విన్నవించేందుకు వచ్చిన వెంగళరావుకాలనీ వాసులు
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఆ సారు రాకపోతే మా పిల్లలు బడికి వెళ్లమంటున్నారు.. ఇంటింటికీ వచ్చి మా పిల్లలను బడికి తీసుకువెళ్లి చదువుపై శ్రద్ధ కలిగే విధంగా కృషి చేశారు.. తీరా మాకు ఇష్టం కలిగి బుద్ధిగా పాఠశాలకు వెళ్తుంటే ఆ సారును బదిలీ చేశారు. ఇప్పుడు మా పిల్లలు బడికి వెళ్లాలంటే ఇష్టపడడం లేదు. అందుకే మాకు ఆ సారు కావాలని ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి వచ్చామంటూ పాల్వంచ మున్సిపాలిటీ వెంగళరావు కాలనీవాసులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ‘సాక్షి’తో మాట్లాడారు. వెంగళరావుకాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్ నారాయణ నేతృత్వంలో గ్రామస్తులు ప్రజావాణిలో ఈ మేరకు దరఖాస్తు ఇచ్చిన తరువాత మాట్లాడారు.
పాఠశాలకు ఎస్జీటీగా వచ్చిన ఎస్.రాజశేఖర్ పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లిష్ సొంతంగా చెప్పించేవారని, పాఠశాలకు ఎల్‌ఈడీ టీవీని కూడా తీసుకువచ్చి పాఠాలు బోధించేవారని చెప్పారు. ఎవరైనా బడికి రాకపోతే ఇంటికి వచ్చిమరీ తీసుకువెళ్లేవారని వివరించారు. అలాంటి వారిని బదిలీ చేశారని, ఈ విషయంపై ఇప్పటికే ఎంఈఓకు, డీఈఓకు పలుమారు విన్నవించినా స్పందన కరువైందన్నారు. కార్యక్రమంలో బానోత్ శరత్, బోడా నాగరాజు, సపావత్ సక్రి, భూక్యా శారద, సీతమ్మ, రమణ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment