మధ్యాహ్నం 2 తర్వాత నిర్మానుష్యంగా ఉన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పట్టణం
సాక్షి, హైదరాబాద్: పల్లెలు, పట్టణాలను కరోనా వణికిస్తోంది. అడుగు బయటపెడితే ఎక్కడ వైరస్ సోకుతుందోననే భయం వెంటాడుతోంది. విజృంభిస్తోన్న ఈ మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు స్వీయ నియంత్రణే శరణ్యమని ప్రజానీకం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మొన్న భిక్కనూరు.. నిన్న గంభీరావుపేట.. నేడు ఇబ్రహీంపట్నం.. ఇలా ఆయా ప్రాంతాల ప్రజలు స్వీయ నిర్బంధాన్ని విధించుకుంటున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపార కార్యకలాపాలను అనుమతిస్తూ..సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తున్నారు.
ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా..
మొదట్లో పకడ్బందీగా లాక్‌డౌన్ అమలుచేయడంతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఎప్పుడైతే ఆంక్షలు సడలించారో హైదరాబాద్‌కే పరిమితమైన పాజిటివ్ కేసులు కాస్తా గ్రామాలకూ పాకాయి. ఈ క్రమంలోనే వైరస్ వ్యాపించకుండా స్వీయ కట్టడే మేలని భావిస్తున్న జనం నిర్ణీత వేళల్లో వ్యాపార కార్యకలాపాలను అనుమతిస్తూ.. మిగతా సమయంలో బంద్‌ను పాటిస్తున్నారు. కరోనా కలకలం మొదలైన మార్చిలో గ్రామాల పొలిమేరల్లో రాకపోకలు నిలిపివేసిన తరహాలోనే ఇప్పుడూ ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్ బేగంబజార్‌లోనూ వ్యాపారులు మధ్యాహ్నం 3 గంటల వరకే దుకాణాలను తెరిచి స్వీయ లాక్‌డౌన్ పాటిస్తున్నారు.
ఇలా మొన్నటి వరకు ఆమనగల్లు, తాజాగా మాచారెడ్డి, కామారెడ్డి, మెదక్ సహా పలుచోట్ల సగం పూట వరకే కార్యకలాపాలు సాగిస్తూ.. మిగతా వేళల్లో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. ఈ మేరకు గ్రామ పంచాయతీలు తీర్మానాలుచేసి ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝళిపిస్తున్నాయి. అలాగే, గ్రామాల్లో మాస్కులు ధరించనివారికి కూడా జరిమానాలు విధిస్తూ లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ప్రజలే స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ను పాటిస్తుండటంతో పోలీసులు కూడా తమవంతు సహకారం అందిస్తున్నారు. ఇప్పటివరకు కంటైన్మెంట్ జోన్లకే పరిమితమైన ఆంక్షలను తమ గ్రామాలు/పట్టణాల్లోనూ అమలుచేస్తూ కరోనా మహమ్మారి తమ వాకిట వాలకుండా జాగ్రత్త పడుతున్నారు.
స్వీయ రక్షణే మేలు
కరోనా కట్టడికి స్వీయరక్షణే మంచి మార్గం. మా గ్రామంలో 13వ తేదీ నుంచి లాక్‌డౌన్ అమలు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల వరకే బయట తిరగడానికి అనుమతిస్తున్నాం. ఆ తర్వాత ఎవరైనా కనిపిస్తే జరిమానా విధిస్తున్నాం. అత్యవసర పనులపై వెళ్లే వారికి అవకాశం ఇస్తున్నాం. – తునికి వేణు, సర్పంచ్, భిక్కనూరు, కామారెడ్డి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment