పానీ చేనికన్‌.. ఛ్వారిన్‌ దేరేకొనీ..! | People facing huge water problems in the Rajunayak thanda | Sakshi
Sakshi News home page

పానీ చేనికన్‌.. ఛ్వారిన్‌ దేరేకొనీ..!

Published Sat, Apr 8 2017 2:57 AM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM

పానీ చేనికన్‌.. ఛ్వారిన్‌ దేరేకొనీ..!

పానీ చేనికన్‌.. ఛ్వారిన్‌ దేరేకొనీ..!

నీళ్లు లేవని తండాకు పిల్లను ఇవ్వడంలేదట
- సంవత్సరంలో రెండు నెలలే తండాకు నీరు
- మిగతా రోజుల్లో 3 కిలోమీటర్ల నుంచి మోత
- వారానికోమారే తండావాసులు స్నానం
- తండాకు రావాలంటే భయపడుతున్న పిల్లలు
- రాజునాయక్‌ తండా క‘న్నీటి’గాథ


‘ఈ ఫొటోలో వాళ్ల అమ్మకు నీళ్లు ఇస్తున్న యువకుడు మాలోత్‌ దేవేందర్‌. ఎం.ఫార్మసీ చదివాడు. మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తి నుంచి తమ కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయడానికి బంధువులు వచ్చారు. అబ్బాయి బాగున్నాడు. మంచి చదువు చదివాడని కట్న కానుకలు కూడా మాట్లాడుకున్నారు. పూలు పండ్లు పెట్టుకున్నారు. తీరా లగ్గం పెట్టుకునేందుకు తండాకు రాగా.. తండావాసుల నీటి కష్టాల గురించి విన్న పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు తమ బిడ్డను ఈ తండాలో ఉంటేæ ఇవ్వం.. మీ తండాలో నీళ్లు లేవు. నా బిడ్డ మూడు కిలోమీటర్ల నుంచి నీళ్లు తేవాలా..? నీళ్లు వచ్చినప్పుడే లగ్గం పెట్టుకుంటాం.. అని వెనుదిరిగి వెళ్లారు. ’

సాక్షి, సూర్యాపేట: పానీ చేనికన్‌.. ఛ్వారిన్‌ దేరేకొనీ..! అంటే లంబాడి భాషలో నీళ్లు లేవని తండాకు పిల్లను ఇవ్వడంలేదని అర్థం. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం జమాల్‌పురం ఆవాసంలోని రాజునాయక్‌తండా వాసుల పరిస్థితి మారలేదు. ప్రతీ ఎన్నికలప్పుడు నాయకులు వస్తూనే ఉంటారు. నీటి కష్టాలు తీరుస్తామని, రోడ్లు వేస్తామని చెబుతారే తప్ప.. తమ కష్టాలు తీర్చే నాథుడే లేరని తండావాసులు వాపోతున్నారు. తమ తండా గురించి తెలిసిన వారు తండాకు పిల్లను ఇవ్వడంలేదని, నీళ్లు లేక ఎండా కాలంలో తండా నుంచి కొన్ని కుటుంబాలు బయటకు వెళ్లి వర్షాలు పడిన తర్వాత వస్తారని గిరిజనులు చెబుతున్నారు. అందరికీ అన్ని వసతులు కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం, నాయకులు తమ నీటి కష్టాలను ఎందుకు తీర్చడంలేదని ప్రశ్నిస్తున్నారు.

కిలోమీటర్ల దూరం వరకు నీరు లేదు..
తిరుమలగిరి మండల కేంద్రానికి 18 కిలో మీటర్ల దూరంలోని రాజునాయక్‌తండాలో భూగర్భ జలాలు అడుగంటాయి. గత పదేళ్ల క్రితం వరకు ఊరి బయట ఉన్న గుట్ట వద్ద చెలిమలు తీసుకుని ఆ నీటిని తెచ్చుకునేవారు. తండాలో వేసిన బోర్లు, ట్యాంకులకు చిన్న దారగా నీరు వచ్చేది. కానీ ఇప్పుడు తండాలో బోరు వేయని ఇల్లు లేదు. అదీ కూడా 200 అడుగులకు పైగా బోర్లు వేసినా.. చుక్కనీరు రాని దుస్థితి నెలకొంది.

భయపడుతున్న పిల్లలు..
120 కుటుంబాలు, 400 మంది జనాభా ఉన్న రాజునాయక్‌తండా నుంచి విద్యార్థులు జిల్లాలోని తిరుమలగిరి, సూర్యాపేట, హైదరాబాద్, తుంగతుర్తి ప్రాంతాల్లో సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్నారు. ఎవరైనా సెలవులు రాగానే ఇంటికి వెళ్లాలని భావిస్తారు. కానీ ఈ తండా పిల్లలు మాత్రం తమ ఇంటికి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం వెళ్లి రావాలి. మగవారైతే వారానికోమారు స్నానం చేయాల్సిన పరిస్థితి. బట్టలు ఉతకాలన్నా, స్నానాలు చేయాలన్నా దూరంగా ఉన్న వ్యవసాయ బావులే దిక్కు. అదేవిధంగా ఇప్పటికే నీటికష్టాలు పడలేక తండా నుంచి పలు కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయా యి. తండాకు వస్తే నీళ్లు దొరకవని, బంధువు లు, కుటుంబ సభ్యులు కూడా రావడంలేదని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నీటి సమస్య తీరేదెట్టా..
సంవత్సరాల తరబడి నీటి గోస పడుతున్న తండావాసుల నీటి కష్టాలు తీరేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టా ల్సిన అవసరం ఉంది. తండాకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంపటి, బండరామారంలో భూగర్భజలాలు సమృద్ధిగా ఉన్నాయి. అక్కడ బోర్లు వేసి పైపులైన్ల ద్వారా తండాకు నీటిని సరఫరా చేయవచ్చని తండావాసులు అంటున్నారు. సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం తమ తం డాకు నీటి కష్టాలు తీర్చేందుకు నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.

నీటి కోసం తిప్పలు పడుతున్నాం...
తండాలో ప్రతీ ఇంటిలో బోర్లు వేశాం. 200 ఫీట్లు వేసినా చుక్క నీరు లేదు. అంతా బండ. తండా అడుగున గుట్టలు ఉన్నాయి అంటున్నారు. దీంతో నీటి కోసం నానా తిప్పలు పడాల్సి వస్తుంది. ఇల్లు కట్టాలన్నా.. నీటి ఇబ్బందే. తాగేందుకే నీరు లేదు. ఇక స్నానం, బట్టలు పిండడం అంతా కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావులు వద్దనే.     
    – మాలోత్‌ నీలమ్మ, గృహిణి

నా కొడుకు పెళ్లి జరగలేదు...
నా కొడుకు పెద్ద చదువు చదివిండు. పెళ్లి కుదిరింది. లగ్గం పెట్టుకోవాలంటే తండాలో నీళ్లు లేవు. నీళ్లు లేకుండా ఎలా పెళ్లి చేస్తారు.. అంటున్నారు అమ్మాయి ఇంటి వాళ్లు. బండరామారాం, వెంపటిలో బోర్లు వేసి మా తండాకు నీల్లు వచ్చేలా చేయండి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చేన్లు, చెలకల వద్ద నుంచి నీరు తేవాల్సి వస్తుంది.     
– మాలోత్‌ బుజ్జి

రోజురోజుకూ లోతుకెళ్తున్న నీళ్లు
తండాలో ఎప్పుడూ నీటి తిప్పలే. పది, పదిహేను సంవత్సరాల క్రితం తండాకు పక్కనే ఉన్న గుట్ట వద్ద చెలిమలు తీస్తే నీరు వచ్చేవి. ఇప్పుడు చెలిమలు ఎండిపోయాయి. నీరు రావడంలేదు. ఎన్ని బోర్లు వేసినా నీటి చుక్క అన్న మాటేలేదు. వర్షాకాలం రెండు నెలలు. అదీ కూడా వర్షాలు పడితే పొలాలు, నీటి గుంటల్లో, చెలిమల్లో నీరు ఉంటుంది. లేకపోతే లేదు. నీరు లేక మనవడు, మనవరాళ్లు తండాకు రావాలంటేనే భయపడుతుంటారు.     
– మాలోతు కృష్ణ, వృద్ధుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement