భైంసా, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పెంపుపై టీఆర్‌ఎస్ కసరత్తు మొదలు పెట్టిన తరుణంలో నిర్మల్ జిల్లా ఏర్పాటుపై ఇక్కడి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాను ఇప్పటికే తూర్పు, పశ్చిమ జిల్లాలుగా పిలుస్తారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం తెలంగాణలో ఇప్పుడున్న పది జిల్లాలను 24 జిల్లాలుగా మారుస్తామని ఇప్పటికే టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో పలుమార్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా జిల్లాల సగటు జనాభా ఆధారంగా జిల్లాలను అదనంగా పెంచేందుకు కసరత్తు ఆరంభించారు. కాగా, ప్రస్తుతం బాసర నుంచి ఆదిలాబాద్ 147 కిలో మీటర్ల దూరం ఉంది. కొత్తగా ఏర్పడే జిల్లాలోనూ ఈ దూరం తగ్గదు. జిల్లా కేంద్రం దగ్గరగా ఉంటే పాలనపరమైన ఇబ్బందులు తీరుతాయి. కొత్తగా జిల్లాల పునర్వ్యస్థీకరణలో అన్ని నియోజకవర్గ కేంద్రాలకు మధ్యలో ఉండే విధంగా రూపొందించారు. ఇలాంటి పట్టణాలను జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలో వారి ఇబ్బందులు తీరుతాయి.
దూరభారం తగ్గుతుంది..
ముథోల్ తాలుకా ఒకప్పుడు మహారాష్ట్ర ప్రాంతంలోని నాందేడ్ జిల్లాలో ఉండేది. 1956లో జరిగిన రాష్ట్రాల పునర్ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్ జిల్లాలో కలిపారు. భైంసా ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ 80 కిలో మీటర్ల దూరంలో ఉంది. నాందేడ్ వెళ్లేందుకు భైంసా నుంచి బస్సు సౌకర్యంతోపాటు బాసర నుంచి రైలు మార్గం ఉంది. అదే జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే నిర్మల్ నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లాలి. గతంలో ఉన్న జిల్లా కేంద్రం 80 కిలో మీటర్ల దూరంలో ఉంటే ఇప్పుడు 147 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్‌కు చాలా మంది వెళ్లలేకపోతున్నారు. నిర్మల్ జిల్లాగా ఏర్పడితే భైంసా ప్రాంతం నుంచి 41 కిలో మీటర్ల దూరమే ఉంటుంది. ఇప్పటికే రాజకీయంగా నిర్మల్‌కు ప్రత్యేక పేరు ఉంది. కొయ్యబొమ్మలతో నిర్మల్ ఖ్యాతి అన్ని ప్రాంతాలకు వ్యాపించింది.
బాల్కొండను కలిపితే..
పాలనపరమైన సౌలభ్యం కోసం ముథోల్, నిర్మల్, ఖానాపూర్ ప్రాం తాలతోపాటు నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండను కలిపి నిర్మల్ జిల్లాగా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. తెలంగాణలో నియోజకవర్గాల పునర్వీభజనలోనూ కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు అవుతాయి. ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండు జిల్లాల పరిధిలో ఉంది. బాల్కొండ ప్రాంతం ఇక్కడ కలిపితే ఎస్సారెస్పీ నిర్మల్ జిల్లా పరిధిలోకి వస్తుంది.
తెలంగాణ పునర్నిర్మాణంలో ఏర్పడే కొత్త జిల్లాలోనూ బాబ్లీ ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించేందుకు కొత ్తగా ఏర్పడే నిర్మల్ జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారన్న ఆశను ఈ ప్రాంత రైతులు వ్యక్తం చేస్తున్నారు. బాసరలోని చదువులమ్మ కొలువు సరస్వతీ ఆలయం, తెలంగాణలో ఏకైక ట్రిపుల్‌ఐటీ, భైంసా పత్తి రైతాంగం ముథోల్, నిర్మల్ ప్రాంతంలోని లక్షలాది బీడీ కార్మికుల శ్రేయస్సు కోసమైనా జిల్లా కేంద్రం దగ్గరగా ఉండి తీరాలని మేధావులు, విద్యావేత్తలు భావిస్తున్నారు. కొత్త జిల్లాల విషయం తెరపైకి రావడం తో నిర్మల్ జిల్లా ఏర్పాటుపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది.