పింఛన్ కావాలని గగ్గోలుపెడుతున్న బాధితులు ఓవైపు ఉంటే...పెన్షన్లు మంజూరై కూడా లబ్ధిదారులు కనిపించని పరిస్థితి మరోవైపు నెలకొంది. జిల్లావ్యాప్తంగా 6,200 మంది పెన్షనర్లు గల్లంతయ్యారు.
నీలగిరి : పింఛన్ కావాలని గగ్గోలుపెడుతున్న బాధితులు ఓవైపు ఉంటే...పెన్షన్లు మంజూరై కూడా లబ్ధిదారులు కనిపించని పరిస్థితి మరోవైపు నెలకొంది. జిల్లావ్యాప్తంగా 6,200 మంది పెన్షనర్లు గల్లంతయ్యారు. 2012లో రచ్చబండ-2 కార్యక్రమంలో పెన్షన్ల కోసం 70వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. 2013 అక్టోబర్‌లో నిర్వహించిన రచ్చబండ-3 కార్యక్రమంలో 55 వేల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరయ్యాయి. వీరిలో 6,200మంది పెన్షన్‌దారులు గ్రామాల్లో కనిపించడం లేదు. మంజూరైన మొదటి మూడు నెలలపాటు లబ్ధిదారుల ఖాతాలకు పెన్షన్ చెల్లించారు. కానీ గ్రామస్థాయిలో సదరు పెన్షన్‌దారులు లేకపోవడం, అడ్రస్‌లు మారడం వంటివి జరిగాయి. దీంతో గల్లంతైన లబ్ధిదారుల కోసం పంచాయతీ కార్యదర్శులు, పోస్టాఫీసు సిబ్బంది గ్రామాల్లో విచారణ చేసినప్పటికీ వారి జాడ కనిపించలేదు. అప్పటినుంచి వారి ఖాతాలకు పెన్షన్ పంపడం బంద్‌చేశారు. కానీ పెన్షన్‌దారుల జాబితా నుంచి వారి పేర్లను ఇంకా తొలగించలేదు. ఇప్పటికైనా సదరు లబ్ధిదారులు అందుబాటులో ఉన్న పంచాయతీ కార్యదర్శులను లేదా పోస్టాఫీసు సిబ్బందిని సంప్రదించాలని డీఆర్‌డీఏ పీడీ చిర్రా సుధాకర్ తెలిపారు.
కొత్తమార్గదర్శకాలు జారీ
డీఆర్‌డీఏ, ఐకేపీ ద్వారా పంపిణీ చేస్తున్న సామాజిక భద్రత పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నెల నుంచి వాటిని అమలుచేయాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. వేలిముద్రలు నమోదు కాని వారి కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి పెన్షన్లు పంపిణీ చేయాలని పేర్కొంది.
వేలిముద్రలు నమోదు కాకుంటే..
80 ఏళ్లు ఆపైబడిన వృద్ధుల విషయంలో వేలిముద్రలు సరిగా నమోదుకాకపోవడంతో బయెమెట్రిక్ మిషన్లు వీరిని లబ్ధిదారులకు గుర్తించడం లేదు. దీంతో సీఎస్‌పీలు, పోస్టోఫీసుల్లో వందల సంఖ్యలో వృద్ధాప్య పెన్షన్లు నిలిచిపోయాయి. ఈ విషయంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా అధికారులకు వాస్తవాలు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. కాగా ప్రస్తుతం జారీచేసిన కొత్త నిబంధనల్లో వీరికి పాత బకాయిలు మొత్తం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
మార్గదర్శకాలు ఇవీ...
ప్రతి నెలా 1వ తేదీన ప్రారంభించి 8వ తేదీ వరకు పెన్షన్లు పంపిణీ పూర్తి చేయాలి. వీటి వివరాలు 15వ తేదీలోగా ఎంపీడీఓలు, కమిషనర్ల ద్వారా అధికారులకు చేరాలి. బ్యాంకులు, పోస్టోఫీసులు ద్వారా పెన్షన్ తీసుకోని వారి వివరాలు 10వ తేదీన అధికారులకు తెలియజేయాలి. ఇదే క్రమంలో ఇప్పటివరకు వేలిముద్రలు సేకరించని లబ్ధిదారులు వేలిముద్రల నమోదు పరికరాలు సమకూర్చుకుని వార్డులు, డివిజన్‌ల వారీగా తేదీలు ఖరారు చేయాలి. సేకరించిన వేలిముద్రలను ఎంపీడీఓ కార్యాలయాల్లోని మండల కోఆర్డినేటర్లకు అందజేయాలి.
గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు..
వేలిముద్రలు సరిగా నమోదుకానీ వారు, శాశ్వతంగా మంచానికే పరిమితమైన వారికి ఇకపై ప్రత్యేక దూత ద్వారా ఇంటి వద్దనే ప్రతి నెలా 10 తేదీన పెన్షన్ ఇస్తారు. ఇందుకోసం గ్రామస్థాయిలో ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఇద్దరు వీఓలు, కౌన్సిలర్ సభ్యులుగా ఉంటారు. కమిటీలోని ఇద్దరు సభ్యులు ధ్రువీకరిస్తే పెన్షన్ ఇస్తారు.