చేవెళ్ల: విద్యుత్ కోతలతో జనం అల్లాడిపోతున్నారు. బయటకెళ్తే ఎండ, ఇంట్లో ఉంటే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని చేవెళ్ల, షాబాద్, శంకర్‌పల్లి, మొయినాబాద్, నవాబుపేట మండలాల్లో 49 వేలకుపైగా గృహ, 8 వేల వరకు వాణిజ్య విద్యుత్ కనెక్షన్లున్నాయి.
గ్రామాలతోపాటు మండల కేంద్రాల్లోనూ గంటల తరబడి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. సరఫరా ఎప్పుడు పునరుద్ధరిస్తారన్న సమాచారాన్ని సంబంధిత సిబ్బంది చెప్పలేకపోతున్నారు. ఉదయం 6 గంటలకే కోతలు మొదలవడంతో ఇళ్లల్లో పనులు చేసుకోలేకపోతున్నామని మహిళలు వాపోతున్నారు. వర్షాలు మళ్లీ ముఖం చాటేయడంతో ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటున్నది. సుమారుగా 35 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడంతో ఉక్కపోత కూడా అధికంగానే ఉంది. మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్లలేని పరిస్థితి. మండల కేంద్రాల్లో సైతం ఉదయం 6 నుంచి 10 గంటలవరకు, మధ్యాహ్నం 2 నుంచి 6 గంటలవరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు.
కార్మికుల ఉపాధికి గండం..
ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కావడంతో పరికరాలు వెల్డింగ్ దుకాణాదారులకు, మోటార్లు మరమ్మతులు చేసే వైండింగ్‌దారులకు చేతినిండా పని ఉంటుంది. ఆర్డర్లున్నా కరెంట్ సక్రమంగా లేకపోవడంతో పని పూర్తి చేయలేకపోతున్నామని వెల్డింగ్ పనివాళ్లు వాపోతున్నారు. పగటి సమయంలో గంటల తరబడి కోతలు విధించడం వల్ల ఫొటో స్టూడియోలు, జీరాక్స్ దుకాణాలు నడిపించే వారు వృథాగా ఉండాల్సి వస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్లు పనిచేయకపోవడంతో పనులు స్తంభించిపోతున్నాయి.
అన్నదాతల ఆందోళన
ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు సకాలంలో కురవకపోవడం, ఇటీవల కురిసిన వర్షాలతో అన్నదాతలు ఆశలుపెట్టుకున్నా మళ్లీ వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది. ప్రస్తుతం చేవెళ్ల వ్యవసాయ డివిజన్ పరిధిలోని చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, నవాబుపేట మండలాలలో వేసుకున్న పత్తి, మొక్కజొన్న, వరి, కూరగాయపంటలు ఎండుముఖం పడుతున్నాయి.
బోరుబావుల కింద కూరగాయలు, వరి సాగు చేసే రైతులు కరెంట్ సరఫరా తీరును చూసి సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకున్నారు. కూరగాయల పంటలను కాపాడుకోవడానికి ప్రతి రోజూ నీళ్లు పెట్టాల్సి వస్తోందని, అయితే విద్యుత్ కోతలతో సాధ్యం కావడంలేదని ఆవేదన చెందుతున్నారు. అధికారులు సరఫరాను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
విద్యుత్ కోతలు
Published Thu, Oct 2 2014 12:06 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement