కొత్తగూడెంలోని రవాణా శాఖ కార్యాలయం
మణుగూరు : అతి పెద్ద వైశాల్యం గల భద్రాద్రి జిల్లాలో నూతన వాహనాల కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ కోసం పాట్లు పడాల్సి వస్తోంది. జిల్లాలో ప్రస్తుతం కొత్తగూడెం, భద్రాచలంలో మాత్రమే ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లు, నంబర్ ప్లేట్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల కోసం ఈ కార్యాలయాల్లో ఏదో ఒక చోటకు వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలోని 23 మండలాల్లో నెలకు సుమారు 2 వేల వాహనాల రిజిస్ట్రేషన్‌లు జరుగుతుంటాయి. దీంతో పనుల్లో జాప్యంతో పడిగాపులు పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. రిజిస్ట్రేషన్లతో పాటు డ్రైవింగ్ లైసెన్సులు తీసుకునేవారు, గతంలో తీసుకున్నవి రెన్యూవల్ చేయించుకునే వారు.. ఇలా నిత్యం ఎంతోమంది వస్తుంటారు. వీటి ద్వారా ప్రభుత్వానికి నెలకు రూ.30 లక్షల మేర ఆదాయం కూడా సమకూరుతోంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు, టాటా ఏస్‌లు, లారీలు, జీపులు, గూడ్స్ వాహనాలు, నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు 9 నుంచి 14 శాతం మేర పన్ను వసూలు చేస్తారు.
ప్రయాణం.. ఆపై పడిగాపులు...
జిల్లాలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు, కార్లు, లారీలతో పాటు నాన్‌ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు, మిషన్‌లు భారీస్థాయిలో కొనుగోళ్లు జరుగుతుంటాయి. నూతన వాహనం కొనుగోలు చేయడం ఒక ఎత్తయితే, ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించడం మరో ఎత్తుగా మారింది. ముఖ్యంగా పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల వారు కొత్తగూడెం లేదా భద్రాచలం వెళ్లాలంటే ప్రయాణం భారంగా మారుతోంది. కరకగూడెం, పినపాక, గుండాల, ఆళ్లపల్లి మండలాల వారికి మరీ ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఒకసారి వెళ్తే ఆన్‌లైన్ సమస్య ఏర్పడితే మరోసారి వెళ్లాల్సి ఉంటుంది. వస్తుంది. కరకగూడెం మండలం నుంచి భద్రాచలానికి సుమారు 75 కిలోమీటర్లు, ఆళ్లపల్లి నుంచి 40 కిలోమీటర్లు, గుండాల నుంచి 65 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇక అశ్వారావుపేట నుంచి కొత్తగూడేనికి 70, దమ్మపేట నుంచి 50 కిలోమీటర్లు వెళ్తేనే రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంటుంది.
మణుగూరులో ఏర్పాటు చేయాలి...
పినపాక నియోజకవర్గ కేంద్రంగా ఉన్న మణుగూరులో ఆర్టీఏ కార్యాలయం ఏర్పాటు చేయాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. పారిశ్రామిక ప్రాంతమైన మణుగూరులో ద్విచక్ర వాహనాల, ఆటోలు, కార్లు, ట్రాక్టర్ల వినియోగం ఎక్కువ. పినపాకలో బీటీపీఎస్, మణుగూరులో సింగరేణి గనులు, అశ్వాపురంలో హెవీవాటర్ ప్లాంట్, సారపాకలో ఐటీసీ పరిశ్రమలు ఉండడంతో రవాణాకు ఉపకరించే వాహనాలతో పాటు, వ్యవసాయ ఆధారిత ప్రాంతం అధికంగా ఉండటంతో మూలంగా ట్రాక్టర్ల వంటివి కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణంలో భాగంగా ట్రాన్స్‌పోర్ట్, నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు, సింగరేణిలో గనుల విస్తరణతో భారీ యంత్రాల వినియోగం పెరుగుతోంది. వీటన్నింటి రిజిస్ట్రేషన్‌కు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో మణుగూరులో రవాణా శాఖ యూనిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment