రజలు యాదగిరి నరసింహస్వామినే పూజించాలి, వారికి ఆంధ్రా దేవుళ్లు ఎందుకు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ పై కేసు నమోదు చేయాలంటూ ఎల్బీ నగర్ పోలీసులను సైబరాబాద్ 2వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గురువారం ఆదేశించింది. చింతలకుంటకు చెందిన న్యాయవాది భార్గవ్, పులిగారి గోవర్ధన్‌రెడ్డి గురువారం రాంగోపాల్‌వర్మ పై కోర్టులో ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రజలు తమ సొంత దేవుడైన యాదగిరి నరసింహస్వామి కంటే ఆంధ్రా దేవుడైన తిరుపతి వేంకటేశ్వరస్వామిని పూజించడం సరైనదేనా అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచాడంటూ మేజిస్ట్రేట్‌కు తెలిపారు. వారి ఫిర్యాదును స్వీకరించిన మేజిస్ట్రేట్ యూసుఫ్ 153ఏ, 153బీ, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. కాగా, వర్మ వ్యాఖ్యలపై హిందూ ధర్మరక్షా సమితి నేతలు గురువారం హైదరాబాద్‌లోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
న్యూ ఫిలిం ఇండస్ట్రీ @క్రియేటివిటీ
సినిమా ఇండస్ట్రీ అనగానే ఫిలిం సిటీలు.. స్టూడియోలు.. ల్యాబ్‌లు.. పెద్దపెద్ద సెట్టింగులు.. భారీ బడ్జెట్.. కొంతమంది బడా బాబులదే గుత్తాధిపత్యం.. సామాన్యునికి చోటులేని సినిమా ఇండస్ట్రీ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేవి ఇవే. కానీ సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ మాత్రం సినిమా ఇండస్ట్రీకి సరికొత్త భాష్యం చెప్పారు. కేవలం రెండు సాధారణ కెమెరాలు.. సెల్‌ఫోన్.. ఒకే ఒక్క కంప్యూటర్ను ఉపయోగించి రూ.2.5 లక్షలతోనే సినిమా నిర్మించి తన సత్తా ఏమిటో చూపారు. ఇదే బడ్జెట్‌తో ఇటీవల తాను రూపొందించిన ఐస్‌క్రీం-2 చిత్రాన్ని ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కరీంనగర్లో న్యూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ-సాధ్యాసాధ్యాలు’ చర్చాగోష్టిలో సినీ ఔత్సాహికుల ఎదుట 15 నిమిషాల పాటు ప్రదర్శించి బడ్జెట్ కంటే క్రియేటివిటీయే గొప్పదని నిరూపించారు. టవర్‌సర్కిల్: సినిమా తీయాలంటే ప్రత్యేకమైన ఇండస్ట్రీ ఏమీ లేదని.. మనిషి మేధస్సే న్యూ ఫిలిం ఇండస్ట్రీ రాంగోపాల్‌వర్మ అన్నారు. ‘సాక్షి’ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ శివారులోని చల్మెడ ఆనందరావు వైద్యకళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ‘కరీంనగర్లో న్యూ ఫిలిం ఇండస్ట్రీ- సాధ్యాసాధ్యాలు’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. ప్రపంచం కుగ్రామంగా మారిందని.. సినిమా అనేది ఒకరి సొత్తు కాదని.. ప్రస్తుతం ఇండస్ట్రీ అనేది ఒక భ్రమ అన్నారు. ఎక్కడైనా సినిమాలు తీయవచ్చని, తాను తీసిన ఐస్‌క్రీమ్-2 సినిమానే నిదర్శనమని నిరూపించారు. తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ క్వాలిటీ ఉన్న సినిమా నిర్మించడం సాధ్యమేనన్నారు. మంచి క్వాలిటీ ఉన్న సినిమాకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందన్నారు. సినిమా చూసే సగటు ప్రేక్షకుడికి సినిమా డెరైక్ట్ చేసేంత అవగాహన వస్తుందని తెలిపారు. తాను కూడా ఆ స్థాయి నుంచే ఎది గానని గుర్తుచేశారు. కరీంనగర్లో సినిమా తీసే వారికి తన సహకారం అందిస్తానన్నారు. కొత్తదనం కోసం వెతకాలి... హైదరాబాద్‌కు ఫిలిం ఇండస్ట్రీ వచ్చినప్పుడు కేవలం హైదరాబాద్ పరిసరాల్లోనే నిర్మాణం జరిగేదన్నారు. ిసినిమా రంగంలో ఉన్న ఆంధ్రా వాళ్లంతా హైదరాబాద్‌లో ఉండి తమ ప్రాంతంపైనే దృష్టిపెట్టారని, తాను కూడా అదేపని చేశానని అంగీకరించారు. ఈ ప్రాంతం నుంచి ఎదిగిన వారు కూడా కరీంనగర్‌కు కనెక్ట్ కాలేకపోయారని అన్నారు. ఫిలిం ఇండస్ట్రీగా వెలుగొందుతున్న హైదరాబాద్ నుంచి కొత్తగా సినిమాలు రావడానికి ఏమీ లేదని, కరీంనగర్ నుంచి సినిమా నిర్మిస్తే అంతా కొత్త దనమే అవుతుందన్నారు. కొత్త దనం కోసం వెతుకుతూ ముందుకు వెళ్లాలని, ఆసక్తి ఉన్న వారికి తాను సలహాలు, సూచనలు అందిస్తానని తెలిపారు. ప్రాంతీయ ప్రేమ ఉండాలి... నాది.. నా ఊరు అనే ప్రేమ ఉంటే చాలు.. మంచి కథలు, యదార్థ ఘటనలు అన్నీ కథావస్తువులే అవుతాయని వర్మ అన్నారు. మీ ఊల్లోనే సినిమా మొదలు పెట్టాలని, సినిమా తీసిన తర్వాత ఆడకపోతే మళ్లీ మళ్లీ ప్రయత్నించాలని, ఆరోగ్యకరమైన పోటీతత్వంతో ముందుకెళ్లాలని సూచించారు. కరీంనగర్ కేంద్రంగా సినిమాలు తీస్తే అదే ఇండస్ట్రీ అవుతుందని, లోకల్ టాలెంట్స్‌కు అవకాశం దక్కుతుందన్నారు. సినిమా తీయడమంటే కొంత మందికే సాద్యమన్న విషయాన్ని మరిచిపోవాలన్నారు. యదార్థ ఘటనలను కథలుగా మలిచి పది మంది భాగస్వాములై తక్కువ ఖర్చుతో తెరకెక్కిస్తే.. సంస్కృతీ, సాంప్రదాయాలు, ప్రాంతీయత కళ్ల ముందు కదలాడుతుందన్నారు. హైదరాబాద్ పాతబడిందని, కొత్తదనం ఉంటుందనే ఇక్కడ ఇండస్ట్రీ పెట్టించేందుకు వచ్చానని స్పష్టం చేశారు. ఇండస్ట్రీ నిర్మాణం అనేది ఒకరు చేసేది కాదని, మన కోసం మనమే నెలకొల్పాలని ఉద్ఘాటించారు. డెరైక్టర్లు.. యాక్టర్లు అంతా మీరే.. కరీంనగర్లో ఇండస్ట్రీ నిలబడాలంటే డెరైక్టర్లు, యాక్టర్లు అంతా లోకల్వారే ఉండాలని, అప్పుడే ఇండస్ట్రీ నిలబడుతుందన్నారు. సినీ ఇండస్ట్రీ ఫలానా చోటనే ఉండాలనే నిబంధనలేమీ లేవని, టెక్నాలజీ పెరిగాక ఇండస్ట్రీఒక చోటకుపరిమితం కాలేదన్నారు. తీసిన సినిమా ఒకసారి ఆడకపోతే నిరాశచెందకుండా రెండోసారి ప్రయత్నించాలని, అప్పు డే సక్సె స్ అవుతారని అన్నారు. హాజరైన ఔత్సాహికులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వారిలో ఉన్న ఉత్సాహాన్ని గమనించి వారికి ప్రోత్సాహం అందిస్తానని, ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తానని హామీ ఇచ్చారు. -
ఫిల్మ్ ఇండస్ట్రీ @ కరీంనగర్
శాతవాహన యూనివర్సిటీ: ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ కరీంనగర్లో సినీ పరిశ్రమను ఏర్పాటుపై దృష్టి సారించారు. సాంకేతిక రంగంలో శరవేగంగా దూసుకుపోతున్న నేటికాలంలో ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్‌గా మారిన తరుణంలో ఎక్కడైనా సినిమాలను నిర్మించి, విడుదల చేయవచ్చంటున్నారు. అందులో భాగంగా కరీంనగర్లో ‘న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ’ని ఏర్పాటు చేయాలని వర్మ భావిస్తున్నారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఎస్సారార్ కళాశాల వేదికగా ‘కరీంనగర్లో ఫిలిం ఇండస్ట్రీ-సాధ్యాసాధ్యాలు’ అనే అంశంపై ఈ నెల 18న ఉదయం 11 గంటలకు చర్చాగోష్టి నిర్వహించనున్నారు. సినిమా రంగంలో రాణించాలనే ఆసక్తి గలవారు ఈ సందర్భంగా రాంగోపాల్‌వర్మను కలిసే అవకాశాన్ని పొందవచ్చు. సినీ రంగంపై ఆసక్తి, అనుభవం, సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు, గతంలో షార్ట్‌ఫిల్మ్ చేసినవారు, సినిమా గేయాలు, రచనలు చేసినవారు, ఆసక్తి ఉండి అవకాశం కోసం ఎదురుచూసే ఔత్సాహికులెవరైనా తమ బయోడేటాను ‘సాక్షి’ జిల్లా కార్యాలయానికి పంపవచ్చు. పూర్తి వివరాలకు 92480 20207, 90100 31916, 85238 61961 నంబర్లలో సంప్రదించవచ్చు. -
రాంగోపాల్ వర్మకు తాత్కాలిక ఊరట
హైదరాబాద్: వినాయకునిపై అనుచిత వ్యాఖ్యలు చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై నమోదైన కేసులో తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయవాది కరుణాసాగర్ ఫిర్యాదు మేరకు సరూర్‌నగర్ పోలీసులు రాంగోపాల్ వర్మపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వర్మ హైకోర్టును ఆశ్రయించారు. వినాయకునిపై తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమైనవి కావని, వాటికి ఇప్పటికే క్షమాపణలు చెప్పానని ఆయన కోర్టుకు వివరించారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఈ కేసులో తదుపరి చర్యలన్నింటినీ రెండువారాలపాటు నిలిపివేయాలని ఉత్తర్వులు ఇచ్చారు.