
రోడ్డుపై లీకేజీ అవుతున్న నీరు (ఫైల్)
నగరవాసులను తాగునీటి పైపులైన్ లీకేజీలు భయపెడుతున్నాయి. నీరు కలుషితమవుతుందనే భయాందోళనలో నగరవాసులు ఉన్నారు. నిత్యం ఏదో ఒక చోట లీకేజీ అవుతున్నా.. కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. లీకేజీ మరమ్మతుల కోసమే ప్రత్యేకంగా కార్మికులున్నా ఫలితం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థ నీటి సరఫరా విభాగం నిద్దరోతోంది. పైపులైన్లకు అడ్డగోలుగా లీకేజీలు ఏర్పడుతున్నా పట్టించుకోవడం లేదు. తాగునీటి పైపులైన్‌లు, సరఫరాలో ఉన్న లోపాలతో తరచూ రోడ్లపై పైపులైన్లు లీకవుతున్నాయి. నగర పరిధిలోని 50 డివిజన్‌లలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట పైపులైన్ లీకేజీలు ఏర్పడుతూనే ఉన్నాయి. లీకేజీలతో వృథాగా ప్రవహిస్తున్న నీటితో రోడ్లు పాడవుతున్నాయి. లీకేజీలతో సరఫరాలో నీరు రంగుమారుతుందని నగరవాసులు పేర్కొంటున్నారు. రూ.లక్షలు ఖర్చు చేసి నీటిని ఫిల్టర్ చేస్తుండగా.. పైపులు పగిలి లక్షల లీటర్ల నీరు డ్రెయినేజీల్లో చేరుతోంది. క్షేత్రస్థాయి సమస్యలను పట్టించుకోకపోగా లీకేజీలను మరమ్మతు చేయడం లేదు. దీంతో శుద్ధిచేసిన నీరు కలుషితమతుంది. అదే నీరు నల్లాల ద్వారా నగరంలో సరఫరా అవుతుంది. లీకేజీల కారణంగా తాగునీరు కలుషితమవుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా రోడ్లపై జరుగుతున్న లీకేజీలతో బీటీ రోడ్లు గుంతలుపడి శిథిలమవుతున్నాయి. లక్షలు పెట్టి వేస్తున్న రోడ్లన్నీ కంకరతేలి ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
లీకేజీలపై పట్టింపు కరువు
నగరంలోని అన్ని డివిజన్లతోపాటు ప్రధాన రహదారులపై అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. పనులు జరుగుతున్న సమయంలోనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పైపులు పగులుతున్నాయి. అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రాంతాల్లో పైపులు పగలకుండా కార్పొరేషన్ నీటి విభాగం సిబ్బంది పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఓ వైపు పనులు జరుగుతుండగా మరో వైపు పైపులు పగిలినా పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తేనే నీటి వృథా అరికట్టడం సాధ్యమవుతుంది. అయితే నిర్లక్ష్యంతో చిన్నపాటి లీకేజీలే పెద్దగా మారుతున్నాయి. 120 మంది కార్మికులు ఉన్నప్పటికీ ఎక్కడ, ఏం పనులు చేస్తున్నారనే విషయం ఎవరికీ తెలియడం లేదు. అయితే ఈ కార్మికులను ఇతర పనుల్లోకి వినియోగించుకుంటూ లీకేజీలను విస్మరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి లీకేజీలను అరికట్టి తాగునీరు కలుషితం, రంగు మారకుండా చూడాల్సిన బాధ్యత ఉంది.
Comments
Please login to add a commentAdd a comment